Man power shortage! మ్యాన్ ‘పవర్’ కొరత!
ABN , Publish Date - Aug 29 , 2025 | 12:13 AM
Man power shortage! ‘జిల్లాలో విద్యుత్ సేవలు మెరుగుపరుస్తాం. కొత్త సబ్‌స్టేషన్ల ఏర్పాటుతో పాటు ఇంటర్ కనెక్టింగ్ లైన్లు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా 11కేవీ విద్యుత్ లైన్‌లను వందల కిలోమీటర్ల మేర ఏర్పాటు చేస్తున్నాం. విద్యుత్ సమస్య అన్నదే లేకుండా చేస్తాం’ అంటూ ఇటీవల జిల్లాలో పర్యటించిన ఏపీఈపీడీసీఎల్ ఎండీ పృథ్వితేజ్ ప్రకటించారు.
మ్యాన్ ‘పవర్’ కొరత!
జిల్లాలో 258 పోస్టులు ఖాళీ
విద్యుత్ శాఖను వెంటాడుతున్న వెతలు
కొత్త నియామకాలపై ఆశలు
విజయనగరం, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి):
‘జిల్లాలో విద్యుత్ సేవలు మెరుగుపరుస్తాం. కొత్త సబ్‌స్టేషన్ల ఏర్పాటుతో పాటు ఇంటర్ కనెక్టింగ్ లైన్లు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా 11కేవీ విద్యుత్ లైన్‌లను వందల కిలోమీటర్ల మేర ఏర్పాటు చేస్తున్నాం. విద్యుత్ సమస్య అన్నదే లేకుండా చేస్తాం’ అంటూ ఇటీవల జిల్లాలో పర్యటించిన ఏపీఈపీడీసీఎల్ ఎండీ పృథ్వితేజ్ ప్రకటించారు. కానీ ఉన్నతాధికా రులు చెబుతున్న మాటలకు వాస్తవ పరిస్థితికి పొంతన లేదు. ప్రధానంగా విద్యుత్ శాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందితో పాటు పర్యవేక్షించే అధికారులు లేరు. అసిస్టెంట్ లైన్‌మన్లు, లైన్‌మెన్లు, లైన్ ఇన్‌స్పెక్టర్లు, ఏఈలు, ఏడీల కొరత అధికంగా ఉంది. ఉద్యోగ విరమణతో చాలా పోస్టులు ఖాళీ అవుతున్నా భర్తీ చేయడం లేదు. అటు బదిలీలు, పదోన్నతులతో పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. దీంతో వినియోగదారులకు అత్యవసర సేవలు అందడం లేదు. అటు పాడైన విద్యుత్ పరికరాలతో సిబ్బంది కుస్తీలు పట్టాల్సి వస్తోంది. అయితే ఇటీవల విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో జిల్లాలో ఖాళీగా ఉన్న వందలాది పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది.
జిల్లాలో మూడు విద్యుత్ డివిజన్లు కొనసాగుతున్నాయి. గృహ వినియోగానికి సంబంధించి 5,97,245, వాణిజ్య కనెక్షన్లు 64,407, వ్యవసాయ పంపు సెట్లకు సంబంధించి 40.386, పరిశ్రమలు 2,506 కనెక్షన్లు ఉన్నాయి. జిల్లా మొత్తాన్ని ఎస్‌ఈ పర్యవేక్షిస్తారు. డివిజన్, సబ్ డివిజిన్లను డీఈఈ, ఏడీఈ పర్యవేక్షిస్తారు. మండల స్థాయిలో ఏఈలదే కీలక పాత్ర. లైన్ ఇన్‌స్పెక్టర్లు, లైన్‌మెన్లు, అసిస్టెంట్ లైన్‌మెన్లు, జూనియర్ లైన్‌మెన్లు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తారు. ప్రస్తుతం జిల్లాలో ఏడీఈలు పూర్తిస్థాయిలో ఉన్నారు. ఏఈలు 51 మందికిగాను 32 మంది ఉన్నారు. 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జేఎల్‌ఎంలు 186 మందికిగాను కేవలం 12 మంది మాత్రమే ఉన్నారు. జేఎల్‌ఎంలు సీనియర్ లైన్‌మెన్లుగా, లైన్ ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతి పొందారు. వారి స్థానంలో ఇంతవరకూ కొత్తవారి నియామకాలు లేవు. సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్లు 413 మంది ఉండాలి. ప్రస్తుతం 348 మంది ఉన్నారు. ఇంకా 65 వరకూ ఖాళీలు ఉన్నాయి. ఈ లెక్కన జిల్లాకు 258 మంది అవసరం. ఒక్కో మండలంలో 50కు మించి రెవెన్యూ గ్రామాలుంటాయి. కానీ ఒకరిద్దరు లైన్‌మెన్‌లే ఉన్నారు. కొన్ని మండలాల్లో అయితే పూర్తిగా లేరు. దీంతో లైన్‌ఇన్‌స్పెక్టర్లు, ఏఈలు సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్లతో పనులు చేయిస్తున్నారు. కొత్త విద్యుత్ కనెక్షన్లు, మొండి బకాయిల వసూలు, విద్యుత్ మరమ్మతుల పనుల్లో పనిభారం ఎదుర్కొంటున్నారు.
ఏఈలు లేక..
జిల్లాలో విజయనగరం నగరపాలక సంస్థ, మూడు మునిసిపాల్టీలు ఉన్నాయి. 12 వరకూ మేజర్ పంచాయతీలు ఉన్నాయి. ఇక్కడ అర్బన్‌తో పాటు రూరల్ ఏఈలు ఉండాలి కానీ ఇటువంటి చోట మండలానికి ఒక్క ఏఈకే పరిమితం చేస్తున్నారు. దీంతో పర్యవేక్షణ బాధ్యతలు కరువవుతున్నాయి. జిల్లాలో వందకుపైగా సబ్‌స్టేషన్లు ఉన్నాయి. మరికొన్నిచోట్ల ఏర్పాట వుతున్నాయి. ఇప్పటివరకూ షిఫ్ట్ ఆపరేటర్లుగా ఉన్నవారు సచివాలయ లైన్‌మెన్లుగా నియమితులయ్యారు. దీంతో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే వీటి నియామకంలో రాజకీయ జోక్యం ఉండడం వల్ల ఖాళీగా విడిచిపెడుతన్నారు. ఈ పోస్టుకు లక్షలు పలుకుతుండడంతో నేతలు పోటీపడుతున్నారు. దీంతో ఎవరికి ఇవ్వాలో తెలియక విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు చేతులెత్తేస్తున్నారు. దీంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పడుతోంది. ఇప్పటికైనా అధికారులు దృష్టిసారించాల్సిన అవసరముంది.
నివేదించాం..
జిల్లాలో విద్యుత్ సమస్యలు లేకుండా చూస్తున్నాం. సిబ్బంది కొరత మాట వాస్తవమే. అయినా ఉన్న సిబ్బందితో పనిచేయిస్తున్నాం. జిల్లాలో అన్నిరకాల పోస్టులు కలిపి 258 ఖాళీ ఉన్నాయి. అదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించాం. సిబ్బంది కొరత అయినా ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. వర్షాకాలం కావడంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అటు గ్రామాల్లో ఎనర్జీ అసెస్టెంట్లు సైతం మంచి సేవలు అందిస్తున్నారు.
- లక్ష్మణరావు, ఎస్‌ఈ, విద్యుత్ శాఖ, విజయనగరం
---------------