Share News

Manyam మన్యం కేరాఫ్‌ పర్యాటకం

ABN , Publish Date - Nov 05 , 2025 | 12:12 AM

Manyam — The Address of Tourism పార్వతీపురం మన్యం పర్యాటకానికి కేరాఫ్‌గా నిలిచేలా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలతో కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి జిల్లాలోని పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే జిల్లాలో జలపాతాల వద్ద వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు.

 Manyam  మన్యం కేరాఫ్‌ పర్యాటకం
సాలూరు మండలంలో దళాయివలస జలపాతం

  • పర్యాటకాభివృద్ధికి అడుగులు

  • గిరిజనుల ఉపాధికి కొత్తబాట

  • కలెక్టర్‌ చొరవతో సందర్శకులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు

పార్వతీపురం, నవంబరు4(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం పర్యాటకానికి కేరాఫ్‌గా నిలిచేలా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలతో కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి జిల్లాలోని పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే జిల్లాలో జలపాతాల వద్ద వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. ఇటీవల సీతంపేట ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్కు, మెట్టుగూడ జలపాతం వద్ద కూడా సందర్శకులను ఆకట్టుకునేలా చర్యలు చేపట్టారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాలను మరింతగా అభివృద్ధి చేసి గిరిజన యువతకు స్థానికంగానే ఉపాధి కల్పించాలనే సంకల్పంతోనే ముందుకు సాగుతున్నారు. దీనిపై పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

ఇదీ పరిస్థితి..

ప్రకృతి సహజసిద్ధ అందాలు.. ఎత్తయిన కొండలు.. జలపాతాలు.. ఆధ్యాత్మిక ప్రాంతాలకు నిలయం మన్యం. వాటిని అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరగనుంది. తద్వారా గిరిజనులకు ఉపాధితో పాటు జిల్లా ఆదాయం కూడా పెరుగుతుంది. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోలేదు. పర్యాటకంపై పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన్యంపై ప్రత్యేక దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో భారీగా నిధులు మంజూరు చేస్తూ పర్యాటకాభివృద్ధికి చర్యలు చేపట్టింది. ప్రభుత్వ లక్ష్యాలను నెరవేరే విధంగా కలెక్టర్‌ మొదటగా జలపాతాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందు కెళ్తున్నారు. జిల్లాలో ముఖ్యమైన 14 జలపాతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలను పర్యాటక కేంద్రా లుగా మార్చాలని కలెక్టర్‌ ఆదేశాలతో అధికారులు చర్యలు ప్రారంభించారు. దీనిలో భాగంగా పర్యాటకులకు ఆకర్షించేందుకు సీతంపేటలో గడిచిన రెండు రోజుల కిందట ‘వనంతో ఉత్సవం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. మెట్టుగూడ జలపాతం వద్ద చిన్నారుల కోసం మినీ స్విమ్మింగ్‌ ఫూల్‌ను ఏర్పాటు చేశారు. ఫొటోషూట్‌ల కోసం వుడెన్‌తో ఆర్చ్‌ను నిర్మించారు. సీతంపేట ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్క్‌లో సాహసోపేతమైన క్రీడలతో పాటు హాట్‌ఎయిర్‌ బెలూన్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పిక్నిక్‌ల సీజన్‌ కాగా.. సంక్రాంతి వరకు సీతంపేట ఏజెన్సీలో పర్యాటక ప్రాంతాలకు సందర్శకులు పోటెత్తే అవకాశం ఉంది. దీంతో అడ్వంచర్‌ పార్క్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆడలి వ్యూపాయింట్‌, గిరిజన మ్యూజియం , జిల్లాలోని తోటపల్లి, అడ్డాపుశీలలోని కాశీవిశ్వేశ్వరాలయం తదితర దేవాలయాల వద్ద కూడా సందర్శకుల కోసం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదేమైనా జిల్లాలోని పర్యాటక ప్రాంతాలపై ప్రభుత్వం దృష్టి సారించడంపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మన్యం అందాలను తిలకించండి

సీతంపేట రూరల్‌: ఎన్టీఆర్‌ అడ్వంచర్‌పార్క్‌లో ఏర్పాటు చేసిన హాట్‌ఎయిర్‌ బెలూన్‌ ద్వారా విహంగ వీక్షణం చేస్తూ మన్యం అందాలను తిలకించొచ్చని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ హాట్‌ఎయిర్‌ బెలూన్‌లో నలుగురు వ్యక్తులు 300 అడుగుల ఎత్తులోకి వెళ్లొచ్చని పేర్కొన్నారు. రోజూ ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 8గంటల వరకు వాతావరణ పరిస్థితు లను బట్టీ పర్యాటకులకు ఇది అందుబాటులో ఉంటుందన్నారు. పెద్దలకు రూ.1000, పదేళ్లలోపు పిల్లలకు రూ.800 వసూలు చేస్తారని తెలిపారు. ముందుగా టికెట్లను బుక్‌ చేసుకోవాలనుకునే వారు ఈ 63016 66723 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

ఫుడ్‌ స్టాల్స్‌కు దరఖాస్తుల ఆహ్వానం

సీతంపేట ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్క్‌లో అద్దె ప్రాతిపదికన ఫుడ్‌స్టాల్‌ ఏర్పాటుకు దరఖాస్తులు కోరుతున్నట్లు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్క్‌ లోపల ఐటీడీఏ సూచించిన డిజైన్‌లో ఫుడ్‌స్టాల్‌ నిర్వహించుకోవొచ్చునని పేర్కొన్నారు. ఏడాది కాలానికి లీజు కోసం రూ.20వేలు డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుందన్నారు. దీంతో పాటు నెలకు రూ.5వేలు అద్దెను ఐటీడీఏకు చెల్లించాలని వెల్లడించారు.

జలపాతాల పరిశీలన

సాలూరు రూరల్‌, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): సాలూరు మండలంలో దళాయివలస, శిఖపరువు జలపాతాలను మంగళవారం డ్వామా పీడీ రామచంద్రరావు, డీఆర్‌డీఏ పీడీ ఎం.సుధారాణి వేర్వేరుగా సందర్శించారు. ఆయా చోట్ల గిరిజనులు నిర్మించిన దుకాణాలు, వంతెన, రోడ్డును పరిశీలించారు. వాటిని పర్యాటక ప్రాంతాలుగా ప్రారంభించే అవకాశాలపై సమీక్షించారు. స్థానిక గిరిజనులతో ముచ్చటించి పర్యాటకాభివృద్ధిలో భాగస్వాములవాలని సూచించారు.

Updated Date - Nov 05 , 2025 | 12:12 AM