Make TDP stronger టీడీపీని మరింత బలోపేతం చేయండి
ABN , Publish Date - May 22 , 2025 | 12:20 AM
Make TDP stronger తెలుగుదేశం పార్టీని జిల్లాలో మరింత బలోపేతం చేసి ముందుకు నడిపించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు పిలుపునిచ్చారు.
టీడీపీని మరింత బలోపేతం చేయండి
పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు
సందడిగా జిల్లా మహానాడు
ఎనిమిది తీర్మానాలకు ఆమోదం
విజయనగరం/విజయనగరం రూరల్, మే 21(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీని జిల్లాలో మరింత బలోపేతం చేసి ముందుకు నడిపించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు పిలుపునిచ్చారు. విజయనగరంలోని మెసానిక్ టెంపుల్ వేదికగా బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి మహానాడులో ఆయన కీలకంగా ఉపాన్యాసించారు. తొలుత పార్టీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులంతా పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఏడాది కాలంలో వివిధ నియోజకవర్గాల్లో మరణించిన టీడీపీ కార్యకర్తలకు సంతాప సూచికంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున అధ్యక్షతన ప్రారంభమైన సభలో అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు 2019 నుంచి 2024 వరకూ ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఐదేళ్ల పిచ్చోడి (జగన్) పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. ఆ సమయంలో విజయనగరంలో మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా వినియోగించడం వల్లే ప్రస్తుతం విజయనగరానికి ఉగ్ర లింకుల మరక అంటిందన్నారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకటరావు మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన హామీల్లో(సూపర్ సిక్స్)లో తొలి ఏడాదే ఐదు ప్రజల ముంగిటకు చేరాయని, ఈ విషయాన్ని ప్రజలకు వివరించడం మరిచిపోతే, చైతన్యం తేకపోతే ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందన్నారు. చేసింది చెప్పాలన్నారు. శాసనసభ మాజీ స్పీకర్, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు కావలి ప్రతిభాభారతి మాట్లాడుతూ, దేశంలో ఏ పార్టీకి లేని విధంగా టీడీపీకి కార్యకర్తలు ఉన్నారన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఏడాదిలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదన్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో మహానాడు సభలు పూర్తయ్యాయని, రాష్ట్రస్థాయి మహానాడును కూడా విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ, పార్టీలో సామాన్య కార్యకర్తకు సైతం గుర్తింపు ఉంటుందని చెప్పేందుకు తనకు లభించిన ఎంపీ పదవే నిదర్శనమన్నారు. సభకు అధ్యక్షత వహించిన కిమిడి నాగార్జున మాట్లాడుతూ, టీడీపీ నాయకులు కార్యకర్తల త్యాగాలు మరువలేనివని, వైసీపీ అరాచక పాలనను అంతమొందించేందుకు పార్టీ శ్రేణులు ఎంతో శ్రమించాయన్నారు. పార్టీ విజయనగరం జిల్లా పరిశీలకుడు శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, పార్టీ సంస్థాగత నిర్మాణం తొలి దశ ఇప్పటికే పూర్తయిందని, మహానాడులోగా మిగతా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ దశలవారీగా ప్రారంభం కానుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అదితిగజపతిరాజు, బేబీనాయన, కోండ్రు మురళీమోహన్, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ, మాజీ మంత్రి సుజయ్ కృష్ణరంగారావు, టీడీపీ నాయకుడు మహంతి చిన్నంనాయుడు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు తదితరులు పాల్గొన్నారు.
తీర్మాణాలు
- నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపాలని చీపురుపల్లి నియోజకవర్గ నాయకుడు కిమిడి రామ్ మల్లిక్ నాయుడు తీర్మాణించారు. దీనిని టీడీపీ రాష్ట్ర నాయకుడు కరణం శివరామకృష్ణ బలపరిచారు.
- పోలవరం ప్రాజెక్టు విషయమై ప్రభుత్వ మాజీ విప్ గద్దె బాబురావు తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు. మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు బలపరిచారు.
- భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ తీర్మాణాన్ని మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు ప్రవేశపెట్టగా, బొబ్బిలి ప్రాంతానికి చెందిన చింతల రామకృష్ణ బలపరిచారు.
- విజయనగరం నుంచి పాలకొండ రహదారిని నాలుగు లైన్లుగా నిర్మాణం చేయాలని రాజాం నియోజకవర్గానికి చెందని కొల్లా అప్పలనాయుడు తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు.
- విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మెట్రో రైలు అంశంపై తీర్మాణం ప్రవేశపెట్టారు.
- ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ మహిళా సాధికారిత, అభివృద్ధి, సంక్షేమం విషయమై తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు.
- ఆపరేషన్ సింధూర్ విజయవంతం, ఉగ్రవాద దాడికి ధీటైన సమాధానం ఇవ్వడంలో దేశ ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు మద్దతుగా నిలిచిన చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తీర్మాణాన్ని కళా వెంకటరావు ప్రతిపాదించారు.
- దేశానికి విశేష సేవ చేసిన ఇద్దరు శాస్త్రవేత్తలు ఒకే రోజు చనిపోవడం బాధకరమని, వారి సేవలకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మాణాన్ని అశోక్ గజపతిరాజు ప్రవేశపెట్టారు. అన్నింటికీ సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు.