Manyam పరిపాలనలో మన్యం ఆదర్శం
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:27 AM
Manyam as a Model in Governance ప్రజా సమస్యల పరిష్కారం, పరిపాలనలో.. పార్వతీపురం మన్యం జిల్లా రాష్ర్టానికే ఆదర్శంగా నిలుస్తోందని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో జిల్లా ప్రగతిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా ప్రస్తావించిన నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌లో ఆయన్ని జిల్లా అధికారులు సత్కరించారు.
ఇది అందరి విజయం
కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి
పార్వతీపురం, డిసెంబరు22(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారం, పరిపాలనలో.. పార్వతీపురం మన్యం జిల్లా రాష్ర్టానికే ఆదర్శంగా నిలుస్తోందని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో జిల్లా ప్రగతిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా ప్రస్తావించిన నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌లో ఆయన్ని జిల్లా అధికారులు సత్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ‘ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన ముస్తాబు కార్యక్రమం అద్భుత ఫలితాన్నిచ్చింది. ఇది అందరి విజయం. ముస్తాబు అంటే కేవలం పౌడర్ కొట్టుకోవడం కాదు. అది విద్యార్థుల్లో పరిశుభ్రత, క్రమశిక్షణ, సంస్కారాన్ని పెంపొందించే ఒక గొప్ప సంకల్పం. ఈ కార్యక్రమం ఆవశ్యకతను ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తించి.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు, ఇంటర్ కళాశాలలు, వసతిగృహాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలు చేయాలని ఆదేశించడం జిల్లాకు దక్కిన గౌరవం. గత నెలలలో పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన వినతుల పరిష్కారంలో మన్యం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు సాగాలి. ప్రతినెలా జిల్లాను మొదటి స్థానంలోనే ఉండేలా అధికారులు నిబద్ధతతో పనిచేయాలి. జిల్లాలో విజయవంతమైన రెవెన్యూ క్లినిక్ విధానాన్ని కూడా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ప్రభుత్వ ప్రాధాన్యఅంశాలన్నింటిలోనూ జిల్లా ప్రస్తుతం టాప్-5లో ఉంది. రాబోయే రోజుల్లో అన్ని విభాగాల్లోనూ అగ్ర స్థానానికి చేరుకోవడమే లక్ష్యంగా పనిచేయాలి.’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్‌రెడ్డి, పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్వో హేమలత ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఆ పాఠశాలలకు ప్రత్యేక గుర్తింపు
‘పరిశుభ్రమైన వాతావరణం, సురక్షిత నీరు, పౌష్టికాహారంతో పాటు విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించే పాఠశాలలను ప్రత్యేకంగా గుర్తిస్తున్నాం. బడుల్లో ముస్తాబు కార్యక్రమాన్ని తప్పనిసరిగా అమలు చేయాలి. పిల్లల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జనవరి 26న గణతంత్ర దినోత్సవం నాడు ప్రశంసాపత్రాలు అందిస్తాం. విద్యార్థులు అనారోగ్యానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న స్కూళ్లను ఆదర్శంగా తీసుకోవాలి. ’ అని కలెక్టర్ తెలిపారు.
నేడు, రేపు సమీక్ష
‘ కలెక్టరేట్‌లో 23, 24 తేదీల్లో నిర్వహించనున్న సమీక్ష సమావేశానికి అధికారులంతా పూర్తి నివేదికలతో హాజరుకావాలి. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు సాధించిన ప్రగతి, భవిష్యత్ ప్రణాళికలను ప్రతిఒక్కరూ వివరించాలి. ఈ నెలాఖరుకు శాఖల ఫైల్స్ క్లియరెన్స్ చేయాలి. ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరగాలి. జనవరి 15కు ముందుగానే జిల్లాలో ప్రి ఫైల్ ఆన్‌లైన్ ద్వారా ఉండాలి. కాగితంతో పని ఉండకూడదు.’ అని కలెక్టర్ తెలిపారు.