Tourism Hub మన్యాన్ని పర్యాటక హబ్‌గా మార్చాలి
ABN , Publish Date - Nov 08 , 2025 | 11:45 PM
Make Manyam a Tourism Hub ప్రకృతిని పర్యాటకులకు పరిచయం చేసి.. జిల్లాను పర్యాటక హబ్‌గా మార్చాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. శనివారం పాచిపెంట మండలం నీలంవలస జలపాతాన్ని సందర్శించారు. పర్యాటకంగా అభివృద్ధి చేయ డానికి గల అవకాశాలను పరిశీలించారు.
సాలూరు రూరల్/పాచిపెంట,నవంబరు 8 (ఆంధ్రజ్యోతి ): ప్రకృతిని పర్యాటకులకు పరిచయం చేసి.. జిల్లాను పర్యాటక హబ్‌గా మార్చాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. శనివారం పాచిపెంట మండలం నీలంవలస జలపాతాన్ని సందర్శించారు. పర్యాటకంగా అభివృద్ధి చేయ డానికి గల అవకాశాలను పరిశీలించారు. ఈ మేరకు జలపాతం వద్దే అధికారులతో సమీక్షించారు. సుందరంగా ఉన్న నీలంవలస జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుందన్నారు. దట్టమైన అటవీప్రాంతంలో కొండల నడుమ ఉన్న ఈ జలపాతాన్ని ప్రకృతి ప్రేమికులకు ఎంతో నచ్చు తుందని తెలిపారు. ప్రకృతి ప్రేమికులు, సాహస యాత్రికులు, ఫొటోగ్రాఫర్స్‌కు మధురానుభూతిని అందిస్తుందని వెల్లడించారు. దీని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. అనంతరం రాళ్లతో ఏర్పాటు చేసిన సిమ్మింగ్‌పూల్‌ను పరిశీలించి.. యువత, అధికారులతో కలిసి దానిని శుభ్రపర్చే కార్యక్రమంలో పాల్గొన్నారు.
‘ముస్తాబు’ అమలుపై సంతృప్తి
పాచిపెంట మండలం సురగడవలస జీపీఎస్ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ముస్తాబు కార్యక్రమం అమలును పరిశీలించారు. విద్యార్థులు పరిశుభ్రంగా ఉండడాన్ని గమనిం చారు. మండల విద్యాశాఖ , సురగడవలస హెచ్‌ఎంను శ్రీనివాసరావును అభినందించారు. అనంతరం ముస్తాబు కార్యక్రమం లక్ష్యం, ఏ విధంగా పరిశుభ్రత పాటించాలనే దానిపైౖ గిరిజన విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆ తర్వాత అక్కడే ఉన్న 104 చంద్రన్న సంచార వైద్య కార్యక్రమాన్ని పరిశీలించి మెడికల్ సిబ్బందితో మాట్లాడారు. స్థానిక గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ గ్రామానికి చెందిన ఆరవ తరగతి చదువుతున్న యోగిష్ అనే విద్యార్థికి కంటిచూపు సమస్య ఉన్నట్టు ఆయన దృష్టికి వచ్చింది. దీంతో విద్యార్థి నేత్ర చికిత్సకు తగిన ఏర్పాట్లు చేయాలని 104 మెడికల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పాచిపెంట మండలంలో ముస్తాబు కార్యక్రమం అమలు తీరును సోషల్‌మీడియాలో సైతం ఆయన ప్రస్తావించారు.