Share News

Malaria విజృంభిస్తున్న మలేరియా

ABN , Publish Date - Jun 27 , 2025 | 11:21 PM

Malaria Outbreak Worsens సీతంపేట మన్యంలో మలేరియా విజృంభిస్తోంది. ఏ గిరిజన గ్రామంలో చూసినా కనీసం పది మంది వరకు మలేరియాతో బాధపడుతున్నారు. మర్రిపాడు పీహెచ్‌సీ పరిధిలో ఎక్కువగా జ్వరాలు నమోదవుతున్నాయి.

Malaria  విజృంభిస్తున్న మలేరియా
మర్రిపాడు పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న మలేరియా జ్వర పీడితులు

పీహెచ్‌సీలు కిటకిట

సీతంపేట రూరల్‌, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): సీతంపేట మన్యంలో మలేరియా విజృంభిస్తోంది. ఏ గిరిజన గ్రామంలో చూసినా కనీసం పది మంది వరకు మలేరియాతో బాధపడుతున్నారు. మర్రిపాడు పీహెచ్‌సీ పరిధిలో ఎక్కువగా జ్వరాలు నమోదవుతున్నాయి. తోటగూట, పీవీ ఈతమానుగూడ, మర్రిపాడు, సవరపాడు, తుంబలి, గ్రామాల్లో జ్వరపీడితులు ఎక్కువగా ఉన్నారు. ఇక శుక్రవారం సవరపాడుకు చెందిన సవర సౌజన్య, జి.అజిత్‌, ఎన్‌.నారాయణ, మండంగి అఖిల్‌, పత్తిక విశ్వనాఽథం తదితరులు మర్రిపాడు పీహెచ్‌సీలో వైద్యసేవలు పొందుతున్నారు. తోటగూడ గ్రామంలో సవర లుంబిరి అనే వృద్ధురాలు చలి జ్వరంతో వణుకు తోంది. పీవీ ఈతమానుగూడలో ఆరిక అల్లూరి, సంధ్యారాణిలు జ్వరంతో మంచం పట్టారు.

రోగులకు తప్పని ఇబ్బందులు

మర్రిపాడు పీహెచ్‌సీలో శుక్రవారం ఓపీ సుమారు 45 వరకు ఉండగా వీరిలో జ్వరపీడితులే ఎక్కువ మంది ఉన్నారు. వైద్యాధికారి సత్యవేణి వైద్యాధికారుల సమావేశానికి హాజరయ్యారు. దీంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యసిబ్బంది సేవలందించారు. ఈ పీహెచ్‌సీకి ఒక్కరే వైద్యాధికారి ఉండడంతో రోగులుకు ఇబ్బందులు తప్పడం లేదు.

వైద్యాధికారులు లేక ...

ఐటీడీఏ పరిధిలోని దోనుబాయి, కుసిమి, మర్రిపాడు పీహెచ్‌సీల పరిధిలో మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.ఈ మూడు పీహెచ్‌సీల్లో ఒక్కొక్కరే వైద్యాధికారులు రోగులకు సేవలందిస్తున్నారు. మరోవైపు గ్రామాల్లో నిర్వహించే వైద్య శిబిరాల్లో కూడా వారే సేవలందించాల్సి వస్తోంది. మలేరియా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పీహెచ్‌సీలకు అదనపు వైద్యులను నియమించాలని గిరిజనసంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. పీహెచ్‌సీల్లో అదనపు వైద్యాధికారుల భర్తీ కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపామని డిప్యూటీ డీఎంహెచ్‌వో పి.విజయపార్వతి తెలిపారు. మరికొద్ది రోజుల్లో పోస్టుల భర్తీ జరుగుతుందని ఆమె సమాధానమిచ్చారు.

Updated Date - Jun 27 , 2025 | 11:21 PM