₹100 Crore ‘ఉపాధి’ బకాయిలు రూ.100 కోట్లు
ABN , Publish Date - May 03 , 2025 | 11:10 PM
MGNREGA Wage Arrears of ₹100 Crore ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్‌తో జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులకు చెల్లింపులు జరగడం లేదు. కొద్ది నెలలుగా బిల్లులు మంజూరు కావడం లేదు. పనుల ప్రాప్తికి అధికారులు బిల్లులు అప్‌లోడ్ చేస్తున్నా.. కేంద్రం నుంచి నిధులు రావడం లేదు. దీంతో రూ.100 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయినట్లు తెలుస్తోంది.
నెలలు గడుస్తున్నా చెల్లింపులు జరగని వైనం
పేరుకుపోతున్న బిల్లులు
అప్‌లోడ్ చేస్తున్నా.. మంజూరు చేయని కేంద్రం
తలలు పట్టుకుంటున్న వెండర్‌దారులు
సమాధానం చెప్పలేకపోతున్న అధికారులు
పార్వతీపురం, మే 3(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్‌తో జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులకు చెల్లింపులు జరగడం లేదు. కొద్ది నెలలుగా బిల్లులు మంజూరు కావడం లేదు. పనుల ప్రాప్తికి అధికారులు బిల్లులు అప్‌లోడ్ చేస్తున్నా.. కేంద్రం నుంచి నిధులు రావడం లేదు. దీంతో రూ.100 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రూపాయి కూడా చెల్లించకపోవడంతో వెండర్‌దారులు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా మంజూరైన పనులు చేపట్టేందుకు కూడా ముందుకు రావడం లేదు. ఇప్పటికే అప్పులు చేసి మరీ సీసీ, బీటీ రోడ్లు, సీసీ కాలువలు, ప్రహరీలు తదితర అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున చేపట్టారు. నిర్మాణాలు వేగవంతంగా పూర్తిచేయించడంలో జిల్లా అధికారులు సైతం సఫలీకృతులయ్యారు. అయితే ఈ ఏడాది మార్చి 31 నాటికి పూర్తిస్థాయిలో బిల్లుల చెల్లింపులు కాకపోవడంతో వెండర్‌దారులుతమ అప్పులకు వడ్డీలు చెల్లించకలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన పనులకు వెంట వెంటనే బిల్లులు చెల్లింపులు చేపట్టారు. అంతేగాకుండా గత వైసీపీ ప్రభుత్వ కాలంలో చేపట్టిన నిర్మాణాలకూ బిల్లులు చెల్లించారు. దీంతో కాంట్రాక్టర్లు పోటాపోటీగా అభివృద్ధి పనులు చేపట్టారు. కానీ కొద్ది నెలలుగా బిల్లులు మంజూరు కాకపోవడంతో వారు లబోదిబో మంటున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనులు వేగవంతంగా పూర్తి చేయాలని మరోవైపు రాష్ట్రస్థాయి అధికారులు జిల్లా యంత్రాంగంపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. దీంతో వారు నిర్మాణాలపై దృష్టి సారిస్తున్నా.. కాంట్రాక్టర్లు సహకరించడం లేదు. చెల్లింపులు లేకపోతే ఎలా పనులు చేస్తామని వారు ప్రశ్నిస్తుండడంతో ఉపాధి సిబ్బంది తలలు పట్టుకుం టున్నారు. ఉన్నతాధికారులు, కాంట్రాకర్లకు సమాధానం చెప్పలేక.. లక్ష్యాన్ని ఎలా నెరవేర్చాలో తెలియక నానా అవస్థలు పడుతున్నారు.
మంజూరైన వెంటనే చెల్లింపులు
ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో చేపట్టిన పనులకు త్వరలోనే బిల్లుల చెల్లింపులు జరుగుతాయి. త్వరలోనే నిధులు మంజూరవుతాయి. ఉపాధి వేతనదారుల చెల్లింపులు చాలా వరకు పూర్తయ్యాయి.
- రామచంద్రరావు, డ్వామా పీడీ, పార్వతీపురం మన్యం