Cancer ‘క్యాన్సర్’పై కదిలిన యంత్రాంగం
ABN , Publish Date - Jul 05 , 2025 | 10:42 PM
Machinery Swings into Action Against Cancer కొమరాడ మండలంలో గంగిరేగువలస, రాజ్యలక్ష్మీపురం పంచాయతీలను క్యాన్సర్ కబళిస్తోందని ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు శనివారం కొమరాడ తహసీల్దార్ సత్యనారాయణ ఆధ్వర్యంలో అధికారుల బృందం రెండు గ్రామాల ప్రజల అభ్యంతరాలను తెలుసుకుంది.
పారదర్శకంగా దర్యాప్తు జరపాలని ప్రజలు డిమాండ్
ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన
జియ్యమ్మవలస, జూలై5(ఆంధ్రజ్యోతి): కొమరాడ మండలంలో గంగిరేగువలస, రాజ్యలక్ష్మీపురం పంచాయతీలను క్యాన్సర్ కబళిస్తోందని ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు శనివారం కొమరాడ తహసీల్దార్ సత్యనారాయణ ఆధ్వర్యంలో అధికారుల బృందం రెండు గ్రామాల ప్రజల అభ్యంతరాలను తెలుసుకుంది. కెమికల్స్ వ్యర్థాలను జంఝావతి ప్రాజెక్టు పాత గోడౌన్‌లో నిల్వ చేస్తున్నట్లు గంగిరేగువలస ఎంపీటీసీ సభ్యుడు జి.వెంకటనాయుడు, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కొల్లి సాంబమూర్తి అధికారుల బృందం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రాజెక్టు ఏఈ అభిషేక్ పాత గోడౌన్‌ను శుభ్రం చేయించి అక్కడకు ఎవరూ వెళ్లకుండా దారిలో ట్రెంచ్ కొట్టించారు. సమగ్రంగా దర్యాప్తు చేసి వాస్తవాలు నిగ్గు తేల్చాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు. అనంతరం అధికారుల బృందం ఆ ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది. అక్కడి పరిసరాలను పరిశీలించింది. అయితే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తింది. కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో అధికారుల బృందం వెనుదిరిగింది. అయితే దర్యాప్తు బృందం వెళ్లిపోయిన వెంటనే కొందరిపై ఫ్యాక్టరీ యాజమాన్యం గొడవకు దిగారని ఎంపీటీసీ సభ్యులు తెలిపారు.