Medical Camps వారపు సంతల్లో వైద్య శిబిరాలు
ABN , Publish Date - Sep 22 , 2025 | 12:11 AM
Medical Camps at Weekly Markets జిల్లాలోని 20 ప్రదేశాల్లో జరిగే గిరిజన వారపు సంతల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్‌లో వైద్యాధికారులతో మాట్లాడుతూ.. సంతలకు వచ్చే గిరిజనులకు రక్తపరీక్షలు నిర్వహించాలన్నారు.
పార్వతీపురం, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 20 ప్రదేశాల్లో జరిగే గిరిజన వారపు సంతల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్‌లో వైద్యాధికారులతో మాట్లాడుతూ.. సంతలకు వచ్చే గిరిజనులకు రక్తపరీక్షలు నిర్వహించాలన్నారు. ఉచిత వైద్యంతో పాటు మందులను అందించాలని సూచించారు. మలేరియా, టైఫాయిడ్, చికున్ గున్యా వంటి వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి సోమవారం నవగాం, నీలకంఠా పురం, సీతంపేట, మంగళవారం నేరేళ్లవలస, గుమ్మలక్ష్మీపురం, తాడికొండ, మొండెంఖల్, బుధవారం నాందేడు వలస, మర్రిపాడు, జీఎల్‌పురంలో శిబిరాలు నిర్వహించాలన్నారు. గురువారం పార్వతీపురం మార్కెట్ యార్డు వద్ద, దుగ్గేరు, కురుపాం ప్యాలెస్ రోడ్డు , శుక్రవారం బలిజిపేటలోని సంతతోట, వేటగానివలసలో, శనివారం నంద, గోరాడ, సీతానగరంలోని మార్కెట్ వద్ద, కుశిమి, తోణాం బస్టాండ్ వద్ద శిబిరాలు నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.