Lives Are Being Lost! ప్రాణాలు పోతున్నాయ్!
ABN , Publish Date - Oct 02 , 2025 | 12:05 AM
Lives Are Being Lost! కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో పదుల సంఖ్యలో విద్యార్థినులు పచ్చకామెర్లతో బాధపడుతుం డడం కలకలం రేపుతోంది. వారం వ్యవధిలో ఈ పాఠశాలకు చెందిన ఇద్దరు బాలికలు జాండీస్ లక్షణాలతో మృతి చెందడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
వారం వ్యవధిలో ఇద్దరు విద్యార్థినుల మృతి
ఆ లక్షణాలతో పలు ఆసుపత్రుల్లో మరికొందరికి చికిత్స
ఆందోళనలో తల్లిదండ్రులు
పార్వతీపురం/కురుపాం, అక్టోబరు1(ఆంధ్రజ్యోతి): కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో పదుల సంఖ్యలో విద్యార్థినులు పచ్చకామెర్లతో బాధపడుతుం డడం కలకలం రేపుతోంది. వారం వ్యవధిలో ఈ పాఠశాలకు చెందిన ఇద్దరు బాలికలు జాండీస్ లక్షణాలతో మృతి చెందడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే..
దసరా సెలవులు ఇచ్చిన తర్వాత ఈ పాఠశాల విద్యార్థినులు స్వగ్రామాలకు వెళ్లారు. అయితే అలా వెళ్లిన వారిలో గుమ్మలక్ష్మీపురం మండలం కంబగూడ గ్రామానికి చెందిన పువ్వల అంజలి జాండీస్ లక్షణాలతో గతనెల 26న మృతి చెందింది. తాజాగా బుధవారం కురుపాం మండలం దండుసూర గ్రామానికి చెందిన తోయక కల్పన విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరణించింది. మరోవైపు ఈ పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థినులు పచ్చ కామెర్ల లక్షణాలతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సీమల నీరజ అనే విద్యార్థిని విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతుండగా, పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో ఏడుగురు, కురుపాంలో సీహెచ్‌సీలో ఐదుగురు, మరికొందరు గుమ్మలక్షీపురం, చినమేరంగి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. కాగా ఈ విషయం తెలుసుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. పాఠశాల విద్యార్థినుల వివరాలు సేకరించి.. క్షేత్ర స్థాయి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్‌ఎంఎం, ఆశావర్కర్లు ఆయా విద్యార్థినుల ఇంటికి వెళ్లి ఆరోగ్యంపై ఆరా తీశారు. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థినులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. అయితే వారంతా జాండీస్ లక్షణాలతో బాధపడుతున్నట్లుగా వైద్య సిబ్బంది గుర్తించినట్లు తెలిసింది. దీనిపై ప్రిన్సిపాల్ అనూరాధను వివరణ కోరగా..‘ కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో 611 మంది చదువుతున్నరు. దసరా సెలవుల కోసం ఇళ్లకు వెళ్లే సమయంలో విద్యార్థినులంతా ఆరోగ్యంగా ఉన్నారు. అయితే వారిలో పువ్వల అంజలికి గతనెల 19 న జ్వరం వచ్చింది. వెంటనే సమీప ఆసుపత్రికి తీసుకెళ్లాం. 20న జ్వరం తగ్గగా వారి తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్లింది.’ అని తెలిపారు.
విద్యార్థినులను పరామర్శించిన ప్రభుత్వ విప్
కురుపాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన సంక్షేమ గురుకుల బాలికల రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థినులను ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి బుధవారం రాత్రి పరామర్శించారు. డ్యూటీ డాక్టర్‌తో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలిని కోరారు. మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి కూడా విద్యార్థినులను పమర్శించి.. పాఠశాలను పరిశీలించారు.
పాఠశాలను పరిశీలించిన డీఎంహెచ్‌వో
కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను బుధవారం సాయంత్రం డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు సందర్శించారు. డైనింగ్ రూమ్, ఆర్‌వో ప్లాంట్ పరిశీలించారు. ఆర్‌వో ప్లాంట్ రెండు నెలలుగా పనిచేయడం లేదని , పిల్లలకు వేడి నీరు పిల్లలకు అందిస్తున్నామని ప్రిన్సిపాల్ పి.అనూరాధ తెలిపారు. కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ మండలాల్లో ఉన్న ఈ పాఠశాల విద్యార్థినుల ఇళ్లకు ఏఎన్‌ఎం, ఆశావర్కర్లను పంపించి వారి ఆరోగ్య పరిస్థితులు సేకరించామని డీఎంహెచ్‌వో తెలిపారు. అనారోగ్యంతో బాఽధపడుతున్న వారిని కురుపాం, భద్రగిరి, చిన మేరింగి ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. కొందరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఈ పరిస్థితికి గల కారణాలు తెలుసుకోవడానికి క్లూస్ టీమ్ పంపిస్తామన్నారు.