మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
ABN , Publish Date - Sep 27 , 2025 | 12:13 AM
మక్కువ గ్రామానికి చెందిన బుడుమూరు రవి(40) స్థానిక గజాలఖానా సమీపంలోని మామిడి తోటలో ఆత్మహత్య చేసుకున్నాడు.
పాలకొండ, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): మక్కువ గ్రామానికి చెందిన బుడుమూరు రవి(40) స్థానిక గజాలఖానా సమీపంలోని మామిడి తోటలో ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ ప్రయోగమూర్తి తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. మృతుడి వద్ద వాటర్ బాటిల్, పురుగు మందు డబ్బా, సెల్‌ఫోన్ లభ్యం కావడంతో వాటి ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. పోలీసులు అందించి న వివరాల మేరకు.. రవి, లక్ష్మీలకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి పిల్లలు పుట్టకపోవడంతో మనస్తాపానికి గురైన రవి ప్రతి రోజూ సాయంత్రం మద్యం తాగి బాధపడుతూ ఉండేవాడు. ఇటీవల భార్యాభర్తలు అంపిలి సమీ పంలోని ఓ ఇటుక బట్టీలో రోజువారీ కూలీలుగా చేరారు. గురువారం సాయం త్రం అనారోగ్యంగా ఉందని, పాలకొండ వెళ్లి వస్తానని భార్యకు చెప్పి రవి వెళ్లాడు. తిరిగి ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. చివరికి స్థానిక గజాలఖానా సమీపంలోని మామిడి తోటలో విగతజీవిగా కనిపించాడు. పిల్లలు లేరని బాధతోనే భర్త మృతి చెందాడని భార్య లక్ష్మి పోలీసులకు తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.
మానవత్వం చాటిన పోలీసులు
పాలకొండ ఎస్‌ఐ ప్రయోగమూర్తి మానవత్వాన్ని చాటుకున్నారు. కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి వచ్చేసరికి మృతదేహాన్ని తోట నుంచి బయటకు తీసుకు వచ్చేందుకు వాహనం రావడానికి వీలు లేకపోవడంతో స్వయంగా ఎస్‌ఐ మృతదేహాన్ని సిబ్బందితో కలిసి దుప్పటిలో ఎత్తుకుని ప్రధాన రహదారికి చేర్చారు.