ఘనంగా మిలాద్ ఉన్ నబి వేడుకలు
ABN , Publish Date - Sep 05 , 2025 | 11:12 PM
మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రం పార్వతీపురంలో శుక్రవారం మిలాద్ ఉన్ నబి వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహించారు.
పార్వతీపురంటౌన్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రం పార్వతీపురంలో శుక్రవారం మిలాద్ ఉన్ నబి వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు సయ్యిద్ ఇబ్రహీం హుస్సేన్ ఆధ్వర్యంలో పాలకొండ రోడ్డులోని జామియా మసీదు నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పాల్గొని మాట్లాడారు. మహ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అల్లా ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుతున్నానని అన్నారు. ప్రవక్త సూచించిన విధంగా ప్రతి ఒక్కరూ శాంతి మార్గంలో పయనించాలన్నారు. అనంతరం జామియా మసీదు గురువు షరీఫ్ రబ్బానీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. కార్యక్రమంలో మైనార్టీ సంఘ నాయకులు రజాక్, సఫీ, జలాల్, ఫిరోజ్, బ్బాజానీ, తదితరులు పాల్గొన్నారు.