Share News

mini bus accident అరకు ఘాట్‌ రోడ్డులో మినీ బస్సు బోల్తా

ABN , Publish Date - Jul 22 , 2025 | 11:57 PM

Mini bus overturns on Araku Ghat road అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు ఘాట్‌ రోడ్డులో మినీ బస్సు మంగళవారం బోల్తా కొట్టింది. ప్రమాదంలో 21 మందికి గాయాలయ్యాయి. డ్రైవర్‌ కుమార్‌స్వామి చాకచక్యంతో ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు. బ్రేకులు ఫెయిలై లోయలో పడాల్సిన బస్సును కొండను ఢీకొట్టేలా చేయడంతో గాయాలతో బయటపడ్డామని క్షతగాత్రులు తెలిపారు.

mini bus accident అరకు ఘాట్‌ రోడ్డులో మినీ బస్సు బోల్తా
ఎస్‌.కోట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

అరకు ఘాట్‌ రోడ్డులో మినీ బస్సు బోల్తా

21 మందికి గాయాలు

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

లోయలో పడకుండా చూసిన డ్రైవర్‌

బాధితులంతా రాజమండ్రి వాసులు

విజయనగరం జిల్లా ఎస్‌.కోట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స

శృంగవరపుకోట, జూలై 22(ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు ఘాట్‌ రోడ్డులో మినీ బస్సు మంగళవారం బోల్తా కొట్టింది. ప్రమాదంలో 21 మందికి గాయాలయ్యాయి. డ్రైవర్‌ కుమార్‌స్వామి చాకచక్యంతో ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు. బ్రేకులు ఫెయిలై లోయలో పడాల్సిన బస్సును కొండను ఢీకొట్టేలా చేయడంతో గాయాలతో బయటపడ్డామని క్షతగాత్రులు తెలిపారు. వారంతా విజయనగరం జిల్లా శృంగవరపుకోట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడ్డవారంతా రాజమండ్రి వాసులు. వారితో మినీ బస్సులో ప్రయాణించిన ఎస్‌.నాని తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

రాజమండ్రి పరిసర ప్రాంతాలకు చెందిన యువతీ, యువకులు 20 మంది వరకు రాజమండ్రి జైన్‌ రోడ్డులోని అడమ్‌ సెలూన్‌లో పనిచేస్తున్నారు. వీరంతా అరకు చూడాలనుకున్నారు. ఓ మినీ బస్సులో సోమవారం రాత్రి రాజమండ్రి నుంచి బయలుదేరారు. మంగళవారం ఉదయం నుంచి బొర్రాగుహలు, అరకు, అనంతగిరి ప్రాంతాల్లో వున్న జలపాతాలను చూశాక సాయంత్రం రాజమండ్రికి తిరుగు ప్రయాణమయ్యారు. ఆరు గంటల సమయంలో శివలింగపురం, టైడా మధ్యకు వచ్చేసరికి మినీ బస్సుకు బ్రేక్‌లు ఫెయిల్‌ అయినట్లు డ్రైవర్‌ కుమార్‌స్వామి గుర్తించారు. రోడ్డుకు ఒక పక్కలోయ, మరో పక్క కొండ ఉంది. బస్సు లోయవైపు లాగేస్తుండగా బస్సు ఆగకుండా చూసి మరోపక్క నున్న కొండను ఢీకొట్టాడు. దీంతో మినీ బస్సు బోల్తాపడింది. బస్సులో ఉన్న వారందరికీ సీట్లు, రాడ్లు, అద్దాలు తగిలి గాయపడ్డారు. కొందరికి తలకు తీవ్రగాయాలు కాగా మరి కొందరికి కాళ్లు, చేతులు విరిగాయి. ప్రమాదంపై శృంగవరపుకోట 108 వాహన ఉద్యోగులు ఎంఎస్‌ఎన్‌ మూర్తి, రమేష్‌కు సమాచారం అందింది. వీరు సంఘటనా స్థలానికి వెంటనే చేరుకొని తీవ్రంగా గాయపడ్డవారిని శృంగవరపుకోట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఎస్‌.కోట నుంచి మరో 108 వాహనంలో మరికొందరిని తీసుకొచ్చారు. మిగిలిన వారిని అల్లూరి జిల్లా అనంతగిరి ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన అంబులెన్స్‌లో తెచ్చారు. వీరందరికీ ఎస్‌.కోట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చికిత్స అందించారు. డ్రైవర్‌తో సహా 21 మంది గాయపడ్డారు. డ్రైవర్‌ కుమార్‌ స్వామి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

Updated Date - Jul 22 , 2025 | 11:57 PM