Marijuana in a trolley suitcase ట్రాలీ సూట్‌కేసులో గంజాయి
ABN , Publish Date - Jul 24 , 2025 | 12:00 AM
Marijuana in a trolley suitcase ట్రాలీ సూట్‌కేసులో గంజాయి తరలిస్తే ఎవరూ గుర్తించలేరని అనుకున్నారు. సాధారణ ప్రయాణికుల్లా విజయనగరంలో రైలు దిగి సూట్‌కేసులను నడుపుతూ ఓ లాడ్జికి వెళ్తున్నారు. ముందే పక్కా సమాచారం ఉండడంతో పోలీసులు నిఘా పెట్టి వారిని తనిఖీ చేశారు. గంజాయి రవాణా గుట్టు రట్టు చేశారు. 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ వివరాలను విజయనగరం డీఎస్పీ శ్రీనివాసరావు వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.
ట్రాలీ సూట్‌కేసులో గంజాయి
హైదరాబాద్‌కు తరలించాలని ప్రణాలిక
ఛేదించిన పోలీసులు
ముగ్గురు నిందితుల అరెస్టు
విజయనగరం క్రైం, జూలై 23(ఆంధ్రజ్యోతి): ట్రాలీ సూట్‌కేసులో గంజాయి తరలిస్తే ఎవరూ గుర్తించలేరని అనుకున్నారు. సాధారణ ప్రయాణికుల్లా విజయనగరంలో రైలు దిగి సూట్‌కేసులను నడుపుతూ ఓ లాడ్జికి వెళ్తున్నారు. ముందే పక్కా సమాచారం ఉండడంతో పోలీసులు నిఘా పెట్టి వారిని తనిఖీ చేశారు. గంజాయి రవాణా గుట్టు రట్టు చేశారు. 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ వివరాలను విజయనగరం డీఎస్పీ శ్రీనివాసరావు వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.
రైలులో ముగ్గురు వ్యక్తులు గంజాయి తీసుకువస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. రవాణాదారులు విజయనగరంలో రైలు దిగుతారని తెలిసింది. అప్రమత్తమైన వన్‌టౌన్ ఎస్‌ఐ రామగణేష్ సిబ్బందితో రైల్వే స్టేషన్ వద్దకు చేరుకుని నిఘా పెట్టారు. అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేశారు. అంతలో రైల్వేస్టేషన్ లోపలి నుంచి ముగ్గురు వ్యక్తులు ట్రాలీ సూట్ కేసులను నడుపుకుంటూ బయటకు వచ్చారు. సమీపంలోని లాడ్జికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని తనిఖీ చేశారు. ఒక ట్రాలీ సూట్‌కేసులో 13 కిలోలు, మరో సూట్‌కేసులో 17 కిలోలు కలిపి 30 కిలోల గంజాయిని గుర్తించారు. వారి వద్ద నుంచి నాలుగు ఆండ్రాయిడ్ ఫోన్లు, రెండు కీప్యాడ్ ఫోన్లు, రూ.4 వేల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రం కళహండి జిల్లా ఉచ్చల గ్రామానికి చెందిన పితామాంబర్ నాగ్, అదే జిల్లా బిరమల గ్రామానికి చెందిన చంద్రకరుణ్, అదే జిల్లా చార్‌బహల్ గ్రామానికి చెందిన ప్రదీప్‌నాయక్‌లను అరెస్టు చేశారు. గంజాయిని ఓడిశా నుంచి విజయనగరం మీదుగా హైదరాబాదు తరలిస్తున్నట్టు విచారణలో ఒప్పుకున్నారు. పితామాంబర్ నాగ్‌పై ఇప్పటికే పలు గంజాయి కేసులు ఉన్నాయి. గంజాయి వ్యాపారం చేస్తున్న క్రమంలో చంద్రకరుణ్, ప్రదీప్‌నాయక్‌లతో పరిచయం ఏర్పడింది. వీరిని గంజాయి అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్నాడు. పితామాంబర్‌నాగ్ ప్రతి ట్రిప్పుకి వీరికి రూ.5 వేలు చొప్పున చెల్లిస్తున్నట్టు విచారణలో తేలింది. పితామాంబర్ ఒడిశా రాష్ట్రం భవానీపట్టణానికి చెందిన జైదర్ అలియాస్ తామోతర్ అనే వ్యక్తి వద్ద నుంచి కిలో రూ.5 వేలు చొప్పున 30 కిలోల గంజాయిని రూ.లక్ష 50 వేలకు కొనుగోలు చేసినట్టు విచారణలో తేలింది. తామోతర్‌ను అరెస్టు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు డీఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశంలో వన్‌టౌన్ సీఐ ఆర్‌వీఆర్‌కె చౌదరి, టాస్క్‌ఫోర్సు సీఐ బంగారుపాప, ఎస్‌ఐ రామ్‌గణేష్, ఏఎస్‌ఐ రామలక్ష్మీ, పీసీలు గౌరీశంకర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.