మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
ABN , Publish Date - Oct 18 , 2025 | 12:14 AM
మక్కువలోని నాయుడు వీధికి చెందిన గొర్లి లక్ష్మణరావు(55) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు.
మక్కువ రూరల్, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): మక్కువలోని నాయుడు వీధికి చెందిన గొర్లి లక్ష్మణరావు(55) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కు సంబంధించి మక్కువ ఎస్‌ఐ ఎం.వెంకటరమణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మక్కువకు చెందిన లక్ష్మణరావు, సీతాలక్ష్మి వ్యవసాయం చేస్తుంటారు. వీరికి కుమారుడు అనంతకుమార్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలకు ఇదివరకే వారు వివాహం చేశారు. కుమారుడు అనంతకుమార్‌కు ఇదే మండ లంలోని దబ్బగడ్డకు చెందిన వీరపిండి శ్రీరాములు, లక్ష్మీల కుమార్తె పద్మావతితో రెండేళ్ల కిందట వివాహం చేశారు. భార్యాభర్తల మధ్య గొడవల నేపథ్యంలో పద్మావతి కన్నవారింటిలో ఉంటోంది. అక్కడ నుంచి అనంతకుమార్, అతడి కుటుంబసభ్యులపై పద్మావతి గృహ హింస, మెయింటినెన్స్ కేసులు పెట్టింది. ఈ కేసులతో మనస్తాపానికి గురైన లక్ష్మణరావు శుక్రవారం తన కల్లంలోని చింతచెట్టుకు ఉరి వేసుకున్నాడు. అనంతకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.