రూ.850 కోట్ల లింకేజీ రుణాల లక్ష్యం
ABN , Publish Date - Oct 19 , 2025 | 12:07 AM
జిల్లాలోని 14,082 స్వయం సహాయక సంఘాల్లోని 80,135 మంది సభ్యులకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.850 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను అందించాలన్నదే తమ లక్ష్యమని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసపాణి తెలిపారు.
డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసపాణి
బొబ్బిలి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 14,082 స్వయం సహాయక సంఘాల్లోని 80,135 మంది సభ్యులకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.850 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను అందించాలన్నదే తమ లక్ష్యమని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసపాణి తెలిపారు. బొబ్బిలిలో లింకేజీ రుణాలపై బ్యాంకు అధికారులతో ఆయన శనివారం చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది నుంచి డిజిటల్ మైక్రో క్రెడిట్ ప్లాన్ (డీఎంసీపీ) ద్వారా రుణాలను అత్యంత పారదర్శకంగా అందజేస్తున్నట్లు తెలిపారు. బహుళ సంఘాల్లో సభ్యత్వాలను నివారించడం, రుణవితరణలో అక్రమాలు, లోపాలు లేకుండా ఉండేందుకు ఈ నూతన పద్ధతి దోహదపడుతుందని అన్నారు. గత నెలాఖరు వరకూ 4,173 గ్రూపులకు చెందిన 52,162 మంది సభ్యులకు రూ.426 కోట్లు లింకేజీ రుణాలను అందజేసినట్లు చెప్పారు. మిగిలిన రుణ లక్ష్యాలను నిర్ణీత గడువులోగా సాధిస్తామన్నారు. బ్యాంకు అధికారులు చాలా బాగా స్పందిస్తున్నారని తెలిపారు. మన్యం జిల్లాలో టూరిజం ప్రాంతాల అభివృద్ధి పనులను స్వయంసహాయక సంఘాలకు అప్పగిస్తున్నారని, విజయనగరం జిల్లాలో అలాంటి ప్రతిపాదన ఏమైనా ఉందా? అని ప్రశ్నించగా.. అలాంటిదేమీ ఇంతవరకు లేదని ఆయన బదులిచ్చారు. జిల్లాలో పెద్దసంఖ్యలో కొత్త పెన్షన్ల మంజూరు కోసం వితంతువులు, వృద్ధులు ఎదురుచూస్తున్నారని ఆయన దృష్టికి తేగా, రేషన్ కార్డుల నిబంధనలు సడలించుకున్న వారికి పెన్షన్లు మంజూరు చేయడం సాధ్యపడుతుందని అన్నారు.