Share News

Limited to Proposals Only ప్రతిపాదనలకే పరిమితం

ABN , Publish Date - Jun 30 , 2025 | 11:39 PM

Limited to Proposals Only జంఝావతి ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా అన్నది ప్రతిపాదనలకే పరిమితమవుతుంది. దీనిపై సంబంధిత అధికారులు దృష్టి సారించడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Limited to Proposals Only  ప్రతిపాదనలకే పరిమితం
సీతారాంపురం వద్ద పిచ్చి మొక్కలతో నిండిన జంఝావతి కాలువ

  • దృష్టి సారించని అధికారులు

  • ఆందోళనలో ఖరీఫ్‌ రైతులు

గరుగుబిల్లి, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): జంఝావతి ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా అన్నది ప్రతిపాదనలకే పరిమితమవుతుంది. దీనిపై సంబంధిత అధికారులు దృష్టి సారించడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైన ఏపథ్యంలో ముమ్మరంగా వరి నారుమళ్లు సిద్ధం చేసుకున్నారు. అయితే ఏటాలానే ఈ సారి కూడా సాగునీటి ఇక్కట్లు తప్పేలా లేవని వారు మథనపడుతున్నారు.

ఇదీ పరిస్థితి..

జంఝావతి నుంచి గరుగుబిల్లి, పార్వతీపురం, సీతానగరం, మక్కువ, కొమరాడ మండలాల పరిధిలోని 75 గ్రామాలకు సుమారు 26,640 ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంది. మక్కువ మండలం మినహాయించి మిగిలిన నాలుగు మండలాల్లో ప్రస్తుతం 9 వేల ఎకరాలకే ప్రాజెక్టు నుంచి సాగునీరు అందుతుంది. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పెండింగ్‌ పనులేవీ పూర్తికాలేదు. మరోవైపు ఒడిశాతో సమస్య కూడా పరిష్కారం కాలేదు. నిధుల సమస్య కారణంగా గత కొన్నాళ్లుగా కాలువల పనులేవీ చేపట్టలేదు. వాటి నిర్వహణను గత ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రస్తుతం కాలువలు గుర్రపుడెక్క, పిచ్చిమొక్కలతో నిండాయి. ప్రధాన కాలువలు కూడా అధ్వానంగా మారాయి. వాటి ద్వారా సాగునీరందకపోవడంతో పంట పొలాలు బీడుగా దర్శనమిస్తున్నాయి. కొన్నాళ్లుగా గరుగుబిల్లి, సీతానగరం, పార్వతీపురం మండలాల రైతులు సాగునీటికి పడరాని పాట్లు పడుతున్నారు. ఖరీఫ్‌కు ముందు కాలువలను పూర్తిస్థాయిలో శుభ్రపరిస్తే కొంతమేర సాగునీరు సక్రమంగా సరఫరా అయ్యే అవకాశం ఉంది. అయితే ఆ దిశగా సంబంధిత అధికారులు పనులు చేపట్టలేదు. దీంతో ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందడం ప్రశ్నార్థకంగా మారింది. వ్యవసాయ పనులకు సిద్ధమైన రైతులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రధాన కాలువలను బాగుచేసి శివారు ప్రాంత భూములకు సక్రమంగా సాగునీరు సరఫరా అయ్యేలా చూడాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేస్తే..

గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర పరిధిలో తోటపల్లి కుడి ప్రధాన కాలువ ప్రాంతంలో ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేస్తే సుమారు 5 వేల ఎకరాలకు పైబడి సాగునీరందే అవకాశం ఉంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయితే ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో ఎత్తిపోతల పథకానికి గ్రహణం పట్టింది. ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి ఈ సమస్యను కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. త్వరలోనే ఈ పనులు ప్రారంభించాలని ఆయా ప్రాంత వాసులు కోరుతున్నారు.

మొదటి వారంలో సాగునీరు విడుదల

జంఝావతి ప్రాజెక్టు నుంచి జూలై మొదటి వారంలో సాగునీరు విడుదల చేయనున్నాం. ఉపాధి హామీ పథకంలో భాగంగా కొన్ని మండలాల్లో కొంతమేర కాలువలను బాగు చేశాం. పూడికలు, పిచ్చిమొక్కలు తొలగించాం. నిధులు, అంతర్రాష్ట్ర సమస్యల కారణంగా పనుల నిర్వహణకు ఆటంకం నెలకొంది.

- పి.శ్రావణి, జేఈ, జంఝావతి ప్రాజెక్టు

Updated Date - Jun 30 , 2025 | 11:39 PM