అమ్మా.. ఉదయానికి వచ్చేస్తా..
ABN , Publish Date - Dec 31 , 2025 | 12:18 AM
అమ్మా.. ఉదయానికల్లా ఇంటికి వచ్చేస్తా.. అని ఓ కొడుకు తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు.
రైలు నుంచి జారిపడి యువకుడి మృతి
గుర్ల, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): అమ్మా.. ఉదయానికల్లా ఇంటికి వచ్చేస్తా.. అని ఓ కొడుకు తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. ఫోన్ చేసిన గంట సమయంలోనే రైలు కింద జారిపడి మృతిచెందినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా గుర్ల మండలం, గొలగాం గ్రామానికి చెందిన కంది సాయిరాం(26) గత కొంత కాలంగా బెంగు ళూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం తన స్వగ్రామం వెళ్లేందుకు బెంగుళూరులోని రైల్వే స్టేషన్‌కు చేరు కున్నాడు. రైలు ఎక్కే ముందు తల్లిదండ్రులకు, అన్నయ్యకు ఫోన్‌చేసి.. ఉదయా నికి వచ్చేస్తానని చెప్పాడు. తన కొడుకు వస్తాడని ఆ తల్లి ఆత్రుతగా ఎదురు చూసింది. ఉదయాన్నే రామతీర్థంలో గిరి ప్రదక్షిణకు వెళ్తానని కూడా చెప్పినట్టు తల్లి తెలిపింది. ఇంతలోనే చేదు కబురు ఇంటికి చేరింది. రైలు బయలుదే రే సమయంలో రైలు నుంచి జారిపడి మృతిచెందినట్టు ఫోన్ ద్వారా సమాచారం అందింది. దీంతో ఇళ్లంతా ఒక్కసారిగా విషాధంలో మునిగిపోయింది. మృతుడికి తల్లిదండ్రులు కంది విశ్వనాథం, అప్పలనరసమ్మతో పాటు అన్నయ్య, చెల్లి ఉన్నా రు. అన్నయ్యకి, చెల్లికి పెళ్లిళ్లు అయ్యాయి. సాయిరాంకు వచ్చే సంవత్సరం పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఆలోచనలో ఉన్న తరుణంలో ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని తీసుకురా వడానికి కొంతమంది బంధువులు బెంగుళూరు బయలుదేరి వెళ్లారు.