Economic Growth పశుపోషణతో ఆర్థికాభివృద్ధి
ABN , Publish Date - Dec 27 , 2025 | 12:18 AM
Livestock Rearing: A Path to Economic Growth పశుపోషణ పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఎంఆర్ నగరంలో ‘మన్యం గోబాల సంబరం’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
పార్వతీపురం, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): పశుపోషణ పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఎంఆర్ నగరంలో ‘మన్యం గోబాల సంబరం’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ‘జిల్లాలో పశుసంవర్థక రంగాన్ని బలోపేతం చేసి రైతులకు అదనపు ఆదాయం చేకూర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. పాలు, మాంసం, గుడ్లు ఉత్పత్తిలో మన్యాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపేందుకు కృషి చేస్తున్నాం. పశుసంవర్థక రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది.’ అని తెలిపారు. ఆ తర్వాత గొర్రెల పెంపకందారుల సమస్యను కలెక్టర్ అడిగి తెలుకున్నారు. వారు తయారుచేసిన గొడుగుపై ఆరా తీశారు. అంతకుముందు పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. మొత్తంగా 126 పశువులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. 652 గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు ఇచ్చారు ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఈ సంబరంలో 162 ఉత్తమ జాతి లేగ దూడలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం శాస్ర్తీయ పశుపోషణపై రైతులకు అవగాహన కల్పించారు. హైస్కూల్ విద్యార్థినులకు ఆవుదూడలతో పరుగు పందెం పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి మన్మఽథరావు, పశువైద్యాధికారులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా బోధించాలి
రోజూ నవ్వుతూ.. ఉత్సాహంగా బోధించాలని గురువులకు కలెక్టర్ సూచించారు. విద్యార్థులను ఉత్తీర్ణులుగా చేయడం మాత్రమే కాకుండా.. వారిని సమాజానికి పనికొచ్చే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యాధికారులతో ఆయన సమీక్షించారు. పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సాహం అందించాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి గంటకొకసారి పిల్లలతో పది సెకన్ల పాటు డ్యాన్స్ చేయించాలన్నారు.