దాడి ఘటనలో వ్యక్తి మృతి
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:58 PM
వరి చేనును మేకలు తిన్నాయనే కోపంతో ఓ వ్యక్తి.. మేకల కాపరితో పాటు ఆయన తండ్రిపై దాడి చేశాడు.
కురుపాం, అక్టోబరు11 (ఆంధ్రజ్యోతి): వరి చేనును మేకలు తిన్నాయనే కోపంతో ఓ వ్యక్తి.. మేకల కాపరితో పాటు ఆయన తండ్రిపై దాడి చేశాడు. ఈ దాడిలో మేకల కాపరి తండ్రి మృతిచెందాడు. ఈ ఘటన శనివారం కురుపాంలో చోటుచేసుకుంది. దీనిపై కురుపాం ఎస్‌ఐ పి.నారాయణరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. వరిచేనును మేకలు తినేశాయని కురుపాం పంచాయతీ హుకుంపేట గ్రామానికి చెందిన రాయఘడ నల్లన్న దొర.. మేదరవీధికి చెం దిన మేకల కాపరి రాయఘడ రాజుతో ఘర్షణ పడ్డాడు. ఆ ఘర్షణలో రాజు కింద పడిపోయాడు. అయితే అక్కడే ఉన్న రాజు తండ్రి పిల్లి రాములుపై కూడా నల్లన్న దొర దాడికి పాల్పడ్డాడు. రాములుకు అతడు బలంగా కొట్టడంతో కిందపడిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు 108 వాహనం కోసం ఫోన్ చేసినప్పటికీ అది అందుబాటులో లేకపోవడంతో సైకిల్‌పై రాములు ను స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాములు మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.