Share News

కొండను కొల్లగొట్టి.. ప్రజారోగ్యాన్ని గుల్లచేసి!

ABN , Publish Date - Sep 05 , 2025 | 11:15 PM

పార్వతీపురం మండలం బడిదేవరకొండ రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతం వద్ద గ్రానైట్‌ తవ్వకాలు ఆగడం లేదు.

 కొండను కొల్లగొట్టి.. ప్రజారోగ్యాన్ని గుల్లచేసి!
గ్రానైట్‌ తవ్వకాలు జరిగిన ప్రాంతంలో చెరువుల పరిస్థితి ఇది.

బడిదేవరకొండపై ఆగని తవ్వకాలు

చెరువులు, పంటపొలాల్లోకి గ్రానైట్‌ పొడి

గిరిజనుల ఆరోగ్యంపై ప్రభావం

ఇటీవల వెలగవలస చెరువులో జారి పడి ఒకరి మృతి

ఆ ప్రాంతం రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ఉన్నా.. స్పందించని అటవీశాఖ

పార్వతీపురం, సెప్టెంబరు5(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మండలం బడిదేవరకొండ రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతం వద్ద గ్రానైట్‌ తవ్వకాలు ఆగడం లేదు. కొండను పిండి చేస్తూ.. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. మరోవైపు కోట్లాది రూపాయల గ్రానైట్‌ను యథేచ్చగా తరలిస్తున్నా.. అటవీశాఖాధికారులు స్పందించడం లేదు. ఇప్పటికీ వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు ఏడు నెలలు గడుస్తున్నా కోర్టులో రిట్‌ పిటీషన్‌ దాఖలు చేయకపోవడంపై ఆ ప్రాంతవాసులు మండిపడుతున్నారు. కాగా గ్రానైట్‌ తవ్వకాల వెనుక ఇతర జిల్లాలకు చెందిన కొంతమంది ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇదీ పరిస్థితి..

వాస్తవంగా గత టీడీపీ ప్రభుత్వ కాలంలో బడిదేవరకొండ రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది రెవెన్యూ ప్రాంతంగా మారింది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత కూడా నాటి కోర్టు ఆదేశాలు చూపుతూ బడిదేవరకొండ వద్ద గ్రానైట్‌ తవ్వకాలు చేపడు తున్నారు. కొండపై తవ్వకాలతో తెల్లని పొడి సమీప చెరువులు, పంట పొలాల్లోకి చేరుతుంది. దీంతో గాలి, నీరు కలుషితమవుతుండగా... తరచూ ఈ ప్రాంతవాసులు రోగాల బారిన పడుతున్నారు. వెలగవలస వద్ద ఉన్న చెరువు గ్రానైట్‌ బూడిదతో నిండిపోవడంతో ఇటీవల చేపల వేటకు వెళ్లిన బంగారి దొర అనే గిరిజనుడు అందులో జారిపడి మృతి చెందాడు. దీంతో ఆయన కుటుంబం రోడ్డున పడింది.

సుమారు 40 గ్రామాల ప్రజలు ఆరాధ్య దైవంగా పూజించే బడిదేవరమ్మ కొలువైన కొండపై తవ్వకాలు ఆపాలని ఆ ప్రాంతవాసులు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవల వారికి పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కూడా మద్దతు తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిన తర్వాతే తవ్వకాలు చేపట్టాలన్నారు. మరోవైపు స్థానిక గిరిజనులు, కూటమి నాయకులు, వామపక్షాలు, ఇతర గిరిజన, ప్రజా సంఘాలు దీనిపై నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా.. పరిస్థితిలో మార్పు రావడం లేదు. బడిదేవర కొండపై యథేచ్ఛగా తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత గిరిజనులు కోరుతున్నారు. దీనిపై పార్వతీపురం ఫారెస్ట్‌ రేంజర్‌ రామ్‌ నరేష్‌ను వివరణ కోరగా.. ‘న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు ఇక్కడి నుంచి పత్రాలు పంపించాం. ప్రభుత్వ న్యాయవాది వద్ద అవి ఉన్నాయి.’ అని తెలిపారు.

Updated Date - Sep 05 , 2025 | 11:15 PM