పాల ఉత్పత్తి లక్ష్యం
ABN , Publish Date - Dec 27 , 2025 | 12:29 AM
జిల్లాలో 2025-2026 సంవత్సరానికి 8,36,800 మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి పెంపును లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ కె.మురళి కృష్ణ తెలిపారు.
8.36 లక్షల మెట్రిక్ టన్నులు
- ప్రతి నియోజకవర్గంలో పశువుల వసతి గృహం
- జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ మురళికృష్ణ
గంట్యాడ, డిసెంబరు 26 (ఆంరఽధజ్యోతి): జిల్లాలో 2025-2026 సంవత్సరానికి 8,36,800 మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి పెంపును లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ కె.మురళి కృష్ణ తెలిపారు. శుక్రవారం గంట్యాడలోని పశుసంవర్ధక ఏడీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘గత ఏడాది జిల్లాలో 7.52లక్షల మెట్రిక్ టన్నుల పాలు ఉత్పత్తి జరిగింది. ఈ ఏడాది మరో 84,800 మెట్రిక్ టన్నులు పెంచుతాం. జిల్లాలో 2 లక్షల 60 వేల పశువులు ఉన్నాయి. వీటిని ద్వారా పాల ఉత్పత్తి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. హరిత గోపాలం పథకం ద్వారా ప్రతి రైతు ఉపాధి నిధులతో పశుగ్రాసం పెంచుకోవచ్చు. పశువులకు మంచి గ్రాసం వేస్తే పాల ఉత్పత్తి పెరుగుతుంది. పెయ్యిల ఉత్పత్తి పథకం ద్వారా జిల్లాలో 15వేల పెయ్యిలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటి వరకూ 6వేలు చేశాం. మరో 9 వేలు చేయాల్సి ఉంది. జనవరిలో చూడికి రాని పశువులకు చికిత్స చేయడానికి ప్రత్యేక శిబిరం నిర్వహిస్తాం. పాడి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు మంజూరు చేస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఒక పశువుల వసతి గృహాన్ని ఏర్పాటు చేస్తాం. ఒక్కొక్క గృహానికి ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు రూ.10 లక్షలు కేటాయిస్తున్నాం. 50సెంట్ల విస్తీర్ణంలో వీటిని ఏర్పాటు చేస్తాం. ఇందులో 24 పశువులను ఉంచుకోవచ్చు. లక్కిడాం(గంట్యాడ) వాడాడ(బొబ్బిలి), లచ్చంపేట(ఎస్.కోట), పూసపాటిరేగ, కోరుకొండపాలెం(విజయనగరం), బాలికవలస(రాజాం), గుర్లతమ్మిరాజుపేట(మెంటాడ), గేదలమర్రివలస(చీపురుపల్లి)లో వీటిని ఏర్పాటు చేస్తున్నాం.’అని తెలిపారు. ఈ సమావేశంలో పశుసంవర్ధశాఖ ఏడీ రెడ్డి కృష్ణ పాల్గొన్నారు.