Share News

mustabhu మన్యం ‘ముస్తాబు’ భేష్‌

ABN , Publish Date - Dec 18 , 2025 | 11:37 PM

Manyam mustabhu bhesh మన్యం జిల్లాలో సుమారు రెండు నెలల కిందట ప్రారంభించిన ముస్తాబు కార్యక్రమం తనను ఎంతగానో ఆకర్షించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో గురువారం రెండో రోజు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ‘ముస్తాబు’ అమలు తీరును ప్రస్తావించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డికి అభినందనలు తెలిపారు.

 mustabhu  మన్యం ‘ముస్తాబు’ భేష్‌
క‌లెక్ట‌ర్‌, ఎస్పీల‌తో మాట్లాడుతున్న సీఎం

  • కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డికి అభినందనలు

  • 28న రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ఆదేశం

  • రెవెన్యూ క్లినిక్‌ నిర్వహణకూ సన్నద్ధం

పార్వతీపురం, డిసెంబరు18(ఆంధ్రజ్యోతి): మన్యం జిల్లాలో సుమారు రెండు నెలల కిందట ప్రారంభించిన ముస్తాబు కార్యక్రమం తనను ఎంతగానో ఆకర్షించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో గురువారం రెండో రోజు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ‘ముస్తాబు’ అమలు తీరును ప్రస్తావించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. ఈనెల 28న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, ఇంటర్‌ కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆదేశించారు. తొలుత ‘ముస్తాబు’పై కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ‘పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. తద్వారా వారు ఆరోగ్యవంతులుగా ఉండాలనే లక్ష్యంతో చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. అనారోగ్యాలకు గురైన విద్యార్థుల సంఖ్య బాగా తగ్గింది. వ్యక్తిగత పరిశుభ్రతకు వారు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.’ అని కలెక్టర్‌ తెలిపారు. దీనిపై సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి వినూత్న ఆలోచనలతో పాఠశాలల్లో ప్రారంభించిన ముస్తాబు కార్యక్రమం ఎంతో బాగుందన్నారు. భామిని మండలం పర్యటనలో అక్కడి పిల్లలు తనతో స్వయంగా చెప్పారని... పరిశుభ్రతపై వారి శ్రద్ధ చూసి ఎంతో సంతోషించానని తెలిపారు. ఏదైనా పనిచేయాలంటే డబ్బులు లేవంటూ చాలామంది చెబుతారని.. కానీ నిధులు లేకుండానే అద్భుతాలు చేయొచ్చ నడానికి ముస్తాబు కార్యక్రమమే చక్కటి ఉదాహరణ అని చెప్పారు. ఇటువంటి వినూత్న ఆలోచనలతో కలెక్టర్లు ముందుకురావాలని సూచించారు. ‘గతంలో కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తనతో మాట్లాడుతూ.. ఒక్క చాన్స్‌ ఇవ్వమని అడిగారు.. అయితే కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి తర్వాత తనేంటో నిరూపించుకున్నారు.’ అని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో 79 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయని, ముస్తాబు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే ఈ ప్రభావం రెండు కోట్లపై ఉంటుందని సీఎం అన్నారు. పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులకు కూడా పరిశుభ్రత అలవాటు అవుతుందన్నారు. ఇదిలా ఉండగా ఈ సదస్సులో ఎస్పీ మాధవరెడ్డి హాజరై.. జిల్లాలోని శాంతిభద్రతలు, తదితర అంశాలపై తీసుకుంటున్న చర్యలను సీఎంకు వివరించారు.

సీఎం దృష్టికి ‘రెవెన్యూ క్లినిక్‌’

జిల్లాలో నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్‌ విషయం కలెక్టర్ల సదస్సులో చర్చకు వచ్చింది. దీనిపై రాష్ట్ర రెవెన్యూ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సాయి ప్రసాద్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తెలియజేశారు. సెప్టెంబరు 29న ప్రారంభించిన రెవెన్యూ క్లినిక్‌ ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి పెద్దఎత్తున రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ రెవెన్యూ క్లినిక్‌ నిర్వహణలో కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌, ఇద్దరు సబ్‌ కలెక్టర్లు, తహసీల్దార్లు ఉంటున్నారని వెల్లడించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన సీఎంకు వివరించారు.

జిల్లావాసులు హర్షం

కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సదస్సులో పలుమార్లు సీఎం చంద్రబాబు పార్వతీపురం మన్యం జిల్లాను ప్రస్తావించి కలెక్టర్‌ను అభినందించడంపై ఈ ప్రాంతవాసులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఇకపోతే కలెక్టర్‌ ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో ‘ఆంధ్రజ్యోతి’లో పలుమార్లు ప్రచురితమైన కథనాలు ప్రత్యేకంగా కనిపించాయి. రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో ముస్తాబు కార్యక్రమాన్ని అమలు చేయాలని ఇటీవల గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశించిన సంగతి తెలిసిందే. సీఎం తాజా ఆదేశాల నేపథ్యంలో ఇకపై అంగన్‌వాడీ కేంద్రాల నుంచి ఇంటర్‌ కళాశాలల వరకూ ముస్తాబు అమలు కానుంది.

ఎంతో ఆనందంగా ఉంది

‘మన్యంలో ప్రారంభించిన ముస్తాబు కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తితో మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చేపడతాం. పార్వతీపురం మన్యం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం.’ అని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

జిల్లాలో ‘ముస్తాబు’ అమలు ఇలా..

జిల్లాలో 1703 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో ముస్తాబు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. రోజూ 1,14,581 మంది విద్యార్థుల పరిశుభ్రతను పరిశీలిస్తున్నారు. ప్రతి వారం ఉత్తమ విద్యార్థి లేదా ఉత్తమ తరగతిగా గుర్తింపు ఇస్తున్నారు. తద్వారా వారిలో పరిశుభ్రతపై మరింత ఆసక్తి పెంచుతున్నారు. కాగా ముస్తాబును పర్యవేక్షించడానికి ప్రతి తరగతిలో ఇరువురు విద్యార్థులు లీడర్లుగా నియమించారు. వారు తోటి విద్యార్థులు ముఖం, తల, చేతులు, దుస్తులు శుభ్రంగా ఉన్నవి లేనివి తనిఖీ చేస్తారు. బాగుంటే పాస్‌ అని, బాగోలేకుంటే ఫెయిల్‌ చెబుతారు. ఫెయిల్‌ అయిన విద్యార్థులు ముస్తాబు కార్నర్‌లో ఏర్పాటు చేసిన అద్దం, దువ్వెన, నీళ్లతో బకెట్‌,మగ్గు, సబ్బు, పౌడర్‌, నెయిల్‌ కట్టర్‌, తువ్వాలు తదితర వాటిని వినియోగించి శుభ్రంగా మళ్లీ తయారవుతారు. అటువంటి వారిని మళ్లీ లీడర్లు పరిశీలించి తరగతిలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం భోజనం ముందు చేతులు శుభ్రత తదితర అంశాలను పరిశీలిస్తారు. ఉదయం సూర్యనమస్కారాలు, సాయంత్రం ఆటలు తప్పనిసరి చేశారు.

Updated Date - Dec 18 , 2025 | 11:37 PM