MGNREGA Work ‘ఉపాధి’లో ముఖహాజరు
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:42 PM
Mandatory Attendance in MGNREGA Work ఉపాధి హామీ పథకంలో వేతనదారులకు ముఖ హాజరు తప్పనిసరి చేశారు. అక్రమాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నూతన విధానాన్ని అమలు చేస్తోంది. ఇకపై పనులకు వెళ్లే వేతనదారులు విధిగా ముఖహాజరు వేయాలి. లేకుంటే పనులు చేసినా.. హాజరుకానుట్టుగా నమోదవుతుంది.
అక్రమాలకు చెక్ పెట్టేందుకు చర్యలు
పార్వతీపురం, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో వేతనదారులకు ముఖ హాజరు తప్పనిసరి చేశారు. అక్రమాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నూతన విధానాన్ని అమలు చేస్తోంది. ఇకపై పనులకు వెళ్లే వేతనదారులు విధిగా ముఖహాజరు వేయాలి. లేకుంటే పనులు చేసినా.. హాజరుకానుట్టుగా నమోదవుతుంది. కూలి కూడా జమ కాదు. గతంలో పనులు చేపట్టిన ప్రాంతంలో మాన్యువల్‌గా వేతనదారుల హాజరు నమోదు చేసేవారు. కేవలం జాబ్‌కార్డు ఉంటే చాలు.. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారికి కూడా స్థానికంగానే హాజరు వేసేవారు. మృతుల పేర్లను మస్టర్లలో నమోదు చేసేవారు. స్థానికంగా లేని వారి జాబ్ కార్డులను వినియోగించుకుని కొంతమంది అక్రమాలకు పాల్పడేవారు. అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టినా.. క్షేత్రస్థాయిలో మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలో ఇటువంటి అక్రమాలకు చెక్ పట్టేందుకు కేంద్రం వేతనదారులకు ముఖ హాజరు తప్పనిసరి చేసింది. ఇప్పటికే జిల్లాలో ఈ విధానం అమలవుతోంది. వలస బాట పట్టిన వారు, స్థానికంగా లేని వారి జాబ్‌కార్డులను సైతం తొలగించారు. ప్రస్తుతం జిల్లాలో రెండు లక్షల వరకూ జాబ్‌కార్డులు ఉన్నాయి. దీనిపై డ్వామా పీడీ రామచంద్రరావును వివరణ కోరగా.. ‘పనులు చేపట్టే ప్రాంతంలో వేతనదారులకు ఫేస్ హాజరు తప్పనిసరి చేశాం. దీనిపై క్షేత్రస్థాయి సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలిచ్చాం. ఈ నెల నుంచి జిల్లాలో ఈ నిబంధన అమలవుతోంది. ’ అని తెలిపారు.