పట్టుకోండి చూద్దాం!
ABN , Publish Date - May 31 , 2025 | 12:18 AM
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాలనే టార్గెట్ చేసుకొని బీభత్సం సృష్టిస్తున్నారు.
- జిల్లాలో పెరుగుతున్న చోరీలు
- దాడులకు సైతం తెగబడుతున్న దొంగలు
- పోలీసులకు సవాల్‌గా మారిన కేసులు
- వేధిస్తున్న సిబ్బంది కొరత
- తగ్గిన రాత్రి నిఘా
- ఈ నెల 28న అర్ధరాత్రి కొత్తవలస మండలం మంగళంపాలెంలో చోరీ జరిగింది. గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు రాపర్తి జగదీష్‌బాబు ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి 90 తులాల బంగారం, రూ.5 లక్షల నగదు దోచుకెళ్లారు. అర్ధరాత్రి ఇంటి వెనుకభాగం ద్వారా దొంగలు ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. వేకువజామున 3 గంటల సమయంలో కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
- ఈ నెల 24న చీపురుపల్లిలో భారీ దొంగతనం జరిగింది. ఓ ఇంటి యజమాని తన భార్య, పిల్లలతో కలిసి పుష్కరాలకు వెళ్లాడు. ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉండగా లోపలికి ప్రవేశించిన దొంగలు వారిపై దాడిచేశారు. తీవ్రంగా గాయపరిచారు. వారి ఒంటిపై ఉన్న 20 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఏడు గంటల పాటు వారు రక్తపుమడుగులో ఉండగా.. ఉదయం స్థానికులు గుర్తించారు. ఈ కేసులో పోలీసులు నిందితులను పట్టుకున్నట్టు తెలుస్తోంది.
- జిల్లా కేంద్రం విజయనగరంలో ఇటీవల దొంగల ముఠా హల్‌చల్ చేసింది. ఏకంగా వాణిజ్య సముదాయాల్లో చోరీలకు పాల్పడింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో వెలుగుచూశాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో గజపతినగరంలో ఏకకాలంలో 8 షాపుల్లో దొంగలు చోరీలకు పాల్పడ్డారు. విలువైన సొత్తును పట్టుకుపోయారు. బొబ్బిలిలో ఓ జ్యూయలరీ షాపు యాజమానిపై దాడిచేసి 40 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ కేసును పోలీసులు ఛేదించారు.
విజయనగరం, మే 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాలనే టార్గెట్ చేసుకొని బీభత్సం సృష్టిస్తున్నారు. ఇళ్లు, షాపులు, వాణిజ్య సముదాయాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. నిఘా పటిష్టంతో పాటు గస్తీ ముమ్మరం చేసినట్టు జిల్లా పోలీస్ యంత్రాంగం చెబుతున్నప్పటికీ రోజురోజుకీ దొంగతనాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇంటర్ లాకింగ్ సిస్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో పోలీస్ శాఖ ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లా మీదుగా అంతర్ రాష్ట్ర రహదారులు, రైలు మార్గం ఉండడం దొంగతనాల పెరుగుదలకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఒడిశాతో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారు జిల్లాకు చేరుతున్నట్టు గుర్తిస్తున్నారు. దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు.
పోలీస్ శాఖలో సిబ్బంది కొరత
జిల్లా పోలీసు శాఖను సిబ్బంది కొరత వేధిస్తోంది. ఓ వైపు శాంతిభద్రతల పరిరక్షణ, మరోవైపు ట్రాఫిక్ నియంత్రణ, ఇంకొకవైపు ప్రముఖుల భద్రత.. ఇలా విధుల నిర్వహణ పోలీసులకు కత్తిమీద సాములా మారింది. జిల్లాలో 34 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. విజయనగరంతో పాటు రాజాం, బొబ్బిలిలో పట్టణ పోలీస్ స్టేషన్లు కొనసాగుతున్నాయి. వీటితో పాటు సీసీఎస్, మహిళా, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. బీ గ్రేడ్ స్థాయిలో ఉన్న విజయనగరం పోలీస్ స్టేషన్లలో సైతం సిబ్బంది అరకొరగానే ఉన్నారు. సీ గ్రేడ్‌లో ఉన్న రాజాం, బొబ్బిలి పోలీస్‌స్టేషన్లలో సైతం అదే పరిస్థితి. జిల్లా పోలీస్ శాఖలో మూడు సబ్ డివిజన్లు ఉన్నాయి. ప్రస్తుతం ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీలు ముగ్గురు, డీఎస్పీలు 10 మంది శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. సీఐలు, ఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు 1,400 మంది విధులు నిర్వహిస్తున్నారు. సుమారు 300 మంది వరకూ హోంగార్డులు సేవలందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 14వేల మంది కానిస్టేబుళ్ల కొరత ఉన్నట్టు పోలీస్ యంత్రాంగం చెబుతోంది. జిల్లాలో వెయ్యి మంది కానిస్టేబుళ్లను నియమిస్తే కానీ అన్ని పోలీస్‌స్టేషన్లలో సిబ్బంది కొరత తీరదని అధికారులు చెబుతున్నారు. కొత్త కానిస్టేబుళ్లు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు.
నిద్దరోడుతున్న నిఘా..
జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారులు, కూడళ్లలో వందలాది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు పోలీస్ శాఖ చెబుతోంది. కానీ, ఇందులో చాలా కెమెరాలు పనిచేయడం లేదు. నైట్ బీట్ కూడా తగ్గుముఖం పట్టింది. ప్రధాన రహదారుల్లో పోలీసు సైరన్‌తో సరిపెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అర్ధరాత్రి తిరిగే వాహనదారుల ఫొటోలు, ఫింగర్ ప్రింట్స్ తీసుకొని వదిలేస్తున్నారన్న అపవాదు ఉంది. కానీ, నెలవారీ సమీక్షలో మాత్రం జిల్లా వ్యాప్తంగా నిఘా పెంచినట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా పోలీస్ శాఖ దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.
ఇంటర్ లాకింగ్‌ను వినియోగించుకోవాలి
జిల్లాలో దొంగతనాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిసారించాం. వీలైనంత త్వరగా కేసులను ఛేదిస్తున్నాం. చోరీ సొత్తును రికవరీ చేస్తున్నాం. చీపురుపల్లిలో జరిగిన చోరీలో నిందితులను పట్టుకున్నాం. ఇళ్లకు తాళం వేసి తీర్థయాత్రలు, శుభకార్యాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు విధిగా పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలి. ఇంటర్ లాకింగ్ సిస్టంను వినియోగించుకోవాలి. దొంగతనాల నియంత్రణకు ఇంటర్ లాకింగ్ సిస్టం చక్కటి సాధనం. దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
-వకూల్ జిందాల్, ఎస్పీ, విజయనగరం