మరింత నాణ్యతగా ఎండీఎం
ABN , Publish Date - Nov 22 , 2025 | 12:13 AM
మధ్యాహ్న భోజన పథకం(ఎండీఎం)పై ప్రభుత్వం కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది.
- పెరిగిన డైట్ చార్జీలు
- ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
రాజాం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): మధ్యాహ్న భోజన పథకం(ఎండీఎం)పై ప్రభుత్వం కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు మరింత నాణ్యతగా భోజనం అందించేందుకు డైట్ చార్జీలను పెంచింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ.5.45 చెల్లించగా, ఇప్పుడు రూ.6.19కు పెంచింది. గతం కంటే 74 పైసలు అదనం. 6 నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు సంబంధించి గతంలో రూ.8.17 చెల్లించగా, దీన్ని రూ.9.29కు పెంచింది. గతం కంటే రూ.1.15 ఎక్కువ. డైట్ చార్జీల పెంపుతో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం లభించడంతో పాటు మధ్యాహ్న భోజన కార్మికులకు సైతం ప్రయోజనం దక్కనుంది. కాగా, ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్కసారి కూడా డైట్ చార్జీలు పెంచిన దాఖలాలు లేవు.
1.12 లక్షల మందికి లబ్ధి
జిల్లాలో అన్నిరకాల ప్రభుత్వ పాఠశాలలు 2,283 ఉన్నాయి. వాటిలో 1.14 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 1.12 లక్షల మంది మధ్యాహ్న భోజనం చేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. వీరికి 600 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతాయి. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యాహ్న భోజన పథకం తీరుమారింది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా పేరు మార్చింది. సన్నబియ్యంతో కూడిన అన్నం, ఆపై క్రమం తప్పకుండా మెనూను అధికారులు అమలు చేస్తున్నారు. ఉపాధ్యాయులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. వారు ముందు ఆహారాన్ని రుచి చూస్తున్నారు. బాగుంటేనే పిల్లలకు పెడుతున్నారు. అంతకు ముందే దగ్గరుండి పిల్లలతో చేతులను నీటితో శుభ్రంగా కడిగేలా ప్రోత్సహిస్తున్నారు. గతం మాదిరిగా పిల్లలను బహిరంగంగా విడిచిపెట్టకుండా డైనింగ్ హాల్‌లో భోజనాలు పెడుతున్నారు. ఇంటర్ విద్యార్థులకు సంబంధించి ఈ విద్యాసంవత్సరం నుంచి మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైంది. దాదాపు 12 వేల మంది వరకూ విద్యార్థులు భోజన పథకాన్ని వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు డైట్ చార్జీలు పెంచడంపై మధ్యాహ్న భోజన నిర్వాహకులతో పాటు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
డైట్ చార్జీలు పెరిగాయి..
మధ్యాహ్న భోజన పథకం డైట్ చార్జీలు పెరిగాయి. వీటికి అనుగుణంగానే నిర్వాహకులకు బిల్లులు చెల్లిస్తాం. ఇప్పటికే సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. ఫోర్ట్‌ఫైడ్ బియ్యం కావడంతో పురుగు పట్టేందుకు అవకాశం లేదు. వంట ఏజెన్సీ వారు తప్పకుండా మెనూను పాటించాలి. ఉపాధ్యాయులు సైతం పర్యవేక్షించాలి.
-ఎం.మాణిక్యాలనాయుడు, డీఈవో, విజయనగరం