'Link' Extortion ‘లింక్’ దోపిడీ
ABN , Publish Date - Dec 31 , 2025 | 11:46 PM
'Link' Extortion రబీ సీజన్‌లో మొక్కజొన్న, పత్తి, వరి సాగుచేస్తున్న రైతులకు ఎరువుల వ్యాపారులు షాక్ ఇస్తున్నారు. యూరియా, పాస్పేట్ ఎరువుల కోసం వెళితే లింక్ ఎరువులు కొనాలంటున్నారు. అవసరమున్నా లేకున్నా లిక్విడ్ ఎరువులైన నానో యూరియా, పాస్పేట్ ఇస్తామని తెగేసి చెబుతున్నారు. రబీ సీజన్లో ఎరువుల విషయంలో నడుస్తున్న మార్కెట్ మాయాజాలం రైతులకు గుదిబండగా మారింది. అధికారులు కిమ్మనకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
‘లింక్’ దోపిడీ
ఎరువుల కంపెనీలు, డీలర్ల మాయాజాలం
రబీ సీజన్‌లో రైతుల అవసరంతో చెలగాటం
యూరియా, పాస్పేట్ కావాలంటే లింక్ ఎరువులూ కొనాల్సిందేనట
బలవంతంగా అంటగడుతున్న వైనం
వద్దన్న వారికి ఎరువులు నో అంటూ బెదిరింపులు
రబీ సీజన్‌లో మొక్కజొన్న, పత్తి, వరి సాగుచేస్తున్న రైతులకు ఎరువుల వ్యాపారులు షాక్ ఇస్తున్నారు. యూరియా, పాస్పేట్ ఎరువుల కోసం వెళితే లింక్ ఎరువులు కొనాలంటున్నారు. అవసరమున్నా లేకున్నా లిక్విడ్ ఎరువులైన నానో యూరియా, పాస్పేట్ ఇస్తామని తెగేసి చెబుతున్నారు. రబీ సీజన్లో ఎరువుల విషయంలో నడుస్తున్న మార్కెట్ మాయాజాలం రైతులకు గుదిబండగా మారింది. అధికారులు కిమ్మనకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మెంటాడ, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో రబీలో మొక్కజొన్నను విస్తారంగా సాగుచేస్తుండగా తర్వాత స్థానంలో పత్తి, వరి ఉన్నాయి. వీటి సాగులో యూరియా, పాస్పేట్ ఎరువు వినియోగించడం రైతులకు అలవాటు. ఇందుకోసం ఫెర్టిలైజర్ షాపులకు వెళ్తే లింకు ఎరువులతో వీటిని ముడిపెడుతున్నారు. దీంతో ఏంచేయాలో పాలుపోని స్థితిలో రైతులు డీలర్లకు బతిమాలితే యూరియా, పాస్పేట్ ఎమ్మార్పీ ధరపై అదనంగా వంద రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారు. అవసరం లేని లింకు ఎరువుల కోసం నాలుగైదు వందల రూపాయలు వృథా ఖర్చు చేసేకన్నా, బస్తాపై అదనంగా వందో యాభయ్యో ఇచ్చి కావలసిన యూరియా, పాస్పేట్ తీసుకువెళ్తున్నారు. కొందరు డీలర్లు లింకులు కొనకపోతే యూరియా, పాస్పేట్ ఇచ్చేదిలేదని భీష్మించడంతో లింకు ఎరువులు అవసరం లేకపోయినా చేసేదిలేక రైతులు వాటిని కూడా కొనుగోలు చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఈ లింకు దోపిడీ విచ్చలవిడిగా సాగుతోంది. దీంతో రైతులకు ఆదనపు భారం తప్పడం లేదు. అయితే మా కష్టాలు మాకున్నాయని ఎరువుల డీలర్లు వాపోతున్నారు. లింకులు తీసుకోకుంటే కంపెనీలు ఎరువులు కేటాయించేందుకు ముప్పుతిప్పలు పెడుతున్నాయని చెబుతున్నారు. సీజనంతా ఒక్కలోడు కూడా ఇవ్వడం లేదని, లింకులకు ఒప్పుకుంటేనే అడిగినన్ని ఎరువులు ఇస్తున్నారని చెప్పుకొస్తున్నారు. తప్పనిసరి పరిస్థితిల్లో లింకు ఎరువులకు ముడిపెట్టక తప్పడంలేదని అంటున్నారు. లేకపోతే అవి ఉండిపోయి లక్షల్లో నష్టపోతామని చెబుతున్నారు.
ఫ లింకులపై గట్టిగా మాట్లాడే డీలర్లపై ఎరువుల కంపెనీలతోపాటు, వాటితో అవగాహన పెట్టుకునే ఉన్నతాధికారులు కూడా కన్నెర్ర చేస్తుంటారని కొందరు డీలర్లు అంటున్నారు. లైసన్సులు రద్దుచేసిన సందర్భాలు కూడా ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. ఎరువుల పరిశ్రమల మధ్య అవగాహన, డీలర్ల వాదన ఎలా ఉన్నా మధ్యలో రైతులు బలవుతున్నారన్నది కాదనలేని సత్యం. దీనిపై యంత్రాంగం తగిన రీతిలో చర్యలు చేపట్టి లింకు దోపిడీకి తెరదించాలని అన్నదాతలు కోరుతున్నారు.
--------------------