Share News

Liquor సారా హోరు.. బెల్టు జోరు!

ABN , Publish Date - Jul 25 , 2025 | 11:32 PM

Liquor Craze... Belt Shops Blaze సీతంపేట మన్యంలో ఎక్కడికక్కడే బెల్ట్‌ షాపులు వెలుస్తున్నాయి. నాటుసారా విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయి. మూడు పూలు.. ఆరు కాయలు అన్న చందంగా వాటి వ్యాపారాలు సాగుతున్నాయి.

Liquor   సారా హోరు..  బెల్టు జోరు!
బెల్ట్‌షాప్‌లకు ఆటోలో మద్యం బాటిళ్లను తరలిస్తున్న దృశ్యం (ఫైల్‌)

  • పుట్టగొడుగుల్లా వెలుస్తున్న వైనం

  • గిరిజన గ్రామాల్లో యథేచ్ఛగా విక్రయాలు

  • ఒక్కో బాటిల్‌పై రూ.50 వరకు అదనంగా వసూలు

  • పట్టించుకోని ఎక్సైజ్‌శాఖ

సీతంపేట రూరల్‌, జూలై25(ఆంధ్రజ్యోతి): సీతంపేట మన్యంలో ఎక్కడికక్కడే బెల్ట్‌ షాపులు వెలుస్తున్నాయి. నాటుసారా విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయి. మూడు పూలు.. ఆరు కాయలు అన్న చందంగా వాటి వ్యాపారాలు సాగుతున్నాయి. గిరిజన గ్రామాల్లో బహిరంగంగానే మద్యం, నాటుసారా విక్రయాలు జరుగుతున్నా.. ఎక్సైజ్‌ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరి స్తున్నారు. దీంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అధిక ధరలకు అమ్మకాలు చేపట్టి లాభాలు ఆర్జిస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

సీతంపేట మండలంలో 25 వరకు బెల్ట్‌ షాపులు నడుస్తున్నాయి. ప్రధానంగా మానాపురం, కొత్తకోట, పొల్ల, దోనుబాయి, గాడిదపాయి, కిల్లాడ, పూతికవలస, చినబగ్గ, మర్రిపాడు, జామితోట, గొయిది, కుసిమి, కోడిశ, కిండంగి, కుడ్డపల్లి, జగ్గడుగూడ సెంటర్‌తో పాటు మరికొన్ని చోట్ల బెల్ట్‌ దుకాణాలు ఉన్నాయి. రాత్రి వేళల్లో గుట్టు చప్పుడు కాకుండా సీతంపేటలోని మద్యం దుకాణాల నుంచే నేరుగా ఆయా షాపులకు ఆటోల్లో మద్యం బాటిళ్లను సరఫరా చేస్తున్నారు. దీంతో బెల్టు నిర్వాహకులు గ్రామాల్లో యథేచ్ఛగా విక్రయాలు జరుపుతున్నారు.

జోరుగా అమ్మకాలు

ఒక్క సీతంపేటలోనే ఏడు వరకు బెల్టు షాపులున్నాయి. ఫాస్ట్‌ఫుడ్‌, కిరాణా, టిఫిన్‌ సెంటర్లలో యథేచ్ఛగా మద్యం విక్రయిస్తున్నారు. ఒక్కో మద్యం బాటిల్‌పై రూ.30 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. తెల్లవారు జాము నుంచి అర్ధరాత్రి 12గంటల వరకు బెల్టు దుకాణాల్లో అమ్మకాలు జరుగుతున్నాయి. ఇకపోతే గొలుసు దుకాణాలకు పోటీగా నాటుసారా అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. కొంతమంది వ్యాపారులు సీతంపేటతో పాటు చుట్టు పక్కల గిరిజన గ్రామాల్లో నాటుసారా తయారీ, విక్రయాలు, రవాణా వంటివి చేపడుతున్నారు. సారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం ఇతరాత్ర సరుకులను కొందరు బహిరంగంగానే విక్రయిస్తున్నారు. ఏదేమైనా ఏజెన్సీలో ఒక పక్క నాటుసారా.. మరోపక్క బెల్టు షాపులు పుట్ట గొడుగుల్లా వెలుస్తున్నా.. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రూ.లక్ష క‌డితే చాలా?

సీతంపేట మన్యంలో గొలుసు దుకాణాలకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. ఒక్కో మద్యం బాటిల్‌పై వచ్చే ఆదాయం ఎక్కువగా ఉండడంతో బెల్ట్‌షాప్‌ల నిర్వహణకు వ్యాపారులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఏజెన్సీలో ఏ గ్రామంలోనైనా బెల్ట్‌ దుకాణం పెట్టాలనుకునే వారు ముందుగా మద్యం దుకాణం నడుపుతున్న సిండికేట్‌ వ్యాపారులను కలవాల్సి ఉంటుంది. వారి అనుమతితో రూ.1లక్ష అడ్వాన్స్‌గా చెల్లించాల్సి ఉంటుంది. ఇదే కాకుండా గొలుసు దుకాణంలో స్టాక్‌ పెట్టుకోవడానికి మరో లక్ష కట్టాలి. అప్పుడే సంబంధిత మద్యం దుకాణం నుంచి బాటిళ్లను సరఫరా చేస్తారు. ఇలా ఏజెన్సీలో చాపకింద నీరులా ఈ దందా సాగుతోంది. ఈ ఏడాది జనవరిలో పండగ సీజన్‌ సందర్భంగా దోనుబాయిలో బెల్ట్‌ దుకాణాలకు మద్యం తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు సీజ్‌ చేశారు. బాధ్యులపై కేసులు నమోదు చేశారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మారడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఏజెన్సీ వాసులు కోరుతున్నారు.

ఎక్సైజ్‌ ఏఈఎస్‌ ఏమన్నారంటే...

‘బెల్ట్‌షాప్‌ల నిర్వహణ చట్టపరంగా నేరం. అటువంటి దుకాణాలపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తాం. వాటి నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్‌ చేపడతాం. నాటుసారా నిర్మూలనే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపడతాం.’ అని జిల్లా అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనాఽఽథుడు తెలిపారు.

Updated Date - Jul 25 , 2025 | 11:32 PM