Share News

చెరువులకు మహర్దశ

ABN , Publish Date - Aug 22 , 2025 | 12:07 AM

జిల్లాలో వంద ఎకరాల ఆయకట్టు దాటిన చెరువులకు మహర్దశ పట్టనుంది.

చెరువులకు మహర్దశ
వంద ఎకరాల ఆయకట్టు ఉన్న వీరఘట్టం చెరువు

- వంద ఎకరాల ఆయకట్టు దాటినవి ఆధునికీకరణ

- దృష్టి సారించిన ప్రభుత్వం

- జిల్లాలో 90 చెరువుల గుర్తింపు

- వచ్చే ఖరీఫ్‌ నాటికి పనులు పూర్తిచేసేందుకు ప్రణాళికలు

పార్వతీపురం, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వంద ఎకరాల ఆయకట్టు దాటిన చెరువులకు మహర్దశ పట్టనుంది. ఈ చెరువులను ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. పార్వతీపురం, పాలకొండ డివిజన్‌ల పరిధిలోని 10 మండలాల్లో 90 చెరువులు వంద ఎకరాలకు పైబడి ఆయకట్టు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పార్వతీపురం మండలంలో 22, సాలూరు 9, మక్కువ 2, గరుగుబిల్లి 13, కొమరాడ 6, కురుపాం 6, జియ్యమ్మవలస 1, గుమ్మలక్ష్మీపురం 2, సీతానగరం 17, బలిజపేట మండలంలో 12 మొత్తం 90 చెరువులను గుర్తించారు. వీటి పరిధిలో 19,868 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువులను మొదటి దశలో అభివృద్ధి చేయనున్నారు. వాస్తవానికి తొలుత జిల్లాలో 14 చెరువుల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఇరిగేషన్‌ శాఖ అంచనాలు తయారు చేసింది. ఇందులో పార్వతీపురం మండలంలో 4, సాలూరు 2, కురుపాం 4, గరుగుబిల్లి, కొమరాడ, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో ఒక్కొక్క చెరువును అభివృద్ధి చేయాలని అధికారుల నిర్ణయించారు. అయితే, జిల్లా వ్యాప్తంగా వంద ఎకరాలు దాటిన ఆయకట్టుకు సంబంధించిన చెరువులను గుర్తించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో మిగిలిన చెరువులకు కూడా అంచనాలు తయారు చేసి వాటిని అభివృద్ధి చేసేందుకు ఇరిగేషన్‌ శాఖ చర్యలు తీసుకుంటుంది. చెరువు గట్లను పటిష్టం చేయడం, చప్టాల నిర్మాణంతో పాటు మదుమల మరమ్మతులు తదితర పనులు చేపట్టనున్నారు.

ప్రత్యేక దృష్టిసారించిన ప్రభుత్వం

కూటమి ప్రభుత్వం ఇరిగేషన్‌ శాఖపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నీరు-చెట్టు కార్యక్రమం కింద చెరువులను అభివృద్ధి చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం సాగునీటి చెరువులను పట్టించుకోలేదు. దీంతో చాలా గ్రామాల్లో చెరువులు పూడికలు, పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. ఫలితంగా సాగునీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. పలుచోట్ల ఆక్రమణకు గురై చెరువు గర్భాలు కుచించుకుపోయాయి. కూటమి ప్రభుత్వం తర్వాత చెరువులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వంద ఎకరాల ఆయకట్టు ఉన్న చెరువులను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఖరీప్‌ సీజన్‌కు ఈ చెరువులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి, ఆయకట్టు రైతులకు సాగునీరిచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఫ చెరువుల అభివృద్ధి, గ్రౌండ్‌ వాటర్‌ తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌, జేసీ శోభిక తదితర అధికారులు హాజరయ్యారు. జిల్లాలోని పరిస్థితిని కలెక్టర్‌ వివరించారు. ఈ నెల 25 నాటికి ప్రభుత్వ శాఖల్లో డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ పూర్తి చేస్తామని చెప్పారు.

ఇరిగేషన్‌ ట్యాంకులు అభివృద్ధి చేస్తాం:కలెక్టర్‌

జిల్లాలో మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకుల అభివృద్ధి కోసం రిపేర్‌ రినోవేషన్‌ రెస్ట్రోరేష్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌) కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంక్‌ల అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నెల 25 నాటికి కనీసం 25 ట్యాంక్‌ల డీపీఆర్‌ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఈ పనులు చేపట్టడం వలన భూ గర్భ జలాలు పెరుగుతాయని, వేసవిలో కూడా నీరు ఇంకిపోకుండా ఉండేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడనుందని తెలిపారు. కార్యక్రమంలో జేసీ శోభిక, ఇరిగేషన్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2025 | 12:07 AM