Masters మృతుల పేరిట మస్తర్లు
ABN , Publish Date - Aug 22 , 2025 | 11:30 PM
Masters in the Name of the Deceased మృతుల పేరిట మస్తర్లు వేసి క్షేత్ర సహాయకులు చేతివాటం చూపించడంపై డ్వామా పీడీ కె.రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం గరుగుబిల్లిలో సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీలవారీగా నివేదికలను బహిర్గతం చేయగా బోగస్ మస్తర్లు అంశం చర్చనీయాంశమైంది.
సామాజిక తనిఖీల్లో బయటపడిన ‘ఉపాధి’ లోపాలు
నిధుల దుర్వినియోగమైనట్లు గుర్తింపు
డ్వామా పీడీ ఆగ్రహం
గరుగుబిల్లి, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): మృతుల పేరిట మస్తర్లు వేసి క్షేత్ర సహాయకులు చేతివాటం చూపించడంపై డ్వామా పీడీ కె.రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం గరుగుబిల్లిలో సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీలవారీగా నివేదికలను బహిర్గతం చేయగా బోగస్ మస్తర్లు అంశం చర్చనీయాంశమైంది. ప్రధా నంగా పంచాయతీల పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో తేడాలున్నట్లు , తక్కువ పని చేసినా అధికంగా కొలతలు వేసి నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించారు. పనులు నిర్వహించే ప్రాంతాల్లో సమాచార బోర్డులు ఏర్పాటు చేయకుండా సంబంధిత క్షేత్ర సహాయకుల ఖాతాల్లోకి నిధులు జమైనట్లు వెల్లడించారు. ఫాంపాండ్స్‌తో పాటు పలు పనుల్లో కొలతల తేడాలను గుర్తించారు. ఎంబుక్‌లతో పాటు మస్తర్లలో దిద్దుబాట్లు బయటపడ్డాయి. తోటపల్లిలో సోప్‌ఫిట్‌కు బదులు మరుగు దొడ్ల నిర్మాణం చేపట్టినట్లు తేల్చారు. కొత్తూరు పంచాయతీకి సంబంధించి ఫుడ్ గార్డెన్‌కు రూ.97 వేలు చెల్లించకుండా సంబంధిత ఉపాధి హామీ ఏపీవో క్షేత్ర సహాయకులకు బదిలీ చేశారు. అయితే అందులో సగం రూ. 48,760 పంచాయతీరాజ్ విభాగంలో వర్క్ ఇన్పెక్టర్‌గా పనిచేస్తున్న వారికి ఉపాధి ఏపీవో ఫోన్ పే చేయించారు. కొత్తూరులో మినీ గోకులం నిర్మించకుండా ఇసుక కొనుగోలు కోసం క్షేత్ర సహాయకునికి రూ. 20 వేలును బదిలీ చేయించారు. రావివలసలో వేతనదారులు పనులకు హాజరుకాక పోయినా, పలు పనులకు సంబంధించి ఎంబుక్ రికార్డు చేయకపోయినా చెల్లింపులు చేశారని తనిఖీ బృందం వివరించింది. రావివలస, చిలకాంలో అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు పింఛన్లు పొందుతున్నట్లు పరిశీలనలో తేలింది. గ్రామాల్లో డప్పు, చర్మకారులు, కళాకారులకు గుర్తింపు కార్డులు లేనట్లు గుర్తించారు.
మేట్లు తొలగింపునకు ఆదేశాలు
పంచాయతీల పరిధిలో బోగస్ మస్తర్లు, దిద్దుబాట్లు, పనులకు వెళ్లకుండా వేతనాలు పొందేలా సహకరించిన నాగూరు, రావివలస, శివ్వాంతో పాటు పలు పంచాయతీల్లో మేట్లును తొలగించాలని పీడీ ఆదేశించారు. ఉపాధి టెక్నికల్ అసిస్టెంట్లును సస్పెండ్ చేయగా, పలువురు క్షేత్ర సహాయకులకు షోకాజు నోటీసులు జారీ చేయాలన్నారు. మరికొందరు క్షేత్ర, టెక్నికల్ అసిస్టెంట్లకు అపరాధ రుసుం విధించారు.