Money for mini-gokulas మినీ గోకులాలకు మనీ
ABN , Publish Date - Aug 12 , 2025 | 12:24 AM
Money for mini-gokulas జిల్లాలో మినీ గోకులాల పేరుతో గోశాలలు నిర్మించుకున్న రైతులకు శుభవార్త. వారి అకౌంట్‌లలో త్వరలో డబ్బులు జమ కానున్నాయి. గత టీడీపీ హయాంలో గ్రామాల్లో మినీ గోకులాల పేరుతో గోశాలలు నిర్మించుకున్నారు. ఆ బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఈ ప్రభుత్వం ఆ రైతుల అకౌంట్‌లలో బ్యాలన్స్ డబ్బులను జమ చేయడానికి ఉపాధి హామీ పథకం ద్వారా ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాకు సంబంధించి రూ.3కోట్ల 33 లక్షల 63 వేలు త్వరలో పంపిణీ చేయబోతున్నారు.
మినీ గోకులాలకు మనీ
రైతులకు శుభవార్త
అకౌంట్‌లలో త్వరలో పెండింగ్ బిల్లులు జమ
జిల్లాలో రూ.3 కోట్ల 33 లక్షల 63 వేలు విడుదల
కొత్తవలస, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మినీ గోకులాల పేరుతో గోశాలలు నిర్మించుకున్న రైతులకు శుభవార్త. వారి అకౌంట్‌లలో త్వరలో డబ్బులు జమ కానున్నాయి. గత టీడీపీ హయాంలో గ్రామాల్లో మినీ గోకులాల పేరుతో గోశాలలు నిర్మించుకున్నారు. ఆ బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఈ ప్రభుత్వం ఆ రైతుల అకౌంట్‌లలో బ్యాలన్స్ డబ్బులను జమ చేయడానికి ఉపాధి హామీ పథకం ద్వారా ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాకు సంబంధించి రూ.3కోట్ల 33 లక్షల 63 వేలు త్వరలో పంపిణీ చేయబోతున్నారు.
2016-2018 వరకు మినీ గోకులాల పేరుతో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 90 శాతం రాయితీపై గోశాలల నిర్మాణం కోసం రైతులను ప్రోత్సహించింది. ఆరు పశువులకు సంబంధించి షెడ్డు నిర్మించుకుంటే రూ.లక్షా 60 వేలు, నాలుగు పశువులకు రూ. లక్షా 30 వేలు చొప్పున మంజూరు చేసింది. కానీ అందరికీ బిల్లులు అందలేదు. జిల్లా వ్యాప్తంగా 2,122 షెడ్లను నిర్మించుకున్నారు. వీటికి సంబంధించి ప్రతి రైతు తమ షెడ్డు నిర్మాణానికి అయిన ఖర్చు చూపించే బిల్లులను, షెడ్డు ఫొటో తీసి పశుసంవర్ధకశాఖాధికారులకు అందచేశారు. బిల్లులు జమ చేయడానికి ఎం. బుక్‌లు సిద్ధం చేశారు. కానీ డబ్బులు జమ కాలేదు. అప్పట్లో చాలా మంది రైతులు అప్పులు చేసి గోకులాలను నిర్మించుకున్నారు. బిల్లులు చెల్లించాలంటూ కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు. ఆ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కొంతమంది హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయినా కూడా రైతులకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులను విత్ హెల్డ్‌లో ఉంచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే మినీ గోకులాలకు సంబంధించి పెండింగ్ బిల్లుల వివరాలను తీసే పనిలో పడింది. వివరాలన్నీ పశు సంవర్ధకశాఖ దగ్గర ఉండేవి. సంవత్సరాలు గడిచి పోవడంతో పూర్తి వివరాలు తమ వద్ద లేవని ఆశాఖ అధికారులు చేతులెత్తేశారు. తాజాగా ప్రభుత్వం ఆ బాధ్యతను ఉపాఽధి హామీ పథకం సిబ్బందికి అప్పగించింది. విత్‌హెల్డ్‌లో బిల్లుల పెండింగ్‌లో ఉన్న రైతుల జాబితాలను సేకరించారు. ఉపాధి టెక్నికల్ సిబ్బంది ఇళ్లకు వెళ్లి రైతుల వివరాలు, వారు నిర్మాణం చేసిన గోశాలలను పరిశీలిస్తున్నారు. రైతుఫొటోను, పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్‌లను అప్‌లోడ్ చేస్తున్నారు. 15 రోజుల్లో పెండింగ్ బిల్లులు రైతు అకౌంట్‌లలో పడతాయని ఉపాధి హామీ పథకం సిబ్బంది రైతులకు తెలియజేస్తున్నారు.
ఆ బిల్లులు వస్తాయనుకోలేదు
మేడిశెట్టి వెంకటరమణ, గోశాల నిర్మాణం చేసిన రైతు , రామలింగపురం
రామలింగపురం గ్రామంలో 2017లో గోకులం పథకం కింద మినీ గోశాల నిర్మాణం చేసుకున్నాను. ఇందుకు సంబంధించి 2023లో అరకొరగా బిల్లులు అకౌంట్‌లో జమ చేశారు. బ్యాలన్స్ డబ్బులు వస్తాయనుకోలేదు. ఇప్పుడు ఉపాధి హామీ పథకం సిబ్బంది వచ్చి త్వరలోనే పెండింగ్ బిల్లులు జమ చేస్తామని చెప్పారు.