lorge people came for pydimamba sirimanoothsavam పైడిమాంబకు ప్రణమిల్లి
ABN , Publish Date - Oct 08 , 2025 | 12:31 AM
lorge people came for pydimamba sirimanoothsavam పైడితల్లి సిరిమాను సంబరం అంబరాన్ని అంటింది. భక్తకోటి జయజయధ్వానాల నడుమ సిరిమాను ముందుకు నడిచింది. ఎటు చూసినా భక్తజన సంధ్రమే కనిపించింది. అమ్మవారి ప్రతిరూపంగా సిరిమాను అధిరోహించిన ఆలయ పూజారిని చూసేందుకు లక్షలాది మంది జనం హాజరయ్యారు.
పైడిమాంబకు ప్రణమిల్లి
అంబరాన్ని అంటిన సిరిమాను సంబరం
అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
వర్షంలో తడుస్తూనే నిరీక్షణ
4.22 గంటలకు కదిలిన సిరిమాను
మార్మోగిన పైడిమాంబ నినాదాలు
పైడితల్లి సిరిమాను సంబరం అంబరాన్ని అంటింది. భక్తకోటి జయజయధ్వానాల నడుమ సిరిమాను ముందుకు నడిచింది. ఎటు చూసినా భక్తజన సంధ్రమే కనిపించింది. అమ్మవారి ప్రతిరూపంగా సిరిమాను అధిరోహించిన ఆలయ పూజారిని చూసేందుకు లక్షలాది మంది జనం హాజరయ్యారు. జై పైడిమాంబ అంటూ హోరెత్తించారు. సిరిమాను పైకి అరటిపండ్లను విసురుతూ భక్తిప్రపత్తులను చాటారు. అంతకుముందు వర్షంలో తడిసినప్పటికీ అమ్మవారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు ఉన్నచోటే నిరీక్షించారు. ఇటు ఊరేగింపునకు సిరిమానును సిద్ధం చేసే సిబ్బంది, భక్తులు కూడా వాన పడుతున్నా ఏర్పాట్లలోనే తలమునకలయ్యారు. సాయంత్రం 4.22 గంటలకు సిరిమాను రథం ప్రారంభమైంది. ముందు పైడిమాంబ పరివారంగా భావించే అంజలి రథం, జాలరి వల, పాలధార, తెల్ల ఏనుగు నడవగా సిరిమాను చదురుగుడి నుంచి కోట వద్ద ఉన్న కోట శక్తిని తాకుతూ మూడు పర్యాయాలు తిరిగింది.
విజయనగరం/ రూరల్/కలెక్టరేట్/దాసన్నపేట/రింగురోడ్డు/కల్చరల్, అక్టోబరు7(ఆంధ్రజ్యోతి)
పైడితల్లి సిరిమానోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భక్తులు సిరిమాను ఊరేగింపును కనులారా వీక్షించి పులకించిపోయారు. ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరావు అమ్మవారి ప్రతిరూపంగా సిరిమానును అధిరోహించి అశేష భక్త జనానికి ఆశీస్సులు అందించారు. షెడ్యూల్ ప్రకారం జిల్లా యంత్రాంగం సిరిమానోత్సవాన్ని 3 గంటలకు ప్రారంభించాలని నిర్ణయించింది. వర్షం కారణంగా సాయంత్రం 4.22 గంటలకు సిరిమాను ఊరేగింపు మొదలైంది. 5.45 గంటల వరకూ సాగింది. అంతకుముందు హుకుంపేటలో సిద్ధమైన సిరిమాను, ఇరుసుమాను, ఇతర రథాలను మధ్యాహ్నం 1.30 గంటలకు చదురుగుడికి చేర్చారు. ఆలయ పూజారి వెంకటరావు హుకుంపేట నుంచి కాలినడకన చదురుగుడికి 2.45 గంటలకు చేరుకున్నారు. వేద పండితులు ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయ వస్త్రధారణలో తలపాగా ధరింపచేసి పూజారి వెంకటరావును సిరిమాను అధిరోహణకు సిద్ధం చేశారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజులు అక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మధ్యాహ్నం 3 గంటలకు సిరిమాను ఊరేగింపు ప్రారంభం అవుతుందని అఽధికారులు ప్రకటించడంతో అదే సమయానికి భారీ సంఖ్యలో భక్తులు ఇటు కోట, అటు గంటస్తంభం, అంబటి సత్తర్వు రోడ్డు, గురజాడ అప్పారావు స్వగృహం రోడ్డు వద్దకు చేరుకున్నారు. సిరిమానోత్సవం ప్రారంభానికి ముందు వర్షం పడడంతో ఏర్పాట్లకు స్వల్పంగా ఆటంకం కలిగింది. వర్షం తగ్గాక 4.22 గంటలకు సిరిమాను, రథాలు కదిలాయి. సిరిమాను తిరిగే రోడ్డంతా భక్తజనంతో రద్దీగా మారిపోయింది. మూడంచెల భద్రత ఉండడంతో అరటిపండ్లు, పువ్వులు సమర్పించేందుకు కొన్ని మార్గాల్లో అవకాశం లేకపోయింది. సిరిమాను ఊరేగింపు ఆసాంతం పైడిమాంబ నినాదాలు నింగిని తాకాయి.
ఫ ఎప్పటిలాగే కోట బురుజుపై ఆలయ అనువంశిక ధర్మకర్త, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు దంపతులు, ఆయన కుమార్తె ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ, ఆనందగజపతిరాజు సతీమణి సుదా గజపతిరాజు, కుమార్తె ఉర్మిళ గజపతిరాజు తదితరులు సిరిమానోత్సవాన్ని తిలకించారు.
------------------
పట్టు వస్త్రాలు సమర్పించిన దేవదాయశాఖ మంత్రి
విజయనగరం రూరల్/కల్చరల్, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): పైడిమాంబకు దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్దకు మంగళవారం ఆయన చేరుకోగానే దేవదాయశాఖాధికారులు, వేద పండితులు, పలువురు ప్రజాప్రతినిధులు స్వాగతం పలికి తోడ్కొని వెళ్లారు. వేద పండితులు మంత్రి రామనారాయణరెడ్డికి శాస్త్రోక్తంగా తలపాగా చుట్టి ఆలయ మర్యాదల ప్రకారం పూజలు చేయించారు. అనంతరం మంత్రి పట్టు వస్త్రాలు అందజేశారు. హోంశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత అమ్మవారి ఘటాలను తలపై పెట్టుకుని ఆలయానికి చేరుకున్నారు. అనంతరం ప్రసాదాల నిర్వహణ, ఏర్పాట్లు తదితర అంశాలపై మంత్రులు కలెక్టర్ రామసుందర్‌రెడ్డితో చర్చించారు. ఉత్సవాల నిర్వహణ పట్ల దేవదాయశాఖ మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.
రూ.1.8 కోట్లతో ఆలయం అభివృద్ధి
దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
విజయనగరం రూరల్/కల్చరల్, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): పైడిమాంబ ఆలయ అభివృద్ధి పనులను పండుగ ముగిసిన వెంటనే ప్రారంభించనున్నామని దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం ఆయన మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. రూ.కోటి 80 లక్షలతో అభివృద్ధి పనులు జరుగుతాయన్నారు. ఈనిధుల్లో కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్)కింద రూ.కోటి 44 లక్షలు, మిగతా నిధులను ప్రభుత్వం విడుదల చేయనుందన్నారు. ఈ నిధులతో పైడిమాంబ ఆలయం పునః నిర్మాణంతో పాటు అంతరాలయం, ప్రాకార మండపం, అనివెట్టి మండపం పునఃనిర్మాణ పనులు చేపడ్తామని, వాటికి మాన్సాస్ చైర్మన్, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ఈనెల 9న శంకుస్థాపన చేస్తారన్నారు. వచ్చే పండుగ లోపు ఈ పనులన్నీ పూర్తి చేసి, భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు చెప్పారు. అభివృద్ధి పనులకు సంబంధించి ఇప్పటికే నిధులు కేటాయించడం, టెండర్లు పిలవడం, డీపీఆర్ రూపొందించడం వంటి కార్యక్రమా లు పూర్తయ్యాయన్నారు. ఇంకా అవసరమైతే చుట్టుపక్కల వున్న స్థలాలను కూడా గుర్తించాలని, ఇందుకు అవసరమైన ప్రణాళికతో ముందుకు సాగాలని ఆలయ ఈవో శీరిషాను ఆదేశించారు. ఆయన వెంట ఇతర మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనా యుడు, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు.
కుంగిన బొత్స వేదిక
విజయనగరం, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): పైడిమాంబ సిరిమానోత్సవాన్ని వీక్షించేందుకు పాత కో-ఆపరేటివ్ బ్యాంకు ఆవరణలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యులు, వైసీపీ నాయకులు కూర్చున్న వేదిక కుంగిపోయింది. దీంతో కూర్చున్నవారంతా కిందకు జారిపోయారు. వేదిక మీద నిర్దేశించిన జనం కంటే ఎక్కువ మంది ఉండడం.. ఇదే సమయంలో వర్షం పడడంతో బల్లలు కిందకు కుంగిపోయి కూర్చున్నవారంతా కిందకు జారినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు, బొత్స అనుచరులు వెంటనే అప్రమత్తమై సహకరించారు. ఎవరికీ ఎటువంటి అపాయం కలగలేదు. ఈ ఘటన జరిగిన చోట విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐ అశోక్‌తో పాటు మరో చిన్నారి స్వల్పంగా గాయపడ్డారు.
ఏటా బొత్స కుటుంబ సభ్యులతో పాటు అనుచరులు, వైసీపీ నాయకులు డీసీసీబీ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చసిన వేదికపై ఆశీనులయ్యేవారు. ఈ ఏడాది డీసీసీబీ చైర్మన్ అందుకు అనుమతించలేదు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద రాజకీయ నాయకుల పర్యటనలొద్దని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు, వైసీపీ నాయకుల కోసం పాత అర్చన్ బ్యాంకు ఆవరణలో ప్రత్యేకంగా జిల్లా అధికార యంత్రాంగం వేదికను ఏర్పాటు చేసింది. వేదిక ఆవరణం వర్షానికి నానిపోవడం, మెత్తటి నేల కావడం, పరిమితికి మించి సభ్యులు వేదిక మీదకు రావడంతో ఒక్కసారిగా వేదిక కుంగింది.
సిరిమానోత్సవంలో స్వల్ప తొక్కిసలాట
విజయనగరం, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): సిరిమానోత్సవంలో స్వల్ప తొక్కిసలాట చోటుచేసుకుంది. ఆర్డీవో దాట్ల కీర్తి కారు అకస్మాత్తుగా రోడ్డుపైకి రావడంతో బారికేడ్లు దగ్గరగా ఉన్న భక్తులు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. అక్కడ ఎక్కువ సంఖ్యలో భక్తులు ఉండటంతో కంగారు పడి పరుగులు తీశారు. అక్కడే ఉన్న ఓ మహిళ కిందపడి గాయపడింది. భక్తులు ఆమెను చికిత్సకోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు కారణమైన ఆర్డీవో కీర్తిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఆమె వద్ద ప్రస్తావించగా సిరిమాను ఊరేగింపు పూర్తయ్యాక కోటలో ఉన్న కలెక్టర్, జేసీ కార్లు బయటకు తీసుకురావటానికి వీలుపడలేదని, దీంతో వారిని ఇళ్ల వద్ద దించడానికి బయటున్న తన కారులో వారిని ఎక్కించుకుని బయలుదేరామని, అప్పటికే అక్కడ అధిక సంఖ్యలో భక్తులు ఉన్నప్పటికీ తన కారు వల్ల ఎటువంటి తొక్కిసలాట జరగలేదని ఆమె వివరించారు.
పోలీసుల ఫెయిల్యూర్
విజయనగరం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): సిరిమానోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రానికి సుమారు 2600 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు కానీ భక్తులను ఎక్కడికక్కడే నిలిపివేశారు. సోమవారమే కోటవద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి చిన్నదారి మాత్రమే విడిచిపెట్టారు. దీంతో ఘటాలు సమర్పించేవారు, మహిళా భక్తులు, చిన్నారులు, వృద్ధులు ఇబ్బంది పడ్డారు. మంగళవారం నాటి పరిస్థితి మరీ దారుణంగా మారింది. అన్నిచోట్ల దిగ్బంధం చెయ్యడంతో వేలాదిమంది భక్తులు సిరిమానును ప్రత్యక్షంగా చూడలేక వెనుతిరిగారు. సిరిమాను తిరిగే రోడ్డుకు దూరంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీస్ అధికారులు, సిబ్బంది బంధువులను మాత్రం రాజమార్గంలో విడిచి పెట్టారనే విమర్శలు వినిపించాయి.
----------------------