పర్యాటకానికి స్వర్గధామం మన్యం
ABN , Publish Date - Nov 11 , 2025 | 11:50 PM
గత వైసీపీ ప్రభుత్వం గిరిజన గ్రామాలు అంటే కేవలం డోలీ మోతలనే అనేలా చేసింది.
మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
సాలూరు, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): ‘గత వైసీపీ ప్రభుత్వం గిరిజన గ్రామాలు అంటే కేవలం డోలీ మోతలనే అనేలా చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అడవి బిడ్డల అభివృద్ధికి బాటలు వేస్తూ ఇక్కడి ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తుంది. పర్యాటకానికి స్వర్గధామంగా మన్యం జిల్లా మారింది.’ అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. కురుకూటి పంచాయతీ దళాయివలస గ్రామ సమీపంలో అడపరాయి జలపాతాన్ని (వాటర్‌ఫాల్స్) మంగళవారం ఆమె ప్రారంభించారు. జలపాతం వద్ద గిరిజనులు, అధికారులు ఏర్పాటు చేసిన షాపులతో పాటు ప్రకృతి అందాలను, జలపాతాల సోయగాలను ఆమె తిలకించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఊటీ, కొడైకెనాల్, అరకు, లంబసింగి అందాలకు మించేలా జిల్లాలో అనేకచోట్ల వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నారు. 11 నుంచి 14 జలపాతాలను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశామని అన్నారు. ఇప్పటికే మొగనాళి, అడపరాయి వద్ద జలపాతాలు ప్రారంభించామని, త్వరలో తోణాం సమీపంలోని ఉన్న శిఖపరువు, భామిని, కురుపాంలోని వాటర్ ఫాల్స్‌ను కూడా ప్రారంభిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశయం మేరకు వీటిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతాలుగా చేయడమే లక్ష్యమని అన్నారు. పర్యాటకులు రాత్రివేళల్లో బస చేసేందుకు, వారికి సౌకర్యాలను కల్పించేందుకు ఈ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. అందుకుగానూ గిరిజనులకు రూ.3నుంచి రూ.5 లక్షల ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. జిల్లాలో 98 రోడ్ల నిర్మాణానికి రూ.28 కోట్ల నిధులు మ ంజూరు చేశామని అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ సుధారాణి, సీఐ రామకృష్ణ, టీడీపీ మండల అధ్యక్షుడు ఆముదాల పరమేశు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.