Farmer అన్నదాత సుఖీభవ
ABN , Publish Date - Nov 19 , 2025 | 12:18 AM
May the Farmer Prosper ‘అన్నదాతా సుభీభవ-పీఎం కిసాన్’ రెండో విడత నిధులను రాష్ట్ర ప్రభుత్వం నేడు విడుదల చేయనుంది. ఈ మేరకు జిల్లాలో 1,22,260 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. వారి ఖాతాల్లోకి రూ.83.87 కోట్లు జమకానున్నాయి. కేంద్రం రూ.2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 వేల చొప్పున మొత్తంగా రూ.7వేలు అర్హులకు అందనుంది.
ఖాతాల్లోకి జమ కానున్న రూ.83.87 కోట్లు
పార్వతీపురం, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ‘అన్నదాతా సుభీభవ-పీఎం కిసాన్’ రెండో విడత నిధులను రాష్ట్ర ప్రభుత్వం నేడు విడుదల చేయనుంది. ఈ మేరకు జిల్లాలో 1,22,260 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. వారి ఖాతాల్లోకి రూ.83.87 కోట్లు జమకానున్నాయి. కేంద్రం రూ.2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 వేల చొప్పున మొత్తంగా రూ.7వేలు అర్హులకు అందనుంది. పాలకొండ నియోజకవర్గంలో 33,107 మందికి రూ.22.75 కోట్లు, కురుపాంలో 39,084 మందికి రూ. 26.94 కోట్లు, పార్వతీపురంలో 25,807 రైతులకు రూ.17.20 కోట్లు, సాలూరులో 24,262 మందికి రూ.16.98 కోట్లు అందించనున్నారు. ఇందులో కేంద్రం వాటా రూ.22.20 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం రూ.61.13 కోట్లుగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి విడతలో అన్నదాత సుఖీభవ కింద రూ. 85.57 కోట్లు అందించింది. రెండు విడతల్లో మొత్తంగా రూ. 169.44 కోట్లు మంజూరు చేసింది.
ఆర్‌వోఎఫ్‌ఆర్ రైతులకు లబ్ధి..
జిల్లాలో 22,687 మంది ఆర్‌వైఎఫ్‌ఆర్ రైతులు ఉన్నారు. వీరి బ్యాంక్ ఖాతాల్లోనూ ‘అన్నదాతా సుఖీభవ-పీఎం కిసాన్’ కింద రూ.11.34 కోట్లు జమ కానున్నాయి. పార్వతీపురం నియోజక వర్గంలో 713 మంది, కురుపాంలో 10,553, సాలూరులో 5,820 మంది, పాలకొండలో 5,601 మంది గిరిజన రైతులకు లబ్ధి చేకూరనుంది.
జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు
సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు అందించనున్నారు. కురుపాంలో ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, పార్వతీపురం మండలం అడ్డాపుశీల గ్రామంలో ఎమ్మెల్యే విజయచంద్ర, పాలకొండ నియోజకవర్గం వీరఘట్టంలో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో అన్నదాతా సుభీభవ-పీఎం కిసాన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, సబ్ కలెక్టర్లు వైశాలి, పవార్ సప్నిల్ జగన్నాథ్ , జిల్లా వ్యవసాయశాఖ అధికారి అన్నపూర్ణ తదితరులు పాల్గొనున్నారు. అర్హులైన రైతుల ఖాతాల్లో నేడు అన్నదాతాసుఖీభవ-పీఎం కిసాన్ నిధులు జమ కానున్నాయని కలెక్టర్ తెలిపారు. ఇక జిల్లాలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో రైతులకు చెక్కులు అందిస్తామన్నాని వెల్లడించారు.