Share News

Manyam to Odisha! మన్యం టు ఒడిశా!

ABN , Publish Date - Sep 08 , 2025 | 11:48 PM

Manyam to Odisha! జిల్లాలో పేదల బియ్యం పక్కదారి పడుతోంది. యథేచ్ఛగా ఇతర రాష్ర్టాలకు తరలిపోతోంది. రేషన్‌ బియ్యం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. కార్డుదారుల నుంచి వారు తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేసి ఓ చోట నిల్వ చేస్తున్నారు. ఆ తర్వాత రీసైక్లింగ్‌ చేసి ఒడిశా, ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తున్నారు.

 Manyam to Odisha!  మన్యం టు ఒడిశా!
వీరఘట్టం నుంచి ఒడిశాకు తరలిస్తున్న బియ్యాన్ని పాలకొండ చెక్‌పోస్టు వద్ద పట్టుకున్న విజిలెన్స్‌ అధికారులు (ఫైల్‌)

  • చోద్యం చూస్తున్న సివిల్‌ సప్లైస్‌ శాఖ

  • విజిలెన్స్‌ వరుస దాడులు

  • అయినా మారని అక్రమార్కులు

  • రూటు మార్చి దందా సాగిస్తున్న వైనం

  • కొరవడిన పటిష్ఠ నిఘా

పార్వతీపురం, సెప్టెంబరు7(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పేదల బియ్యం పక్కదారి పడుతోంది. యథేచ్ఛగా ఇతర రాష్ర్టాలకు తరలిపోతోంది. రేషన్‌ బియ్యం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. కార్డుదారుల నుంచి వారు తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేసి ఓ చోట నిల్వ చేస్తున్నారు. ఆ తర్వాత రీసైక్లింగ్‌ చేసి ఒడిశా, ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తున్నారు. దీనిపై సివిల్‌ సప్లైస్‌ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండడంతో కొంతమంది వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కాలంలో విజిలెన్స్‌ అఽధికారుల వరుస దాడులు జరపగా... జిల్లాలో ఒకే నెలలో మూడు కేసులు నమోదు చేశారు. పెద్దఎత్తున పీడీఎస్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా బియ్యం అక్రమ తరలింపుపై కేసులు నమోదు చేస్తున్నా.. అక్రమార్కులు ఏ మాత్రం మారడం లేదు. వివిధ పోర్టులపై రాష్ట్ర ప్రభుత్వం గట్టి నిఘా పెట్టడంతో వారు రూట్‌ మార్చారు. ఒడిశా రాష్ట్రం మీదుగా బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

గతంలో పార్వతీపురం కేంద్రంగా పీడీఎస్‌ బియ్యం నిల్వ చేసుకుని రీసైక్లింగ్‌ చేసేవారు. ఆ తర్వాత ఒడిశాకు తరలించేవారు. దీనిపై విజిలెన్స్‌ అధికారులు ప్రత్యేక దృష్టిసారించడంతో తాజాగా కొంతమంది వ్యాపారులు సాలూరు కేంద్రంగా తమ దందా సాగిస్తున్నారు. మరికొంతమంది పార్వతీపురం ప్రాంతంలో జోరుగా పీడీఎస్‌ బియ్యం కొనుగోలు చేసి ఒడిశా రాష్ట్రం అలమండకు తరలిస్తున్నారు. మరికొందరు రైలు మార్గంలో రాయగడకు అక్రమ రవాణా చేస్తున్నారు. గతంలో ప్రజలే బియ్యం అక్రమ తరలింపును అడ్డుకుని అధికారులకు అప్పగించిన సందర్భాలున్నాయి. అయితే సివిల్‌ సప్లైస్‌ శాఖాధికారుల పర్యవేక్షణ కొరవడగా.. మరికొన్నిచోట్ల విజిలెన్స్‌ సిబ్బంది దాడులు జరుపుతున్నా పరిస్థితి ఏ మాత్రం మారడం లేదు.

ఇటీవల పట్టుబడిన బియ్యం

జూలై 5న వీరఘట్టం నుంచి పాలకొండ మధ్య ఒడిశాకు తరలిపోతున్న రెండు వేల కిలోల బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. జూలై 9న సాలూరులో 3,500 కిలోల పీడీఎస్‌ బియ్యాన్ని పట్టుకున్నారు. జూలై 12న పాచిపెంట మండలం పి.కోనవలస చెక్‌పోస్టు వద్ద 35 టన్నుల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 6న అదే ప్రాంతంతో ఒడిశాకు తరలిపోతున్న 26 టన్నులు బియ్యాన్ని పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు పోలీసులు లేదా విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించి బియ్యం అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారు. అయితే అధికారుల కళ్లుగప్పి జిల్లా సరిహద్దుల మీదుగా ఒడిశాకు ఇంకెంత బియ్యం తరలిపో తుందన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు పటిష్ఠ నిఘా పెట్టి పీడీఎస్‌ బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.

కఠిన చర్యలు తీసుకుంటాం

పీడీఎస్‌ బియ్యం అక్రమంగా తరలించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. ఇతర జిల్లాల నుంచి ఒడిశాకు తరలిస్తున్న బియ్యాన్ని ఇటీవల విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

- బాల సరస్వతి, జిల్లా సివిల్‌ సప్లైస్‌ అధికారి

Updated Date - Sep 08 , 2025 | 11:48 PM