Maoist మావోయిస్టు వారోత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - Jul 28 , 2025 | 11:36 PM
Maoist Week Celebrations Begin మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒడిశా ప్రాంతం నుంచి వచ్చి పోయే వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.
ఏజెన్సీలో ప్రముఖుల పర్యటనపై డేగ కన్ను
సాలూరు రూరల్, జూలై 28: మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒడిశా ప్రాంతం నుంచి వచ్చి పోయే వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. పోలీస్‌స్టేషన్లలో భద్రతను కూడా పెంచారు. వాస్తవంగా ఛత్తీస్‌గఢ్, ఏవోబీలో మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ నేపథ్యంలో క్యాడర్‌లో ఆత్మసైర్థ్యం నింపడానికి వచ్చేనెల మూడో తేదీ వరకు వారోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి మావోయిస్టులు యత్నిస్తున్నారు. అమరవీరుల వర్థంతుల నేపథ్యంలో విప్లవ సభలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇరురాష్ట్రాల సాయుధ దళాలు ఏవోబీ అడవులను జల్లెడపడుతున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇరు రాష్ట్రాల పోలీసులు ప్రత్యేక కార్యాచరణతో పకడ్బందీగా అడుగులు వేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏజెన్సీ పోలీస్‌స్టేషన్లకు, ప్రముఖల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రముఖ రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు ఏజెన్సీలో పర్యటనలు చేయొద్దని పోలీసులు సమాచారమిచ్చారు. ఏజెన్సీకి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే ముందస్తు సమాచారం అందించాలని సూచించారు. మరోవైపు ప్రభుత్వ ఆస్తులకు భద్రత కల్పిస్తున్నారు.
వాహనాల తనిఖీ
కొమరాడ/గుమ్మలక్ష్మీపురం: మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో కొమరాడ, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో సోమవారం పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఏజెన్సీ సరిహద్దు ప్రాంతాల్లో రాత్రి, పగలని తేడా లేకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ప్రత్యేక కూంబింగ్
‘ ఏవోబీలో సరిహద్దు ప్రాంతాలైన మక్కువ, పాచిపెంట, సాలూరు మండలాలు, అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక దళాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నాం. పటిష్ట భద్రత చర్యలు తీసుకున్నాం. వాహన తనిఖీలు, రోడ్ ఓపెన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఏరియా డామినేషన్ కార్యక్రమాలు చేపట్టాం. ప్రజాప్రతినిధులు,ప్రముఖులు ఏజెన్సీలో పర్యటించరాదని సూచించాం. ఏజెన్సీలో ఉన్న రాజకీయ నాయకులు సైతం సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం మంచిది. ఏజెన్సీలో పర్యటనలకు వెళ్లే వారు ముందస్త సమాచారమిస్తే తగిన భద్రత చర్యలు తీసుకుంటాం.’ అని సాలూరు రూరల్ సీఐ రామకృష్ణ తెలిపారు.