పాలకొండను జిల్లాగా చేయండి
ABN , Publish Date - Aug 14 , 2025 | 12:26 AM
జిల్లాల పునర్విభజనకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం విజయవాడలోని రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరిగింది.
- లేదా శ్రీకాకుళంలో కలపండి
- పాలకొండ జిల్లా సాధన సమితి వినతి
పాలకొండ, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాల పునర్విభజనకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం విజయవాడలోని రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరిగింది. ఈ సమావేశానికి పాలకొండ జిల్లా సాధన సమితి గౌరవాధ్యక్షుడు కనపాక చౌదరినాయుడు, సాధన సమితి జిల్లా ట్రెజరర్ సబ్బ నానాజీతో కూడిన బృందం హాజరై తమ సమస్యలను మంత్రివర్గ ఉపసంఘానికి తెలియజేసింది. పాలకొండ రెవెన్యూ డివిజన్‌ను కొత్త జిల్లా అయినా చేయాలి.. లేదా శ్రీకాకుళం జిల్లాలో అయినా కలపాలని విన్నవించింది. ఈ నెల 29, 30 తేదీల్లో తాము జిల్లా కేంద్రాలకు వచ్చి ప్రజల అభిప్రాయాలు సేకరిస్తామని, తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని, మీ అభిప్రాయాలను కూడా నివేదికలో పొందుపరుస్తామని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు.. పాలకొండ జిల్లా సాధన సమితి సభ్యులకు హామీనిచ్చారు. గతంలో జిల్లాల విభజన సమయంలో జరిగిన అన్యాయాన్ని స్థానిక ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని, పాలకొండలో అన్ని వర్గాలతో రాజకీయాలకు అతీతంగా సమావేశం ఏర్పాటు చేసి, మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తీసుకొని వెళతామని పాలకొండ జిల్లా సాధన సమితి అధ్యక్ష కార్యదర్శులు బుడితి అప్పలనాయుడు, వండాన కూర్మారావు ఒక ప్రకటనలో తెలిపారు.