Tribal గిరిజనుల జీవనోపాధికి చర్యలు
ABN , Publish Date - Nov 27 , 2025 | 12:24 AM
Measures for Tribal Livelihoods గిరిజనుల జీవనోపాధి మెరుగుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర నోడల్ అధికారి డా.సుజాతశర్మ ఆదేశించారు. ఆస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రాంలో భాగంగా సీతంపేట ఏజెన్సీలో బుధవారం పర్యటించారు.
సీతంపేట రూరల్, నవంబరు26(ఆంధ్రజ్యోతి): గిరిజనుల జీవనోపాధి మెరుగుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర నోడల్ అధికారి డా.సుజాతశర్మ ఆదేశించారు. ఆస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రాంలో భాగంగా సీతంపేట ఏజెన్సీలో బుధవారం పర్యటించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగాతొలుత ఐటీడీఏ కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం జిల్లాస్థాయి అధికారులతో సమీక్షించారు. గిరిజనుల సమగ్ర అభివృద్థి కోసం సమన్వయంతో పనిచేసి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులపై శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. అటవీ ఉత్పత్తుల దిగుబడి పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూసార పరీక్షలు నిర్వహించి వాటి ఫలితాలు గిరిజన రైతులకు తెలియజేయాలని, పశువులకు తప్పనిసరిగా వ్యాక్సిన్లు వేయాలని ఆదేశించారు. గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవమయ్యేలా చూడాలన్నారు. మలేరియా, డెంగ్యు , సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో పీహెచ్‌సీలు 24గంటలు పనిచేసేలా చూడాలన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో ఆర్‌వో ప్లాంట్లు వినియోగంలో ఉండాలని, మరుగుదొడ్లు కూడా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. వీడివీకేల ద్వారా జీడిపంటను ప్రోసెసింగ్ చేయాలని సూచించారు. ఆ తర్వాత ఆమె మెట్టుగూడ జలపాతాన్ని పరిశీలించారు. ఇక్కడకు వచ్చే పర్యాటకుల సంఖ్య, సిబ్బంది వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. జలపాతం వద్ద ఉన్న ఫోటోషూట్ వేదికపై కలెక్టర్ ప్రభాకరరెడ్డితో కలిసి ఫొటోలు దిగారు.
కేంద్ర పథకాలు అందుతున్నాయా?
భామిని: కేంద్ర పథకాలు అందుతున్నాయా? లేదా అని సెంట్రల్ నోడల్ అధికారి సుజాతశర్మ ఆదర్శ గ్రామం మనుమకొండలో గిరిజనులను అడిగి తెలుసుకున్నారు. పీఎం జన్‌మన్, పీఎం కిసాన్, గర్భిణులు, బాలింతలకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. పీఎం జన్‌మన్ పథకంలో 56 ఇళ్లు మంజూరవగా.. 35 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. బిల్లులు అందితే డిసెంబరు నెలాఖరుకు పూర్తి చేస్తామని గిరిజనులు తెలిపారు. స్వయం కృషితో ఆర్థిక అభివృద్ధి చెందొచ్చని, ప్రతి ఒక్కరూ పని చేయాలని సూచించారు. అనంతరం ఆమె బోడగూడ మోడల్ అంగన్‌వాడీ కేంద్రం, బత్తిలి పీహెచ్‌సీని సైతం పరిశీలించారు. తమ గ్రామానికి పాఠశాల, సచివాలయం పనులు పూర్తి చేయాలని పలువురు గ్రామస్థులు వినతిపత్రం అందించారు. ఈ పర్యటనలో జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, ఇన్‌చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డీఎంహెచ్‌వో భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.