Share News

Medical College మన్యంలో వైద్య కళాశాల

ABN , Publish Date - Sep 05 , 2025 | 12:18 AM

Medical College in Agency Area జిల్లావాసులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పార్వతీపురంలో వైద్య కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పీపీపీ విధానంలో రాష్ట్రంలో కొత్తగా పది వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Medical College   మన్యంలో వైద్య కళాశాల
గరుగుబిల్లి: గత వైసీపీ సర్కారు హయాంలో ఉల్లిభద్రలో పరిశీలించిన స్థలం ఇలా..

  • ఆమోదం తెలిపిన మంత్రి వర్గం

  • పీపీపీ విధానంలో మంజూరు

  • నెరవేరని గత వైసీపీ సర్కారు హామీ

  • కూటమి నిర్ణయంపై జిల్లావాసుల హర్షం

పార్వతీపురం, సెప్టెంబరు4(ఆంధ్రజ్యోతి): జిల్లావాసులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పార్వతీపురంలో వైద్య కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పీపీపీ విధానంలో రాష్ట్రంలో కొత్తగా పది వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెండు దశల్లో ఈ పనులు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కాగా దీనిపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రకటనలకే పరిమితమైన వైసీపీ

జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటుపై గత వైసీపీ ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైంది. అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ కురుపాంలో జరిగిన ఒక సమావేశంలో దీనిపై స్పష్టమైన హామీ ఇచ్చినా అది నెరవేరలేదు. మన్యం జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేసిన ఘనత వైసీపీకే దక్కుతుందని అప్పటి పాలకులు గొప్పలు చెప్పుకున్నా.. పనులేవీ చేయించలేకపోయారు. వైద్య కళాశాల ఏర్పాటు కోసం నాటి అధికారులు, ప్రజాప్రతినిధులు గురుగుబిల్లి మండలం ఉల్లిభద్రలో స్థల సేకరణ అంటూ హడావుడి చేశారు. కానీ శంకుస్థాపన కూడా చేయలేక పోయారు. ఈ క్రమంలో జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు ఆవశ్యకతను కూటమి ప్రభుత్వం గుర్తించింది. దీనిలో భాగంగానే మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లావాసుల కల నెరవేర్చేలా అడుగులు వేయనుండడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ఎంతో మందికి ఉపయోగం...

ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. జిల్లా కేంద్రంలో మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కూడా ఊపందుకోవడంతో మన్యం వాసులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. ఇకపై పొరుగు జిల్లాలకు పరుగులు పెట్టాల్సిన అవసరం ఉండదు. జిల్లా విద్యార్థులు స్థానికంగానే వైద్య విద్యనభ్యసించే వీలు కలుగుతుంది.

మన్యంపై ప్రత్యేక దృష్టి

‘సీఎం చంద్రబాబునాయుడు మన్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాకు పీపీపీ పద్ధతిలో వైద్య కళాశాల మంజూరు చేశారు. దీనికి మంత్రివర్గం ఆమోదం తెలపడం చాలా ఆనందంగా ఉంది. గత ప్రభుత్వం వైద్య కళాశాల మంజూరు చేస్తున్నట్టు ప్రకటించి ప్రజలను మోసం చేసింది. తాజాగా కూటమి ప్రభుత్వ నిర్ణయంతో జిల్లా ప్రజలకు ఎంతో మేలు కలగనుంది. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.’ అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి, పార్వతీపురం, పాలకొండ ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ తెలిపారు.

Updated Date - Sep 05 , 2025 | 12:18 AM