Light Rain All Day రోజంతా చినుకులు
ABN , Publish Date - Dec 01 , 2025 | 11:33 PM
Light Rain All Day దిత్వా తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా చిరుజల్లులు కురిశాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి అక్కడక్కడా ఓ మోస్తరు వర్షం కురవగా.. సోమవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చేతికందొచ్చిన పంటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
పంటలను కాపాడుకునేందుకు రైతుల అవస్థలు
పార్వతీపురం/పాలకొండ/మక్కువ రూరల్/సీతంపేట రూరల్/భామిని/, డిసెంబరు1 (ఆంధ్రజ్యోతి): దిత్వా తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా చిరుజల్లులు కురిశాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి అక్కడక్కడా ఓ మోస్తరు వర్షం కురవగా.. సోమవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చేతికందొచ్చిన పంటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 60 శాతానికి పైగా వరి కోతలు పూర్తయ్యాయి. 30 నుంచి 40 శాతం వరకు వరి పంట కల్లాలకు చేరింది. మిగిలిన పంట వరి పనాల రూపంలో పొలాల్లో ఉంది. ప్రస్తుతం కురుస్తున్న చిరుజల్లులకు కోత కోసి ఉన్న పంట తడిసి ముద్దవుతోంది. మంగళవారం కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేయడంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. పంట పొలాల్లో నీరు చేరితే కోత కోసిన వరి పంట మొలకెత్తే ప్రమాదం ఉందని వాపోతున్నారు.
ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో చిరుజల్లులకు తోడు చలి తీవ్రత పెరిగింది. అయితే గాలుల తీవ్రత అంతగా లేకపోయినా.. మైదాన, ఏజెన్సీ ప్రాంతాల్లో రైతులు వరికోతలను వాయిదా వేసుకున్నారు. అక్కడక్కడా కోతలు జరిగిన ప్రాంతాల్లో వరి పనులను కుప్పలుగా వేసి టార్పాలిన్లు కప్పారు. మరికొందరు ధాన్యం నిల్వలను బస్తాలకు ఎత్తి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మక్కువ మండలంలోని పలుగ్రామాల్లో వరిచేను కోతలు , నూర్పులు సాగుతుండగా.. ప్రస్తుత వాతావరణ పరిస్థితి రైతులను కలవరపెడుతోంది. దీంతో చాలామంది తమ ధాన్యాన్ని మిల్లులకు తరలించే పనుల్లో నిమగ్నమయ్యారు. కాగా సోమవారం సాయంత్రం వరకూ వర్షం కురవడంతో వారు తీవ్ర ఆందోళన చెందారు.
పాలకొండ నియోజకవర్గంలో భామిని, సీతంపేట, పాలకొండ వీరఘట్టం మండలాల్లో 40 శాతం మాత్రమే వరి కోతలు పూర్తయ్యాయి. అయితే చిరుజల్లులకు ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భామిని మండలంలో కొంతమంది రైతులు వరిపైరును కోసి పొలాల్లోనే విడిచిపెట్టారు. వర్షానికి వరి కంకులు తడుస్తుండడంతో రంగుమారిపోతుందనే భయం వారిని వెంటాడుతుంది. మరికొందరు ఆదరాబాదరాగా పత్తిని ఏరుతున్నారు. మొత్తంగా వరి పంట కోతలు చేపట్టిన రైతులు, కోతలు పూర్తయిన వారు తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వానకు టెన్షన్ పడుతున్నారు. చిరు జల్లులైనప్పటికీ విరామం లేకుండా కురుస్తుండడంతో పంట సంరక్షణ చేయలేకపోతున్నారు. ఏటా వరి కోతల సమయంలో ఈ పరిస్థితి తప్పడం లేదని ఆవేదన చెందుతున్నారు. గత నెలలో మొంథా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు పడినా ఈదురుగాలులు లేవు. ఆపై పంట పక్వానికి వచ్చే సమయం కావడంతో పెద్దగా ఇబ్బందులు లేవు. ఇప్పుడు సరిగ్గా వరి కోతలు, నూర్పుల సమయం. చిరుజల్లులే అయినా నష్టం తెచ్చేలా ఉన్నాయని రైతులు భయపడుతున్నారు.
వాయిదా వేసుకుంటే మంచిది
‘పాలకొండ నియోజకవర్గంలో సీతంపేట, భామిని తదితర మండలాల్లో వరి కోతలు పూర్తి కాలేదు. సుమారు 40 శాతం మాత్రమే కోతలు పూర్తయ్యాయి. దిత్వా తుపాను ప్రభావం జిల్లాలో పెద్దగా లేదు. అయినప్పటికీ తాజా వాతావారణ పరిస్థితుల దృష్ట్యా రైతులు వరి కోతలు వాయిదా వేసుకోవడం మంచిది. వర్షాలు తగ్గిన తర్వాత కోతలు ప్రారంభించొచ్చు. రైతులకు వ్యవసాయశాఖ నుంచి పూర్తిస్థాయిలో సహకారాన్ని అందిస్తాం. ’ జిల్లా వ్యవసాయ శాఖాధికారి అన్నపూర్ణ తెలిపారు.