Share News

పోలీస్‌ వాహనం ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి

ABN , Publish Date - May 07 , 2025 | 11:49 PM

Man Dies After Being Hit by Police Vehicle పోలీస్‌ వాహనం ఢీకొన్న ఘటనలో గాయాలపాలైన వ్యక్తి చికిత్స పొందుతూ చివరకు ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు.

పోలీస్‌ వాహనం ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి
ఉల్లిభద్ర ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు

  • బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌

  • చర్యలు తీసుకుంటామని సీఐ హామీ

గరుగుబిల్లి, మే7(ఆంధ్రజ్యోతి): పోలీస్‌ వాహనం ఢీకొన్న ఘటనలో గాయాలపాలైన వ్యక్తి చికిత్స పొందుతూ చివరకు ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. వివరాల్లోకి వెళ్తే.. పార్వతీపురం మండలం అడ్డాపుశీల సమీపంలో టికెట్‌ సర్వీసింగ్‌ కోసం నిరీక్షిస్తున్న ఉల్లిభద్రకు చెందిన ఆటో డ్రైవర్‌ బి.గణేష్‌ (42)ను మంగళవారం సాయంత్రం పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి మెరుగవకపోవడంతో అదేరోజు రాత్రి విజయనగరం తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం గణేష్‌ మృతి చెందాడు. దీంతో భార్య , కుమారులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని మరోవైపు ఉల్లిభద్ర వాసులు డిమాండ్‌ చేశారు. బుధవారం సాయంత్రం అదే గ్రామ ప్రధాన రహదారిపై బైఠాయించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసే వరకూ కదిలేది లేదని స్పష్టం చేశారు. సుమారు అరగంట పాటు వారు నిరసన తెలపడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. పార్వతీపురం, పాలకొండ, జియ్యమ్మవలస, శ్రీకాకుళం, కురుపాం ప్రయాణికులు , వాహనదారులు ఇబ్బందులపాలయ్యారు. విషయం తెలుసుకున్న చినమేరంగి సీఐ టీవీ తిరుపతిరావు , గరుగుబిల్లి ఎస్‌ఐ రమేష్‌నాయుడు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్నారు. గ్రామస్థులతో మాట్లాడి ఆందోళన విరమించాలని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనాన్ని నడుపుతున్న జియ్యమ్మవలస కానిస్టేబుల్‌ ప్రసాద్‌ మద్యం తాగి ఉన్నారా? లేదా అన్న విషయంపై అవసరమైన పరీక్షలకు సిఫారసు చేశామన్నారు. ప్రమాదంపై విచారణ జరిపి తగు చర్యలు నిమిత్తం ఎస్పీకి నివేదిక అందిస్తామని వెల్లడించారు. మద్యం తాగి అజాగ్రత్తగా వాహనం నడిపినట్లు రుజువైతే చర్యలు తప్పవన్నారు. దీంతో గ్రామస్థులు శాంతించారు. కాగా ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని మరోవైపు సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బీవీ రమణ గరుగుబిల్లిలో పోలీస్‌స్టేషన్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన పోలీస్‌ వాహనం నెంబరు ప్లేటును మార్చి నిందితుడిని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రమాదం జరిగినా కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు.

Updated Date - May 07 , 2025 | 11:49 PM