Clay Ganesha మట్టి వినాయకుడిని పూజిద్దాం
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:12 AM
Let’s Worship the Clay Ganesha పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకుడిని పూజిద్దామని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్షించారు. ప్రజలందరూ మట్టి ప్రతిమలనే పూజించాలన్నారు.
డీజేలకు అనుమతి లేదు
కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
పార్వతీపురం, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకుడిని పూజిద్దామని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్షించారు. ప్రజలందరూ మట్టి ప్రతిమలనే పూజించాలన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ప్రతిమలు, రసాయన రంగులతో చేసిన విగ్రహాలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని తెలిపారు. మట్టితో చేసిన వినాయక ప్రతిమలు సులభంగా భూమిలో కలిసిపోతాయన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ శోభిక, జిల్లా పశు సంవర్థక శాఖాధికారి మన్మఽథరావు, డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావులకు మట్టి ప్రతిమలు, వ్రతకల్ప పుస్తకాలు కలెక్టర్ అందించారు. వినాయక నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఎక్కడా డీజేలకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. శబ్దకాలుష్యం లేకుండా మైక్‌సెట్లు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. పోలీసుల అనుమతితో నిర్ణీత కాలంలో మండపాలు ఏర్పాటు చేసుకోవాలని, నిమజ్జనం సమయంలో ప్రశాంతంగా ఉత్సవాలు జరుపుకోవచ్చని వెల్లడించారు. వర్షాల దృష్ట్యా నదులు ఉప్పొంగే అవకాశం ఉన్నందున నిమజ్జన సమయంలో గత ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ వైశాలి, డీఆర్వో కె.హేమలత, ఎస్‌డీసీ పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ఎం.సుధారాణి, జిల్లా వ్యవసాయ, ఉద్యానవన, పంచాయతీ వైద్య ఆరోగ్యశాఖాధికారులు , ఐసీడీఎస్, డ్వామా పీడీలు తదితరులు పాల్గొన్నారు.