ఎస్.కోటలో మెగా ఇండస్ట్రియల్ పార్కు
ABN , Publish Date - Oct 11 , 2025 | 12:15 AM
ఎస్.కోట మండలంలో మెగా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కానుంది.
- రూ.531 కోట్ల పెట్టుబడి
- మంత్రి వర్గం ఆమోదం
విజయనగరం, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ఎస్.కోట మండలంలో మెగా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కానుంది. ముసిడిపల్లి, చీడిపాలెం, చినఖండేపల్లి, మూలబొడ్డవర, కిల్తపాలెం గ్రామాల్లో జిందాల్ అల్యూమినియం (జేఎస్‌ఎల్) పరిశ్రమ కోసం గతంలో సేకరించిన 1,166.43 ఎకరాల్లో ప్రైవేట్ మెగా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర మంత్రి వర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. రూ.531 కోట్ల పెట్టుబడులతో బహుళ పారిశ్రామిక ఉత్పత్తులను తయారుచేసే విధంగా ఈ పార్కును నిర్మించనున్నారు. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 45 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. వ్యవసాయ ప్రాసెసింగ్, వస్త్రాలు, ఎలక్ట్రికల్ వాహనాల తయారీ, గ్రీన్ హైడ్రోజన్, లాజిస్టిక్స్ వంటి ఉత్పత్తులు, అనుబంధ రంగాలు ఇక్కడ అభివృద్ధి చెందనున్నాయి. తద్వారా జిల్లా అభివృద్ధి పథంలో నడవనుంది.
2006 జూన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎస్.కోట మండల పరిధిలో జిందాల్ అల్యూమినియం శుద్ధి కర్మాగారం కోసం భూములు సేకరించారు. కానీ వివిధ కారణాలతో పరిశ్రమ ఏర్పాటు కాలేదు. ఈ భూముల్లో ఎస్‌ఎంఎస్‌ఈ పార్కు ఏర్పాటు చేస్తామంటూ వైసీపీ సర్కారు హడావుడి చేసింది. రూ.1500 కోట్ల పెట్టుబడులు అంటూ ఆర్భాటం చేసింది. కానీ, ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. కూటమి ప్రభుత్వం రూ.531 కోట్ల పెట్టుబడితో భారీ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ముందుకు వచ్చింది. దీంతో జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.