sachivalayam హడావుడి చేశారు.. అలానే వదిలేశారు!
ABN , Publish Date - Nov 01 , 2025 | 11:27 PM
Made a Fuss… Then Left It As It Is! గత వైసీపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ అంటూ ఎంతో హడావుడి చేసింది. కానీ పక్కా భవనాల నిర్మాణం మాత్రం పూర్తి చేయించలేకపోయింది. చేసిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లించకలేకపోయింది. దీంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. ఫలితంగా భవన నిర్మాణాలకు బ్రేక్ పడింది. చివరకు అద్దె గృహాలు, పంచాయతీ భవనాల్లోనే సచివాలయాలు, ఆర్‌బీకేలు, వెల్‌నెస్ సెంటర్లను నిర్వహించాల్సిన దుస్థితి.
311లో పూర్తయిన సచివాలయ భవన నిర్మాణాలు 126
మిగిలినవి పంచాయతీ భవనాలు, అద్దె గృహాల్లోనే..
ఆర్‌బీకేలు, వెల్‌నెస్ సెంటర్ల పరిస్థితి అంతే..
ఉద్యోగులు, ప్రజలకు తప్పని ఇబ్బందులు
కూటమి ప్రభుత్వంపై ఆశలు
జియ్యమ్మవలస, నవంబరు1(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ అంటూ ఎంతో హడావుడి చేసింది. కానీ పక్కా భవనాల నిర్మాణం మాత్రం పూర్తి చేయించలేకపోయింది. చేసిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లించకలేకపోయింది. దీంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. ఫలితంగా భవన నిర్మాణాలకు బ్రేక్ పడింది. చివరకు అద్దె గృహాలు, పంచాయతీ భవనాల్లోనే సచివాలయాలు, ఆర్‌బీకేలు, వెల్‌నెస్ సెంటర్లను నిర్వహించాల్సిన దుస్థితి. దీంతో అటు ఉద్యోగులు, ఇటు ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై జిల్లావాసులు ఆశలు పెట్టుకున్నారు.
ఇదీ పరిస్థితి ..
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2019, అక్టోబరు 2 (గాంధీ జయంతి రోజు)న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రారంభించారు. జిల్లాలో ఉన్న 451 పంచాయతీలను 311 సచివాలయాల పరిధికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో సచివాలయాల భవన నిర్మాణం ప్రారంభించి ఏడాదిన్నరలో పూర్తి చేయాలని నాటి ప్రభుత్వం ఆదేశించింది. అనంతరం 301 రైతుభరోసా కేంద్రాలు, 193 వెల్‌నెస్ సెంటర్లు మంజూరు చేశారు. కానీ గత ఐదేళ్లలో వీటి నిర్మాణ ప్రగతి 30 శాతం కూడా దాటలేదు.
నిర్మాణాలు ఇలా..
- జిల్లాలోని ఒక్కో సచివాలయ భవన నిర్మాణానికి రూ. 45.60 లక్షల చొప్పున మొత్తం రూ. 131.26 కోట్లు మంజూరు చేశారు. అయితే 311 గ్రామ సచివాలయాలకు గాను 126 భవన నిర్మాణాలు మాత్రమే పూర్తి చేయగలిగారు. ఇంకా 178 వివిధ దశల్లో ఉండిపోయాయి. ఏడు చోట్ల అసలు నిర్మాణం ప్రారంభం కాలేదు.
- రైతుభరోసా కేంద్రాల పరిస్థితి చూస్తే జిల్లాలో 301 భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేశారు. ఒక్కో భవనానికి రూ. 21.8 లక్షలు చొప్పున మొత్తం రూ. 65.61 కోట్లు మంజూరు చేశారు. కానీ కేవలం 101 భవన నిర్మాణాలే పూర్తి చేయగలిగారు. 176 భవనాలు వివిధ దశల్లో ఉండగా, 24 భవన నిర్మాణాలు ఇంకా ప్రారంభమే కాలేదు.
- జిల్లాలో ఒక్కొక్క వెల్‌నెస్ సెంటర్ (ఆరోగ్య కేంద్రం) నిర్మాణానికి రూ.20.30 లక్షలు కేటాయించారు. మొత్తంగా 193 భవనాల నిర్మాణానికి రూ. 39.93 కోట్లు మంజూరు చేశారు. కానీ ఇంకా 50 భవన నిర్మాణాలే ప్రారంభం కాలేదు.
- గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకే, వెల్‌నెస్ కేంద్రాల నిర్మాణాలు పూర్తిచేయాలంటే ప్రస్తుత ప్రభుత్వం రూ. 95.87 కోట్లు వెచ్చించాల్సి ఉందని అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి.
ఇరుకు గదులతో అవస్థలు
ప్రస్తుతం జిల్లాలో 63 గ్రామ సచివాయాలు అద్దె గృహాల్లో, 115 పంచాయతీ భవనాల్లో కొన సాగుతున్నాయి. మరో ఏడు చోట్ల మరింత దారుణంగా ఉన్న స్థలాల్లో కొనసాగుతున్నాయి. 96 ఆర్‌బీకేలు అద్దె భవనాల్లో, మిగిలినవి పాత పంచాయతీ భవనంలోని ఒక భాగంలో కొన సాగుతున్నాయి. ఇక వెల్‌నెస్ సెంటర్లు పరిస్థితి ఒక్కసారి చూస్తే 16 ప్రభుత్వ భవనాల్లో, 98 ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్నాయి. అయితే ఆయా భవనాల్లో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు లేక ఇరుకు గదుల్లో సిబ్బంది తీవ్ర అవస్థలు పడుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ రికార్డులకు భద్రత లేకుండాపోతుంది. దీనిపై పంచాయతీరాజ్ శాఖ ఈఈ వీఎస్ నగేష్ బాబును వివరణ కోరగా.. కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి దృష్టిలో భవన నిర్మాణాల విషయం పెట్టామన్నారు. ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు.