Share News

దుకాణాలపై మెట్రాలజీ అధికారుల దాడులు

ABN , Publish Date - Dec 25 , 2025 | 10:39 PM

కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి ఆదేశాల మేరకు సాలూరు పట్టణంలోని ప్రధాన వ్యాపార కూడళ్లలో లీగల్‌ మెట్రాలాజీ(తూనికలు, కొలతల శాఖ) అధికారులు గురువారం మెరుపుదాడులు నిర్వహించారు.

దుకాణాలపై మెట్రాలజీ అధికారుల దాడులు
స్వాధీనం చేసుకున్న ఎలక్ర్టానిక్‌ కాటాలు

-ఎలక్ర్టానిక్‌ కాటాల్లో భారీగా తేడాలు గుర్తింపు

- 19 కేసుల నమోదు

సాలూరు, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి ఆదేశాల మేరకు సాలూరు పట్టణంలోని ప్రధాన వ్యాపార కూడళ్లలో లీగల్‌ మెట్రాలాజీ(తూనికలు, కొలతల శాఖ) అధికారులు గురువారం మెరుపుదాడులు నిర్వహించారు. జిల్లా అసిస్టెంట్‌ కంట్రోలర్‌ పీవీ రంగారెడ్డి నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద చేపల మార్కెట్‌, పెద్ద బజారులోని చికెన్‌, మటన్‌, చేపల దుకాణాలు, కిరాణా షాపుల్లో తనిఖీలు చేశారు. వివిధ దుకాణాల్లో ఎలక్ర్టానిక్‌ కాటాల్లో భారీగా తేడాలు ఉన్నట్లు గుర్తించారు. ఎలక్ర్టానిక్‌ కాటాల్లో మోసానికి సంబంధించి 8 కేసులు, ప్రభుత్వ ముద్రలు వేయని కాటాలకు సంబంధించి 6 కేసులు నమోదు చేశారు. సరుకుల ప్యాకెట్లపై తయారీదారు పేరు, చిరునామా, ధర, తయారీ తేదీ వంటి వివరాలు లేనందున 5 కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్‌ కంట్రోలర్‌ రంగారెడ్డి మాట్లాడుతూ.. వినియోగదారులను మోసం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. తూనికలు, కొలతల్లో తేడాలు లేకుండా సరుకులు విక్రయించాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని వ్యాపారస్థులను హెచ్చరించారు. ఈ తనిఖీల్లో పార్వతీపురం లీగల్‌ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్‌ కె.రత్నరాజు, విజయనగరం ఇన్‌స్పెక్టర్‌ బి.ఉమాసుందరి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 25 , 2025 | 10:39 PM