Share News

Mention it.. please! ప్రస్తావించండి.. ప్లీజ్‌!

ABN , Publish Date - Sep 17 , 2025 | 11:53 PM

Mention it.. please! కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 15 నెలలు అవుతోంది. పాలన గాడిన పడినప్పటికీ సమస్యలు చాలా ఉన్నాయి. అభివృద్ధి, ఉపాధి, రహదారులు, మౌలిక వసతులు ఇంకా మెరుగు పడలేదు. మరోసారి అసెంబ్లీ సమావేశాలకు సమయం ఆసన్నంకావడంతో ప్రజల ఆశలన్నీ ఎమ్మెల్యేలపైనే ఉన్నాయి. ఈసారి తమ గళం వినిపించాలని, సాధ్యమైనన్ని నిధులు కేటాయించేలా చొరవ ప్రదర్శించాలని కోరుకుంటున్నారు. మరి ప్రస్తావిస్తారో.. విస్మరిస్తారో చూడాలి.

Mention it.. please! ప్రస్తావించండి.. ప్లీజ్‌!

ప్రస్తావించండి.. ప్లీజ్‌!

జిల్లాలో పట్టాలెక్కని ప్రాజెక్టులు

మెరుగుపడని రహదారులు

తెరుచుకోని పరిశ్రమలు

మౌలిక వసతుల కల్పనదీ అదే తీరు

ఎమ్మెల్యేల చొరవ కోసం ఎదురుచూపులు

నేటి నుంచి శాసనసభ సమావేశాలు

కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 15 నెలలు అవుతోంది. పాలన గాడిన పడినప్పటికీ సమస్యలు చాలా ఉన్నాయి. అభివృద్ధి, ఉపాధి, రహదారులు, మౌలిక వసతులు ఇంకా మెరుగు పడలేదు. మరోసారి అసెంబ్లీ సమావేశాలకు సమయం ఆసన్నంకావడంతో ప్రజల ఆశలన్నీ ఎమ్మెల్యేలపైనే ఉన్నాయి. ఈసారి తమ గళం వినిపించాలని, సాధ్యమైనన్ని నిధులు కేటాయించేలా చొరవ ప్రదర్శించాలని కోరుకుంటున్నారు. మరి ప్రస్తావిస్తారో.. విస్మరిస్తారో చూడాలి.

విజయనగరం, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం లభిస్తోంది. ఒకవైపు పాలనను గాడిలో పెడుతూనే అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతోంది. అదే సమయంలో ఎమ్మెల్యేల చొరవతో నియోజకవర్గాల సమస్యలు సైతం పరిష్కారం అవుతున్నాయి. అయితే శాశ్వత సమస్యల పరిష్కారంలో మాత్రం ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. కీలకమైన ప్రాజెక్టుల పనులు పడకేశాయి. చాలా రహదారులు మెరుగుపడలేదు. మూతపడిన పరిశ్రమలు తెరుచుకోవడం లేదు. ఈ తరుణంలో గురువారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో జిల్లా సమస్యలను ప్రస్తావించి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తారని ఎమ్మెల్యేలపై జిల్లా వాసులు ఆశలు పెట్టుకున్నారు.

వ్యసాయ అనుబంధరంగాలు..

విజయనగరం వ్యవసాయ ఆధారిత జిల్లా. వ్యవసాయంతో పాటు అనుబంధరంగాలు ఎక్కువే. కానీ వాటి అభివృద్ధి, పురోగతి విషయంలో ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదు. జనపనార, ఫెర్రో అల్లాయూస్‌, చక్కెర పరిశ్రమలు ఉపాధి వనరులు. వైసీపీ ప్రభుత్వం పుణ్యమా అని సంక్షోభంలో పడ్డాయి. వేలాది మంది కార్మిక కుటుంబాలు వీధినపడ్డాయి. పరోక్షంగా అంతుకు మించిన కుటుంబాలు నష్టపోయాయి. ఇందులో జనపనార, చక్కెర కర్మాగారాలు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు. వీటి భవిష్యత్‌ ఏంటో స్పష్టత లేదు. అసెంబ్లీ వేదికగా వాటిని ఉద్ధరించే చర్యలు తీసుకోవాలని ప్రజలు, కార్మికులు కోరుకుంటున్నారు. జిల్లాలో గోగు పంట 1.08 లక్షల ఎకరాల నుంచి 30 వేల ఎకరాలకు పడిపోయింది. ఉమ్మడి జిల్లాలోని బొబ్బిలి, రాజాం, సాలూరు ప్రాంతాల్లో ఈ పంట ఆధారంగా నడిచిన 20 వరకూ పరిశ్రమలు మూతపడ్డాయి. చక్కెర పరిశ్రమలదీ అదే తీరు. ఉమ్మడి జిల్లాలో రెండు చక్కెర పరిశ్రమలు సహకార రంగంలో నడిచేవి. సీతానగరం ఎన్‌సీఎస్‌ మూతపడింది. భీమసింగి కర్మాగారం ఆధునికీకరణ పేరుతో నిలిపివేసి ఏళ్లు గడుస్తోంది.

ఆ రోడ్లపై స్పష్టత ఇవ్వాలి

జిల్లాలో అంతర్‌ రాష్ట్ర, జిల్లా రహదారులు ఉన్నాయి. ఐదేళ్ల వైసీపీ పాలనలో దారుణంగా తయారయ్యాయి. తగరపువలస-విజయనగరం-రాజాం రహదారి ప్రధానమైనది. గత ఐదేళ్లలో కనీస నిర్వహణ లేక దారుణంగా మారింది. దీనిని పీపీపీ పద్ధతిలో పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది కానీ ఇది ప్రకటనలకే పరిమితమైంది. డీపీఆర్‌లో ప్రతికూల నివేదికలు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం నుంచి సానుకూలత వచ్చేలా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. చీపురుపల్లి రైల్వేవంతెన నిర్మాణం నత్తనడకన సాగుతోంది. దీంతో విజయనగరంతో పాటు పార్వతీపురం మన్యం జిల్లా వాసుల కష్టాలు తప్పడం లేదు. పారాది వంతెన నిర్మాణం త్వరితగతిన పూర్తిచేయాల్సిన అవసరం కూడా ఉంది. జిల్లాలో 884 కిలోమీటర్ల మేర రోడ్లు దారుణంగా తయారయ్యాయి. వీటి మరమ్మతులకు కూటమి ప్రభుత్వం రూ.23.52 కోట్లు మంజూరు చేసింది. మిగతా వాటి నిర్మాణంపై సైతం ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరముంది.

గిరిజన యూనివర్సిటీ భవనాలు ఎప్పటికో!

జిల్లాలో గిరిజన విశ్వ విద్యాలయం రూపుదాల్చడానికి 11 సంవత్సరాలు పట్టింది. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా అప్పట్లో గిరిజన యూనివర్సిటీని కేటాయించారు. తొలుత శృంగవరపుకోట నియోజకవర్గంలోని రెల్లిలో స్థల ఎంపికను పూర్తిచేశారు. 500 ఎకరాల్లో యూనివర్సిటీ ఏర్పాటుకు 2014లోనే సీఎం చంద్రబాబు వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం యూనివర్సిటీని దత్తిరాజేరు-మెంటాడ మండలాల్లోని సరిహద్దు ప్రాంతాలకు మార్చింది. టీడీపీ ప్రభుత్వం ఎంపికచేసిన స్థలంలోనే పనులు పూర్తిచేసి ఉంటే కొత్త భవనాలు అందుబాటులోకి వచ్చేవి. ప్రస్తుతం 519 ఎకరాల్లో పనులు ప్రారంభించారు. ఇక్కడే కొనసాగించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వీటి పనులు శరవేగంగా జరిపించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.

పడకేసిన వైద్యం కళాశాల పనులు

జిల్లాలో విద్య, వైద్యరంగాలపై దృష్టిపెట్టాల్సిన అవసరముంది. ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం పూర్తిచేయడంపై దృష్టిపెట్టాలి. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో దీనిపై ఒక నిర్ణయానికి వచ్చారు. పీపీపీ పద్ధతిలో మెడికల్‌ కాలేజీ నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. దీనిపై ప్రభుత్వాన్ని స్పష్టత కోరాలి.

జెట్టీ కొలిక్కివచ్చేనా?

జిల్లాలో 27 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో పదుల సంఖ్యలో మత్స్యకార గ్రామాలున్నాయి. వీటి పరిధిలో జెట్టి నిర్మాణం చేపట్టాలన్న డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. తీర ప్రాంత పరిరక్షణకు పెద్ద ఎత్తున వనాలు పెంచాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ కార్యాచరణ ప్రారంభం కాలేదు. ఈ విషయంపై కూడా ఎమ్మెల్యేలు గళం ఎత్తాలని ప్రజలు కోరుకుంటున్నారు.

పడకేసిన పర్యాటకం..

జిల్లాలో పర్యాటక ప్రాంతాలకు కొదవ లేదు. కానీ వాటి అభివృద్ధి విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. జిల్లాలో 27 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉంది. విశాఖ జిల్లాకు ఆనుకుని ఉంది. అందుకే తీర ప్రాంతాల్లో పర్యాటకానికి సంబంధించి ఏర్పాట్లు చేయాలి. మరోవైపు తాటిపూడిలో బోటుషికారుతో పాటు పర్యాటక కాటేజీలను అభివృద్ధిలోకి తేవాలి. విజయనగరంలో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలున్నాయి. పెద్ద చెరువును పర్యాటకంగా తీర్చిదిద్దడంతో పాటు శుద్ధి చేపడితే విజయనగరం వాసులకు ఆహ్లాదాన్ని పెంచుతుంది. ఆ వైపుగా నేతలు చొరవ ప్రదర్శించాలి.

- గజపతినగరం నుంచి మెంటాడ వెళ్లే మార్గంలో రైల్వే వంతెన నిర్మాణానికి రూ.46.84 కోట్లు మంజూరయ్యాయి. త్వరతగతిన నిర్మాణం పూర్తిచెయ్యాలని ప్రజలు కోరుతున్నారు.

-------------------

Updated Date - Sep 17 , 2025 | 11:53 PM