Tourism Development పర్యాటక అభివృద్ధికి చర్యలు
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:09 AM
Measures for Tourism Development : ప్రకృతి అందాలకు నెలవైన సీతంపేట మన్యంలో పర్యాటక ప్రాంతాలను మరింతగా అభివృద్థి చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. తొలిసారిగా సీతంపేట ఏజెన్సీకి వచ్చిన ఆయన మంగళవారం తొలుత ఆడలి వ్యూపాయింట్‌ను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.
సీతంపేట రూరల్, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): ప్రకృతి అందాలకు నెలవైన సీతంపేట మన్యంలో పర్యాటక ప్రాంతాలను మరింతగా అభివృద్థి చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. తొలిసారిగా సీతంపేట ఏజెన్సీకి వచ్చిన ఆయన మంగళవారం తొలుత ఆడలి వ్యూపాయింట్‌ను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఇక్కడకు వచ్చే పర్యాటకుల కోసం వెదురుతో కాటేజీలు నిర్మించాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్ స్వప్నిల్, జిల్లా టూరిజం అధికారి నారాయణరావుకు సూచించారు. పర్యాటక ప్రాంతాల్లో గిరిజన యువతకు ఉద్యోగవకాశాలు కల్పిస్తామని తెలిపారు. హోటల్ మేనేజ్‌మెంట్ రంగంలో శిక్షణలు ఇప్పిస్తామన్నారు. అక్కడి నుంచి ఐటీడీఏ కార్యాలయానికి చేరుకున్న కలెక్టర్ వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు.
పర్యాటకుల కోసం హోమ్ స్టేలు
సీతంపేట ఏజెన్సీలోని వ్యూపాయింట్స్, జలపాతాలు చూసేందుకు వచ్చే పర్యాటకుల కోసం ఈ ఏడాది ఐటీడీఏ ద్వారా 50 పీవీటీజీ హోమ్ స్టేలు సిద్ధం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వాటి నిర్మాణానికి కార్యచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. దీని కోసం స్థానిక యువతకు రుణాలు మంజూరు చేసి, పర్యాటకుల కోసం ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని సూచించారు. గిరిశిఖర గ్రామాలపై దృష్టి సారించి, డోలీ మోతలు లేకుండా చూడాలని వెల్లడించారు. పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్‌లో చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో మెనూ పక్కగా అమలు చేయాలని తెలిపారు. గిరిజన యువతకు స్కిల్ ట్రైనింగ్‌లు, ఇవ్వాలని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సహించాలని, సూచించారు. మలేరియా, డెంగ్యు ,క్షయ వంటి వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఏపీవో చిన్నబాబు, డిప్యూటీ డీఎంహెచ్‌వో విజయపార్వతి తదితరులు పాల్గొన్నారు.