Let's use it for good మంచికి వాడుకుందాం
ABN , Publish Date - Jun 30 , 2025 | 12:12 AM
Let's use it for good
మంచికి వాడుకుందాం
సోషల్ మీడియాతో ఉపయోగాలెన్నో
సక్రమంగా వాడుకుంటే మేలు
లేదంటే దుష్పరిణామాలు తప్పవు
నేడు ప్రపంచ సోషల్‌మీడియా దినోత్సవం
- రాజాంకు చెందిన ఓ యువకుడు ఇటీవల దుస్తుల దుకాణం ప్రారంభించాడు. తన షాపులో ఉన్న కొత్త మోడళ్లకు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అతి తక్కువ సమయంలోనే అత్యధికంగా లైక్స్ రావడమే కాకుండా వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతోంది. సోషల్ మీడియా సహకారంతో ఆయన అత్యధిక ఆదాయం పొందుతున్నాడు.
రాజాం, జూన్ 29(ఆంధ్రజ్యోతి): మనిషి జీవితంపై సోషల్ మీడియా పెను ప్రభావం చూపుతోంది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ సోషల్ మీడియాను ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. సాధారణంగా ఉదయం లేచిన వెంటనే దేవుడి చిత్రపటాలకు దండం పెడుతుంటారు. కానీ ఇప్పుడు చాలామంది లేవగానే సెల్‌ఫోన్ కోసం తడుముతుంటారు. లేచిన వెంటనే సోషల్ మీడియాను వీక్షిస్తుంటారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం వంటిని చూసుకుంటారు. సమాచార వ్యాప్తిలో సోషల్ మీడియాది కీలక పాత్ర. ఒక వ్యక్తి జీవితంలో కలిగే బాధ, ఆనందం, విజయం, అపజయం.. ఇలా అన్నిరకాల భావోద్వేగాలను అందరితో పంచుకోవడానికి ఇదో సాధనం. అయితే సోషల్ మీడియా వినియోగంలో చాలా జాగ్రత్తలు అవసరమని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల లాభాలతో పాటు నష్టాలు ఉంటాయంటున్నారు. సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది పేరుప్రఖ్యాతలు సంపాదించారు. అదే సోషల్ మీడియా కొందరి జీవితాలను తలకిందులు చేసింది. అందుకే సోషల్ మీడియాలో మీరు ఏం చేస్తారు? ఎలాంటి సమాచారం కోసం వెతుకుతారు? అనేది విశ్లేషించుకోవాలి. మనకు ఉపయోగం అనుకున్న వాటినే ఎంచుకోవాలి. సోమవారం ప్రపంచ సోషల్ మీడియా దినోత్సవం సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
జాగ్రత్తలు పాటించకపోతే నష్టం తప్పదు..
సోషల్ మీడియాను జాగ్రత్తగా వాడుకోకపోతే నష్టం తప్పదు. చాలామంది వ్యక్తిగత జీవితాలపై అనేక పోస్టులు పెడుతుంటారు. సమాచారాన్ని షేర్ చేస్తుంటారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో రాజకీయ, విధానాపరమైన పోస్టులే ఎక్కువగా దర్శనమిస్తుంటాయి. ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయాలు, న్యాయపరమైన విధానాలపై వచ్చే పోస్టులను ఇతరులకు పంపడం ద్వారా చిక్కుల్లో పడుతుంటాం. అనవసరంగా పోలీసు కేసుల బారిన పడుతుంటాం. అటువంటి సమయంలో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు సాక్ష్యాలుగా చూపుతున్నారు పోలీసులు. లేనిపోని లింకులు క్లిక్ చేయడం, పరిచయం లేని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్టులకు దూరంగా ఉండడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సవాళ్లు అసభ్యపదజాలాలు. కామెంట్ల రూపంలో కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారు. కొన్నిసార్లు మనం పెట్టే పోస్టులు, షేర్లు, కామెంట్లతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఓక వేళ నచ్చని పోస్టు, సమాచారం ఉంటే వాటిని చూడకపోవడం, అనుసరించకపోవడమే ఉత్తమం. ‘ముఖ్యంగా పిల్లలు సోషల్ మీడియాకు ఎడిక్ట్ కాకుండా చూసుకోవాలి. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని అనేక రకాలుగా సమాజంలో విచ్ఛిన్నకర శక్తులు ప్రవేశిస్తున్నాయి. ఇది గుర్తెరిగి ప్రతిఒక్కరూ బాధ్యతతో ఉండాల్సిన అవసరం ఉంది.’ అని శ్రీకాకుళానికి చెందిన వైద్య నిపుణుడు కళ్యాణబాబు చెబుతున్నారు.