Share News

Manyam మన్యం.. అభివృద్ధి పథం

ABN , Publish Date - Dec 30 , 2025 | 12:14 AM

Manyam on the Path of Development కాలచక్రం గిర్రున తిరిగిపోయింది.. చూస్తుండగానే కాలగర్భంలో మరో ఏడాది కలిసిపోనుంది. ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చిన 2025 రెండో రోజుల్లోనే కనుమరుగుకానుంది. కాగా ఈ ఏడాది జిల్లాకు ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. కూటమి ప్రభుత్వం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందకు అవసరమైన కార్యక్రమాలెన్నో చేపట్టింది.

Manyam  మన్యం.. అభివృద్ధి పథం

  • ఈ ఏడాదిలో కీలక ఘటనలెన్నో..

  • పలు సమస్యలకు పరిష్కార మార్గం చూపిన ప్రభుత్వం

  • గిరిశిఖర గ్రామాల్లో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి

  • రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం, పారిశుధ్యం మెరుగకు చర్యలు

  • పర్యాటక అభివృద్ధికి అడుగులు

  • నూతన ఏడాదిలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లావాసుల విన్నపం

పార్వతీపురం,డిసెంబరు29(ఆంధ్రజ్యోతి): కాలచక్రం గిర్రున తిరిగిపోయింది.. చూస్తుండగానే కాలగర్భంలో మరో ఏడాది కలిసిపోనుంది. ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చిన 2025 రెండో రోజుల్లోనే కనుమరుగుకానుంది. కాగా ఈ ఏడాది జిల్లాకు ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. కూటమి ప్రభుత్వం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందకు అవసరమైన కార్యక్రమాలెన్నో చేపట్టింది. దీర్ఘకాలంగా గిరి శిఖర ప్రాంతవాసులను పట్టిపీడిస్తున్న రహదారుల సమస్యకు పరిష్కారం చూపింది. దశల వారీగా రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పర్యాటకు అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేసింది. విద్య, వైద్యానికి కూడా పెట్టపీట వేసింది. ప్రజల దీర్ఘకాల సమస్యలను పరిష్కారించడంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపింది. ఇక నూతన సంవత్సరంలోనూ జిల్లాను అభివృద్థి పథంలో నడిపించాలని మన్యం వాసులు కోరుతున్నారు. కాగా ఈ ఏడాదిలో జిల్లాలో చోటుచేసుకున్న కీలక ఘటనలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

ఇదీ పరిస్థితి ..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీతో సంబంధం లేకుండా జిల్లాలో 1521 మంది వితంతువులకు కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. గిరిజన ప్రాంతాలపై ప్రభుత్వం ప్రత్యే కంగా దృష్టిసారించింది. గిరిజనులకు డోలీ మోతలు తప్పించాలనే ఉద్దేశంతో చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా జిల్లాలో జోరుగా బీటీ రహదారుల నిర్మాణాలు జరుగుతున్నాయి. జిల్లాలో వైద్య కళాశాల నిర్మాణాన్ని పీపీపీ పద్ధతిలో చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైద్య కళాశాల జిల్లాలో నిర్మిస్తామని ప్రకటించినప్పటికీ కనీసం స్థల సేకరణ కూడా చేపట్టలేదు. కాగా దశాబ్దాలుగా మన్యం వాసులను వేధిస్తున్న వంతెనల సమస్యను పరిష్కరించాల్సి ఉంది. వరద ఉధృతి కారణంగా సాలూరు మండలం సారాయివలస వద్ద ఉన్న గెడ్డ వద్ద ముగ్గురు ఉపాధ్యాయులు (ఇతర రాష్ట్రాలకు చెందిన వారు) కొట్టుకుపోయారు. ఏజెన్సీ ప్రాంతాల్లో తరచూ ఇటువంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాల్సి ఉంది.

విద్యాశాఖ ఇలా..

జిల్లాలో విద్యాశాఖ విషయానికొస్తే.. ఈ నెలలోనే పూర్తిస్థాయి డీఈవో నియామకమయ్యారు. గత మూడేళ్లుగా టెన్త్‌లో మన్యం జిల్లా వరుసగా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం ఇంటర్‌ ఫలితాల్లోనూ మన్యం మెరిసింది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులు 77ు , ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 86ు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలతో రాష్ట్రస్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఇక మెగా డీఎస్సీ అభ్యర్థులు నూతన ఉపాధాయులుగా విధుల్లో చేరారు. వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన పెం పొందించాలనే ఉద్దేశంతో అంగన్‌వాడీ కేంద్రాల నుంచి ప్రైవేట్‌, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ముస్తాబు కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముచ్చటగా మూడోసారి జిల్లాలోని భామినిలో మెగా పేరెంట్స్‌ అండ్‌ టీచర్స్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ తదితరులు హాజరయ్యారు.

వ్యవసాయ శాఖ ఇలా..

ఈ ఏడాదిలో ఎరువుల కోసం రైతులు అనే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తుఫాన్ల ప్రభావంతో ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు తీవ్రంగా నష్టపోయారు. నిబంధనల మేరకు నష్ణపరిహారం చెల్లించడంతో చాలామంది దీనికి దూరమయ్యారు. అరటి, పత్తి తదితర రైతులకు 2025 అనుకూలించలేదు. కాగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు కాస్త మేలు జరిగింది. ఇక ఖరీఫ్‌ ధాన్యం విక్రయించిన 24 గంటల లోపే ప్రభుత్వం నగదు జమ చేయడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్నప్పటికీ మన్యంలో వ్యవసాయ శాఖకు పూర్తిస్థాయి అధికారి లేరు.

ఇరిగేషన్‌ శాఖ ఉన్నా లేనట్లే ..

జిల్లాలో ఇరిగేషన్‌ శాఖ ఉన్నా లేనట్లే. ఈ శాఖ ద్వారా మన్యంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. వీఆర్‌ఎస్‌, పెద్దగెడ్డ , పెదంకలం, వట్టిగెడ్డ తదితర ప్రాజెక్టుల ఆధునికీకరణ పనులు కూడా పునఃప్రారంభం కాలేదు. తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టుతో పాటు జంఝావతి జలాశయం పనుల్లో కూడా ఎటువంటిపురోగతి లేదు.

బాలికలకు పచ్చకామెర్లతో కలకలం

కురుపాం గురుకుల బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాలలో పలువురు విద్యార్థినులు పచ్చకామెర్లు లక్షణాలతో ఆసుపత్రి పాలవడం కలకలం రేపింది. అంతేగాకుండా ఇద్దరు బాలికలు మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ప్రిన్సిపాల్‌తో పాటు మరో ముగ్గురిని ప్రభుత్వ సస్పెండ్‌ చేశారు. కాగా జాండీస్‌ లక్షణాలతో బాధపడుతున్న ఆ పాఠశాలతో పాటు ఏకలవ్యకు చెందిన మరికొంత మంది విద్యార్థులను విశాఖ, విజయనగరం, పార్వతీపురం, కురుపాం ఆసుపత్రులకు తరలించి వైద్య సేవలు అందించారు. సీఎం ఆదేశాలతో కలెక్టర్‌, ఐటీడీఏ పీవోతో పాటు ఇతర జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు మరింత అపమత్తమై విద్యార్థినులకు మెరుగైన వైద్యసేవలందేలా చర్యలు చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌ విశాఖ కేజీహెచ్‌కు చేరుకుని బాలికలను పరామర్శించారు. మృతి చెందిన విద్యార్థినుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం ప్రకటించారు. అయితే ఈ ఘటనపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగింది.

ప్రముఖుల పర్యటన

ఈ ఏడాదిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో పాటు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయులు, ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ జవహర్‌తో పాటు పలువురు కూటమి ప్రభుత్వ ప్రముఖులు జిల్లాలో పర్యటించారు. నారా లోకేశ్‌ పార్వతీపురం, పాలకొండ నియోజకవర్గంలో కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పాలకొండలో వైసీపీ నేత పాలవలస రాజశేఖర్‌ మృతి చెందగా.. ఫిబ్రవరి 20న ఆ కుటుంబాన్ని మాజీ సీఎం జగన్‌ పరామర్శించారు.

వైసీపీకి భారీ షాక్‌

పార్వతీపురం, సాలూరు పురపాలక సంఘానికి చెందిన కౌన్సిలర్లు టీడీపీ, జనసేన పార్టీలోకి జంప్‌ ఆయ్యారు. గరుగుబిల్లి మండలంలో ఎంపీపీ ఉరిటి రామరావు వైసీపీ నుంచి టీడీపీలో చేరి వైసీపీకి షాక్‌ ఇచ్చారు. పాలకొండ నగర పంచాయతీ వైసీపీ చేజారిపోయింది. కూటమి అభ్యర్థికి చైర్‌ పర్సన్‌ పదవి దక్కింది.

పర్యాటక అభివృద్ధి

జిల్లాలో పర్యాటక అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. భారీగా నిధులు మంజూరు చేయడంతో ఈ ఏడాదిలో సీతంపేట, సాలూరు, గుమ్మలక్ష్మీపురం తదితర మండలాల్లోని పలు పర్యాటక ప్రదేశాల్లో పనులు చేపట్టారు. మరోవైపు కలెక్టర్‌ మన్యంలో జలపాతాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఇందులో గిరిజనులు భాగస్వామ్యం చేస్తూ.. జలపాతాల ప్రాంతాలను అందంగా తీర్చి దిద్దుతున్నారు. ఆయా చోట్ల మౌలిక వసతులను కూడా ఏర్పాటు చేస్తుండడంతో మన్యంలో పర్యా టకుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు గిరిజనులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది.

స్మార్ట్‌ రేషన్‌ కార్డులు

కూటమి ప్రభుత్వం ఆదేశాలతో జిల్లాలకు కార్డుదారులకు రైస్‌ కార్డు స్థానంలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు అందించారు. రేషన్‌ పంపిణీలో అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. అదేవిధంగా ఎండీయూ వాహనాలకు చెక్‌ పెట్టి.. మళ్లీ డిపోల్లో సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. దీంతో కార్డుదారుల ఇబ్బందులు తొలగాయి.

ఏనుగుల సంరక్షణ కేంద్రం

జిల్లాలో ఏనుగుల సంరక్షణ కేంద్రం నిర్మాణానికి ఈ ఏడాదిలో అడుగులు పడ్డాయి. మరికొద్ది నెలల్లో ఇది అందుబాటులోకి రానుంది. సీతానగరం మండలం గుచ్చిమిలో దీనిని నిర్మిస్తున్నారు. కుంకీ ఏనుగు రప్పిస్తే.. జిల్లావాసులకు ఏనుగుల బెడద తప్పుతుంది.

ప్రధానిని కలిసిన యోగాంధ్ర విజేతలు

యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పది విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో జిల్లాకు చెందిన పది మంది విజేతలుగా నిలిచారు. వారు విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బహుమతులు స్వీకరించారు.

20 ఏళ్ల తర్వాత ఇంటికి చేరిన అప్పారావు

జిల్లాకు చెందిన కొండగొర్రె చుక్క అలియాస్‌ కోనేరు అప్పారావు సుమారు 20 ఏళ్ల తర్వాత తన కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు. ఉపాధి కోసం తమిళనాడు వెళ్లి తప్పిపోయిన వ్యక్తిని తిరిగి జిల్లాకు రప్పించడంలో అప్పటి కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ చొరవ చూపారు. మార్చి 16న పార్వతీపురం మండలం ములక్కాయ వలసలో ఉంటున్న కుమార్తె వద్దకు అప్పారావును చేర్చారు.

ఏసీబీకి చిక్కిన అధికారులు

ఈ ఏడాది ఫిబ్రవరి 24న పాలకొండ నగర పంచాయతీ కమిషనర్‌ తో పాటు డ్రైవర్‌ ఏసీబీ వలకు చిక్కారు. మార్చి 26న జిల్లా మత్స్యశాఖ అధికారి ఏసీబీ వలలో పడ్డారు.

ఆదర్శంగా ‘రెవెన్యూ క్లినిక్‌, ముస్తాబు’

ఈ ఏడాది సెప్టెంబరు 13న జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్‌ రెడ్డి పాలనలో తన మార్కు చూపించారు. ప్రధానంగా ముస్తాబు, రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి.. మన్యం జిల్లాను ఆదర్శంగా నిలిపారు. అంతేగాకుండా పై రెండు కార్యక్రమాలు సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి వెళ్లడంతో.. ఆయన ఆదేశాల మేరకు రెవెన్యూ క్లినిక్‌, ముస్తాబు కార్యక్రమాలను ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు.

ఉలిక్కిపడ్డ పార్వతీపురం

ఈ ఏడాది అక్టోబరు 19న పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌ పార్శిల్‌ సర్వీస్‌ కౌంటర్‌ వద్ద బాణసంచా పేలుడు సంభవించింది. దీంతో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో పార్వతీపురం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Updated Date - Dec 30 , 2025 | 12:14 AM