medical Care సంతలో వైద్యం!
ABN , Publish Date - Sep 16 , 2025 | 12:07 AM
medical Care at the Market! ఎటువంటి అర్హత.. పరిజ్ఞానం లేకుండా.. సంతలో వైద్యం అందించడమే కాదు.. ఆరుబయట కుర్చీలో రోగిని కూర్చోబెట్టి సెలైన్ బాటిల్ పెట్టి యథేచ్ఛగా దందా సాగిస్తున్నాడో ఓ సంచి వైద్యుడు. సీతంపేటలో సోమవారం కొత్తూరు మండలం మెట్టూరుకి చెందిన ఓ సంచి వైద్యుడు ప్రధాన రహదారి పక్కనే గిరిజనులకు వైద్యం అందించాడు.
నచ్చిన మందులు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్న వైనం
ఇది ఓ సంచి వైద్యుని దందా
ఎటువంటి అర్హత లేకున్నా.. గిరిజన ప్రాంతాల్లో వారిదే హవా
గిరిపుత్రుల ఆరోగ్యంపై ప్రభావం
సీతంపేట రూరల్, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): ఎటువంటి అర్హత.. పరిజ్ఞానం లేకుండా.. సంతలో వైద్యం అందించడమే కాదు.. ఆరుబయట కుర్చీలో రోగిని కూర్చోబెట్టి సెలైన్ బాటిల్ పెట్టి యథేచ్ఛగా దందా సాగిస్తున్నాడో ఓ సంచి వైద్యుడు. సీతంపేటలో సోమవారం కొత్తూరు మండలం మెట్టూరుకి చెందిన ఓ సంచి వైద్యుడు ప్రధాన రహదారి పక్కనే గిరిజనులకు వైద్యం అందించాడు. జ్వరం, వాంతులు, నీరసం, ఆయాసం వంటి ఆరోగ్య సమస్యలతో వచ్చే గిరిజనులకు వచ్చి రాని వైద్యం చేసి.. మందులు ఇచ్చి సొమ్ము చేసుకున్నాడు. అంతేకాకుండా నీరసంగా ఉందని వచ్చే గిరిజన మహిళలకు కుర్చీలో కూర్చొబెట్టి సెలైన్ బాటిల్ ఎక్కించాడు. ఇది చూసిన కొందరు ముక్కున వేలేసుకున్నారు. ఇలా ప్రతి సోమవారం వారపుసంతకు వచ్చే అమాయక గిరిజనులకు వైద్యం చేయడం, వారి నుంచి కాసులు దండుకోవడం ఈ సంచి వైద్యునికి పరిపాటిగా మారింది. కాగా సీతంపేట ఏజెన్సీలో ఎంతోమంది సంచి వైద్యులు పై విధంగా వ్యవహరిస్తున్నారు. గిరిపుత్రుల అమాయకత్వాన్ని అలుసుగా చేసుకొని సొమ్ము చేసుకుంటున్నారు. వచ్చీ రాని వైద్యం చేస్తూ.. వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇటీవల కాలంలో జిల్లాలోని సంచి వైద్యులపై జిల్లా అధికారులు ప్రత్యేక నిఘా పెట్టడంతో కొంతమేర వీరి ఆగడాలకు అడ్డుకట్ట పడింది. ఏజెన్సీలో వైద్యం చేయాలంటే తప్పకుండా అర్హులై ఉండాలని కలెక్టర్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. దీనిపై పోలీస్, రెవెన్యు, వైద్యశాఖ అధికారులు అప్రమత్తమై తనిఖీలు కూడా చేపట్టారు. దీంతో కొంతవరకు మన్యంలో సంచి వైద్యుల సంచారం తగ్గుముఖం పట్టింది. అయితే గడిచిన కొద్ది రోజులుగా వీరి పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.
మెడికల్ షాపుల్లోనూ ఇదే తంతు
మండలంలో కొంతమంది మందుల దుకాణ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. టైఫాయిడ్, మలేరియా, పచ్చ కామెర్లు, డెంగ్యూ తదితర రోగులకు ఐవీ (ఇంటర్ వీనస్), ఐఎం(ఇంటర్ మస్క్యులర్)వంటి ఇంజక్షన్లు వేసి వారి వద్ద నుంచి అదనంగా డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీతంపేట మన్యంలో అటు సంచి వైద్యులు, ఇటు మందుల దుకాణాల నిర్వాహకులు నేరుగా రోగులకు ఈ ఇంజక్షన్‌లను వేయడం ఇక్కడ సర్వసాధారణమైంది. కొద్ది రోజులు కిందట ఈతమానుగూడకి చెందిన సవర భాస్కరరావు జ్వరంతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ల్యాబ్‌ను ఆశ్రయించాడు. అక్కడున్న సిబ్బంది ఇంజక్షన్ చేయగా.. భాస్కరరావు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయన్ని సీతంపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇలా ఎంతోమంది గిరిజనులు అకారణంగా మృత్యువాతపడుతున్నా.. వెలుగులోకి రావడం లేదు. దీనిపై డీఎంహెచ్‌వో భాస్కరరావును వివరణ కోరగా.. ఏజెన్సీ ప్రాంతాల్లో సంచి వైద్యులు చేస్తున్న వైద్యంపై గతంలోనే డ్రైవ్ నిర్వహించాం. అర్హత లేకున్నా వైద్యం చేస్తే కఠినంగా వ్యవహరిస్తాం. మరోసారి మన్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం.’ అని తెలిపారు.